త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRICS Summit | పుతిన్‌, జిన్‌పింగ్‌ కార్లు ఎందుకంత స్పెషల్‌..? మిస్సైల్స్‌ దాడుల‌ను త‌ట్టుకుంటాయా..?

BRICS Summit | బ్రిక్స్‌-2026 సదస్సు రెండురోజులు ఢిల్లీ వేదిక‌గా జ‌రుగ‌నున్న‌ది. ఈ నేపథ్యంలో బ్రిక్ దేశాల అధినేత‌లు భార‌త్‌కు త‌ర‌లివ‌స్తున్నారు. ప‌లు దేశాధినేత‌లు భార‌త్‌కు చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ భద్రత, అధికారిక కాన్వాయ్‌లపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

P

National | Published On Sep 11, 2026, 5.25 pm IST

BRICS Summit | పుతిన్‌, జిన్‌పింగ్‌ కార్లు ఎందుకంత స్పెషల్‌..? మిస్సైల్స్‌ దాడుల‌ను త‌ట్టుకుంటాయా..?
Advertisement

BRICS Summit | బ్రిక్స్‌-2026 సదస్సు రెండురోజులు ఢిల్లీ వేదిక‌గా జ‌రుగ‌నున్న‌ది. ఈ నేపథ్యంలో బ్రిక్ దేశాల అధినేత‌లు భార‌త్‌కు త‌ర‌లివ‌స్తున్నారు. ప‌లు దేశాధినేత‌లు భార‌త్‌కు చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ భద్రత, అధికారిక కాన్వాయ్‌లపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. విదేశీ పర్యటనల్లో వీరిద్దరూ తమ దేశాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన అధ్యక్ష కార్లనే వినియోగిస్తారు. రష్యా ‘ఔరస్‌ సెనాట్‌’, చైనా ‘హాంగ్‌కి ఎన్‌701’ సాధారణ లగ్జరీ కార్లకు భిన్నంగా అత్యున్నత భద్రత, గోప్యత, అధికారిక ప్రొటోకాల్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవి. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రు నేత‌లు ప్ర‌యాణించే వాహ‌నాల ప్ర‌త్యేకత ఏంటో తెలుసుకుందాం..!

పుతిన్ అధికారిక వాహ‌నం ఔరస్‌ సెనాట్‌..

ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ అధికారిక వాహనం ఔరస్‌ సెనాట్‌. రష్యా లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఔరస్‌, ప్రభుత్వ సంస్థల సహకారంతో దీన్ని అభివృద్ధి చేసింది. దాదాపు ఏడు మీటర్ల పొడవుతో భారీగా ఉండే ఈ కారులో 4.4 లీటర్ల ట్విన్‌ టర్బో వీ8 ఇంజిన్‌, హైబ్రిడ్‌ వ్యవస్థ ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 598 హార్స్‌పవర్‌, 880 ఎన్‌ఎం టార్క్‌ ఉత్పత్తి చేస్తుందని అంచనా. ఆర్మర్డ్‌ వెర్షన్‌లో అత్యున్నత బాలిస్టిక్‌ రక్షణ, బుల్లెట్‌ప్రూఫ్‌ గ్లాస్‌, రన్‌ఫ్లాట్‌ టైర్లు, అత్యవసర భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. ఫైర్‌, రసాయన దాడుల నుంచి రక్షణ కల్పించే ప్రత్యేక వ్యవస్థలున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడి భద్రతకు సంబంధించిన పూర్తి వివరాలను రష్యా అధికారికంగా బ‌య‌ట‌కు చెప్ప‌దు. భద్రతతోపాటు విలాసవంతమైన సౌకర్యాలకూ ఔరస్‌ ప్రాధాన్యమిచ్చింది. లెదర్‌ సీట్లు, వుడ్‌ ఫినిష్‌, పెద్ద డిస్‌ప్లేలు, ప్రైవసీ సెగ్మెంటేష‌న్‌, సీట్ల హీటింగ్‌, కూలింగ్‌, మసాజ్ త‌దిత‌ర సదుపాయాలు ఇందులో ఉన్న‌ట్లు తెలుస్తోంది. విదేశీ పర్యటనల్లోనూ పుతిన్‌ కాన్వాయ్‌తోపాటు ఈ కారును అక్క‌డికి తీసుకువెళ్తారు. 2025లో చైనాలో జరిగిన ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. పుతిన్‌తో కలిసి ఔరస్‌లో ప్రయాణించడం అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

