త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | మోదీకి నెహ్రూకు.. నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్

Ponnam Prabhakar | ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన పేరుతో దేశ నిర్మాణానికి పునాదులు వేసిన జవహర్‌లాల్ నెహ్రూని తక్కువ చేసి మాట్లాడడం చరిత్రను అవమానించడమే అని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిప‌డ్డారు. మోదీని, నెహ్రూ గారితో పోల్చడం సరైన చారిత్రక అవగాహన లేకుండా చేసే ప్రయత్నమన్నారు.

S

Telangana | Published On Jun 10, 2026, 4.15 pm IST

Ponnam Prabhakar | మోదీకి నెహ్రూకు.. నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన పేరుతో దేశ నిర్మాణానికి పునాదులు వేసిన జవహర్‌లాల్ నెహ్రూని తక్కువ చేసి మాట్లాడడం చరిత్రను అవమానించడమే అని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిప‌డ్డారు. మోదీని, నెహ్రూ గారితో పోల్చడం సరైన చారిత్రక అవగాహన లేకుండా చేసే ప్రయత్నమన్నారు. మోదీకి, నెహ్రూకి న‌క్క‌కు నాగ‌లోకానికి ఉన్నంత తేడా ఉంద‌న్నారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ సేవలను కించపరిచే విధంగా జరుగుతున్న వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు.

స్వాతంత్య్రం వచ్చిన సమయంలో దేశం తీవ్రమైన ఆహార కొరత, నిరుద్యోగం, పారిశ్రామిక వెనుకబాటు, మౌలిక వసతుల లేమితో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నదని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల నుంచి భారతదేశాన్ని స్వావలంబన దిశగా నడిపించి, వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలకు బలమైన పునాదులు వేసిన నాయకుడు జవహర్‌లాల్ నెహ్రూ అని పేర్కొన్నారు.

దేశ ఆహార భద్రతకు బాటలు

నెహ్రూ దూరదృష్టితో అమలు చేసిన పంచవర్ష ప్రణాళికలు, భారీ సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ఉన్నత విద్యా సంస్థలు నేటి భారత అభివృద్ధికి మూలస్తంభాలుగా నిలిచాయని అన్నారు. బాక్రా నంగల్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లు కోట్లాది రైతులకు సాగునీరు అందించి దేశ ఆహార భద్రతకు బాటలు వేసాయని తెలిపారు.

నెహ్రూ వేసిన పునాదులపై నేడు అనేక రంగాలు అభివృద్ధి

నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థలకు సీఈవోలుగా భారతీయులు నాయకత్వం వహిస్తున్నారంటే, దేశంలో ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా వ్యవస్థలు, శాస్త్రీయ దృక్పథం, పరిశోధనా సంస్థలే కారణమని మంత్రి అన్నారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నెహ్రూ వేసిన పునాదులపై నేడు అనేక రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని, ఆ విజయాలను పూర్తిగా తమ ఖాతాలో వేసుకోవడం తగదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మంత్రిగా సేవ‌లందించిన పురందేశ్వ‌రి వంటి నాయకులు కూడా చరిత్రాత్మక వాస్తవాలను విస్మరించి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. స్వాతంత్య్ర‌ ఉద్యమంలో విశేష త్యాగాలు చేసిన నాయకుల పాత్రను తక్కువ చేసి చూపే ప్రయత్నాలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.

చిరస్థాయిగా భారత చరిత్రలో నెహ్రూ పాత్ర

గత 12 సంవత్సరాల కేంద్ర పాలనలో ప్రజల అసలు సమస్యల పరిష్కారం, ఉపాధి కల్పన, విద్యా, వైద్య రంగాల బలోపేతం, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికల కంటే ప్రచార రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత లభించిందని మంత్రి విమర్శించారు. జవహర్‌లాల్ నెహ్రూ స్ఫూర్తి, దేశ నిర్మాణంలో ఆయన పాత్ర భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. దేశ అభివృద్ధికి పునాదులు వేసిన మహానేతల సేవలను కించపరిచే ప్రయత్నాలను ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement