త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delimitation | మళ్లీ డీలిమిటేషన్..? దారి చూపిన తృణమూల్ ఓటమి..!

Delimitation | డీలిమిటేషన్ బిల్లు తిరిగి ప్రాణం పోసుకోనున్నది. గత ఏప్రిల్ నెలలో... అవసరమైన సంఖ్యా బలం లేక వీగిపోయిన ఈ బిల్లును ఈ సారి ఎలాగైనా సరే ఆమోదించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సంకల్పించుకుంటున్నది. ఇందుకోసం అవసరమైన అన్ని రాజకీయ సమీకరణాల కోసం ప్రయత్నించనున్నది. ఎటువంటి న్యాయ పరమైన, విధాన పరమైన లోపాలు లేకుండా బిల్లును పకడ్బందీగా రూపొందించే పనిలో పడింది.

S

National | Published On Jun 10, 2026, 7.59 pm IST

Delimitation | మళ్లీ డీలిమిటేషన్..? దారి చూపిన తృణమూల్ ఓటమి..!
Advertisement

శీతాకాలపు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు
సన్నద్ధమవుతున్న బీజేపీ ప్రభుత్వం
సరికొత్త ముసాయిదాపై న్యాయ మంత్రిత్వ శాఖ కసరత్తు
దారి చూపిన తృణమూల్ ఓటమి
కలిసొస్తున్న ఇండియా కూటమి లొసుగులు
బిల్లుకు డీఎంకేను కూడా ఒప్పించాలని నిర్ణయం
బిల్లు ఆమోదం కోసం లెక్కలన్నీ
జాగ్రత్తగా సరిచూసుకుంటున్న బీజేపీ
జూలై మూడో వారంలో పార్లమెంటు సమావేశాలు

Delimitation | త్రినేత్ర.న్యూస్ : డీలిమిటేషన్ బిల్లు తిరిగి ప్రాణం పోసుకోనున్నది. గత ఏప్రిల్ నెలలో... అవసరమైన సంఖ్యా బలం లేక వీగిపోయిన ఈ బిల్లును ఈ సారి ఎలాగైనా సరే ఆమోదించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సంకల్పించుకుంటున్నది. ఇందుకోసం అవసరమైన అన్ని రాజకీయ సమీకరణాల కోసం ప్రయత్నించనున్నది. ఎటువంటి న్యాయ పరమైన, విధాన పరమైన లోపాలు లేకుండా బిల్లును పకడ్బందీగా రూపొందించే పనిలో పడింది. ఈ దిశగా కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ .. డీలిమిటేషన్ కు సంబంధించి సరికొత్త ముసాయిదాను రూపొందించే పనిలో నిమగ్నమైంది. వచ్చే నెల మూడో వారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాలపు సమావేశాల్లో ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టనున్నారు.

తృణమూల్ ఓటమితో..

బీజేపీ కంట్లో నలుసులా మారిన తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడంతో కాషాయ దళంలో సరికొత్త ఉత్సాహం నెలకొన్నది. దానికి కొనసాగింపుగానే ఆ రాష్ట్రంలో బీజేపీ తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నది. ఈ నేపథ్యంలోనే తృణమూల్ కు చెందిన 29 మంది లోక్ సభ ఎంపీలు ఎన్డీఏకు మద్దతు పలుకుతారనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా లోక్ సభలోని కూటముల గణాంకాల్లో తేడా మొదలైంది.

190కి పడిపోనున్న ఇండియా బ్లాక్

కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకేలు వైదొలగడంతో.. కూటమి బలం సన్నగిల్లింది. 2024 ఎన్నికల తర్వాత ఇండియా బలం 234. కానీ ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఆమ్ ఆద్మీ (3 ఎంపీలు), డీఎంకే (22 మంది ఎంపీలు) ఇండియా బ్లాక్ నుంచి వైదొలగడంతో ఈ సంఖ్య కాస్తా 209కి పడిపోయింది. టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు లోక్ సభలో తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారనే ప్రచారంతో తృణమూల్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ఇదే గనుక జరిగితే ఇండియా బ్లాక్ బలం 190 కి పడిపోనున్నది.