రెడ్ ఫ్లాగ్‌.. జిన్‌పింగ్‌ హాంగ్‌కి ఎన్‌701

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అధికారిక కాన్వాయ్‌లో కనిపించే ప్రత్యేక వాహనం హాంగ్‌కి ఎన్‌701. చైనీస్‌లో హాంగ్‌కి అంటే ‘ఎర్ర జెండా’. 1958లో ప్రారంభమైన ఈ బ్రాండ్‌ చైనా ప్రభుత్వ ప్రముఖులతో దశాబ్దాలుగా అనుబంధం ఉన్న‌ది. అయితే, ఎన్‌701 సాధారణ వినియోగదారులకు విక్రయించే మోడల్‌ కాదు. ప్రత్యేకంగా అధ్యక్షుడి అధికారిక వినియోగం కోసం రూపొందించిన లిమోసిన్‌. 2022లో జిన్‌పింగ్‌ హాంకాంగ్‌ పర్యటన సందర్భంగా తొలిసారి బహిరంగంగా ఈ కారు క‌నిపించింది. అనంతరం సౌదీ అరేబియా, ఈజిప్ట్‌ వంటి విదేశీ పర్యటనల్లోనూ ఆయన కాన్వాయ్‌లో దర్శనమిచ్చింది. దీని ఇంజిన్‌, పనితీరు, కవచం మందం, గ్లాస్‌ రక్షణ సామర్థ్యం వంటి కీలక వివరాలను చైనా అధికారికంగా బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌లేదు. బుల్లెట్‌ప్రూఫ్‌, బాంబ్‌ప్రూఫ్‌, అణు దాడినీ తట్టుకోగలదనే ప్ర‌చారం జ‌రుగుతోంది. వీటికి అధికారిక ఆధారాలు మాత్రం లేవు. అధ్యక్షుడి భద్రతా వ్యవస్థల అసలు సామర్థ్యాలను గోప్యంగా ఉంచడం సహజమే. పొడవైన బాడీ, భారీ ఫ్రంట్‌ గ్రిల్‌, క్రోమ్‌ అలంకరణ, విశాలమైన వెనుక క్యాబిన్‌ దీని ప్రత్యేకత. అధికారిక ప్రొటోకాల్‌లో భాగంగా ముందు భాగంలో జాతీయ జెండాలను అమర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి.

రెండింటి లక్ష్యం ఒక్కటే..

ఔరస్‌ సెనాట్‌, హాంగ్‌కి ఎన్‌701 వేర్వేరు దేశాలకు చెందినవైనా వాటి ప్రధాన ఉద్దేశం ఒక్కటే. ఇవి సాధారణ విలాసవంతమైన కార్లు కాదు. దేశాధినేతల భద్రత, గోప్యత, అధికారిక ప్రొటోకాల్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలు. విదేశీ పర్యటనల్లోనూ అధికారిక కాన్వాయ్‌లో భాగంగా ప్రయాణిస్తూ తమ దేశాల ఆటోమొబైల్‌ సామర్థ్యాన్ని, జాతీయ ప్రతిష్ఠను చాటుతున్నాయి. అందుకే వీటి విలువ ఇంజిన్‌ శక్తి, విలాసవంతమైన సదుపాయాల్లో మాత్రమే లేదు. భద్రతా వ్యవస్థలు, గోప్యత, అధికారిక ప్రొటోకాల్‌, జాతీయ ప్రతిష్ఠకు వీటిని మూవింగ్ సిబ‌ల్స్‌గా అభివ‌ర్ణిస్తారు.

Advertisement
Advertisement