త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Smriti Irani | రాజ్య‌స‌భ‌కు మ‌ళ్లీ వ‌రుణ్ గాంధీ, స్మృతి ఇరానీ..!

Smriti Irani | ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రాజ్య‌స‌భ ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఆ రాష్ట్రం నుంచి రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న 10 మంది ఎంపీల ప‌ద‌వీకాలం అక్టోబ‌ర్ నెల‌లో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో రాజ్య‌స‌భకు బ‌రిలో దింపే అభ్య‌ర్థుల ఎంపిక‌పై బీజేపీ తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తోంది.

S

National | Published On Sep 29, 2026, 8.27 am IST

Smriti Irani | రాజ్య‌స‌భ‌కు మ‌ళ్లీ వ‌రుణ్ గాంధీ, స్మృతి ఇరానీ..!
Advertisement

Smriti Irani | త్రినేత్ర న్యూస్ : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రాజ్య‌స‌భ ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఆ రాష్ట్రం నుంచి రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న 10 మంది ఎంపీల ప‌ద‌వీకాలం అక్టోబ‌ర్ నెల‌లో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో రాజ్య‌స‌భకు బ‌రిలో దింపే అభ్య‌ర్థుల ఎంపిక‌పై బీజేపీ తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తోంది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని.. అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసే ప‌నిలో బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం నిమ‌గ్న‌మైంది.

ఓబీసీలు, జాట్లు, రాజ్‌పుత్‌లు, దళితులు, మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది. బ్రాహ్మణ ఓటు బ్యాంకును నిలబెట్టుకోవడంతో పాటు గత లోక్‌సభ ఎన్నికల్లో దూరమైన నాన్‌-యాదవ్‌ ఓబీసీ, ముఖ్యంగా కుర్మీ, నాన్‌-జాటవ్‌ ఎస్సీ వర్గాలను తిరిగి తమవైపు తిప్పుకునే వ్యూహంపై దృష్టి పెట్టింది.

ఈ క్ర‌మంలో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి లాభ‌ప‌డే విధంగా, సామాజిక స‌మీక‌రణాల‌ను దృష్టిలో ఉంచుకుని అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం బీజేపీ కోర్ క‌మిటీ ల‌క్నోలో స‌మావేశ‌మై సుదీర్ఘంగా చ‌ర్చించింది. మాజీ ఎంపీలు వ‌రుణ్ గాంధీ, స్మృతి ఇరానీని మ‌ళ్లీ రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని పార్టీ నాయ‌క‌త్వం యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. వీరితో పాటు సంజీవ్ బ‌లియాన్, స‌త్య‌పాల్ సింగ్, హ‌రీశ్ ద్వివేది, సురేశ్ రాణాతో పాటు త‌దిత‌ర పేర్లు వినిపిస్తున్నాయి.

ప‌దింటిలో ప‌దో సీటుపైనే క‌స‌ర‌త్తు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి మొత్తం 10 రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ కానున్నాయి. ప్ర‌స్తుతం యూపీ అసెంబ్లీలో ఉన్న బ‌లం ప్ర‌కారం అధికార బీజేపీకి ఏడు రాజ్య‌స‌భ స్థానాలు ద‌క్కుతాయి. స‌మాజ్‌వాదీ పార్టీకి రెండు సీట్లు ద‌క్క‌నున్నాయి. ఇక మిగిలింది ప‌దో స్థాన‌మే. ఈ స్థానాన్ని ద‌క్కించుకోవాల‌నుకుంటే క్రాస్ ఓటింగ్ జ‌ర‌గాల్సిందే. ఎందుకంటే ఏ పార్టీకి మెజార్టీ వ‌చ్చే అవ‌కాశం లేదు.

యూపీ శాస‌న‌స‌భ స‌భ్యుల సంఖ్య 403. ప్ర‌స్తుతం 396 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు 255 మంది ఉన్నారు. ఇక‌ ఒక రాజ్య‌స‌భ స్థానాన్ని గెలుచుకునేందుకు మొద‌టి ప్రాధాన్య‌త ఓట్లు 37 అవ‌స‌రం. ఈ లెక్క‌ ప్ర‌కారం బీజేపీ ఏడు సీట్లను గెలుచుకోగ‌ల‌దు. స‌మాజ్‌వాదీ పార్టీ బ‌లం 101 కాగా, ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే వీరి బ‌లం ప్ర‌కారం రెండు సీట్లలో గెల‌వ‌నుంది. ఇక మిగిలింది ప‌దో స్థాన‌మే. బీజేపీ ఏడు స్థానాలు గెలిచిన త‌ర్వాత కూడా 33 ఓట్లు ఉంటాయి. అంటే మ‌రో నాలుగు ఓట్లు అవ‌స‌రం. ఈ నాలుగు ఓట్ల‌ను క్రాస్ ఓటింగ్ ద్వారా చేజిక్కించుకుని ప‌దో స్థానాన్ని కూడా గెలిచేందుకు వ్యూహం ప‌న్నిన‌ట్లు తెలుస్తుంది.

Advertisement
Advertisement