54 మంది బలం లేక..

గత ఏప్రిల్ నెలలో ఎన్డీఏ ప్రభుత్వం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. ఇందుకు రాజ్యాంగ సవరణ అవసరమైంది. నాడు లోక్ సభలో జరిగిన ఓటింగ్ లో 528 మంది ఎంపీలు పాల్గొనగా.. మూడింటి రెండొంతుల మెజారిటీకి 352 మంది ఎంపీలు అవసరమయ్యారు. 298 మంది ఎంపీలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. 230 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో 54 మంది బలం తగ్గింది. అయితే ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు బీజేపీకి కలిసొస్తున్నాయి. ప్రస్తుతం లోక్ సభలో ఎన్డీఏ బలం 293గా ఉంది. రాజ్య సభలో 164 గా ఉంది. అయితే బిల్లు ఆమోదం కోసం ఎన్డీఏ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.

లోక్ సభలో 67 మంది..

లోక్ సభలో ఎంపీల సంఖ్య 543. అయితే 3 స్థానాలు ఖాళీగా ఉండడంతో ప్రస్తుతం 540 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. దీని ప్రకారం మూడింటి రెండొంతుల మెజారిటీకి ఎన్డీఏకు 360 మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం లోక్ సభలో ఎన్డీఏ బలం 293. మరో 67 మంది ఎంపీల కోసం బీజేపీ బహుముఖ వ్యూహం రచిస్తున్నది. ప్రస్తుతం టీఎంసీ నుంచి 20 మంది ఎంపీలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆ సంఖ్య 313కి పెరగనుంది. 22 మంది ఎంపీలున్న డీఎంకే ఇప్పటికే ఇండియా కూటమితో తెగతెంపులు చేసుకున్నందున వారిని ఎలాగైనా సరే తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ మంత్రాంగం ప్రారంభించింది. వారు కూడా మద్దతు తెలిపితే ఆ సంఖ్య 325కు పెరగనుంది. మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన 9 మంది ఎంపీల్లో ఆరుగురు ఎన్డీఏకు మద్దతు పలుకుతారనే ప్రచారం జరుగుతున్నది. వీరు కాకుండా చిన్న పార్టీలతో సంప్రదింపులు జరపడం ద్వారా క్రాస్ ఓటింగ్ కు ప్రోత్సహించడం ద్వారా ..బిల్లు ఆమోదానికి అవసరమైన 67 మంది ఎంపీల మద్దతు దక్కించుకోవాలని బీజేపీ భావిస్తున్నది.

రాజస్యభలో మరో 15 మంది

రాజ్యసభలో ఎన్డీఏ బలం 149. బిల్లు ఆమోదానికి మరో 15 మంది ఎంపీలు అవసరమవుతారు. ఇందుకోసం ఎన్డీఏ 8 మంది డీఎంకే ఎంపీల మద్దతు కోరనుంది. అందుకోసం వారు పెట్టే షరతులను ఒప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మరోవైపు ఇప్పటికే తృణమూల్ ఎంపీ సుఖేందర్ శేఖర్ రాయ్ రాజీనామా చేశారు. ఆయన బీజేపీ ద్వారా తిరిగి ఎన్నిక కానున్నారు. మిగిలిన టీఎంసీ ఎంపీలకు కూడా ఇదే ఫార్ములాను వాడనున్నారు. దీంతో ఎన్డీఏకు అటు లోక్ సభలో, ఇటు రాజ్య సభలో 2/3 మెజారిటీ దక్కనుంది. ఈ రాజకీయ సమీకరణాలు సరిచూసుకున్న తర్వాత డీలిమిటేషన్ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదింపజేసుకోవాలని బీజేపీ భావిస్తున్నది.

Advertisement
Advertisement