త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BCI Chairman Apology | సుప్రీంకోర్టు అక్షింతలు.. వెనక్కి తగ్గిన BCI: నల్సార్ లా స్టూడెంట్స్‌కు చైర్మన్ బహిరంగ క్షమాపణ

సుప్రీంకోర్టు చీవాట్లతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) వెనక్కి తగ్గింది. నల్సార్ లా విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ వివాదంపై స్వయంగా చైర్మన్ క్షమాపణలు చెప్పారు.

J

National | Published On Aug 15, 2026, 9.30 pm IST

BCI Chairman Apology | సుప్రీంకోర్టు అక్షింతలు.. వెనక్కి తగ్గిన BCI: నల్సార్ లా స్టూడెంట్స్‌కు చైర్మన్ బహిరంగ క్షమాపణ
Advertisement
  • హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నల్సార్ (NALSAR) యూనివర్సిటీ విద్యార్థులకు BCI ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా క్షమాపణలు
  • స్నాతకోత్సవానికి సీజేఐ సూర్యకాంత్‌ను పిలవడాన్ని వ్యతిరేకించిన 2026 బ్యాచ్‌పై గతంలో ఎన్‌రోల్‌మెంట్ బ్యాన్ విధించిన BCI
  • విద్యార్థుల నిరసన హక్కును (Right to protest) సమర్థిస్తూ BCI నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు
  • తాజాగా విద్యార్థులకు భావప్రకటనా స్వేచ్ఛ ఉందని, తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరుతూ BCI చైర్మన్ బహిరంగ లేఖ

BCI Chairman Apology | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌ (Hyderabad) లోని ప్రతిష్టాత్మక 'నల్సార్' (NALSAR) యూనివర్సిటీ విద్యార్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా బహిరంగ క్షమాపణలు చెప్పారు. విద్యార్థుల స్వేచ్ఛను, హక్కులను గౌరవించాల్సిందేనని స్పష్టం చేస్తూ.. గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వివాదానికి ఆయన ముగింపు పలికారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లా స్టూడెంట్స్ అయిన 'యంగ్ ఫ్రెండ్స్' ను ఉద్దేశించి ఆయన ఒక లేఖను విడుదల చేశారు.

అసలు వివాదం ఏంటి?

నల్సార్ 2026 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ విద్యార్థులు తమ స్నాతకోత్సవానికి (Convocation) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని వ్యతిరేకించారు. ఢిల్లీలో జరిగిన ఓ నిరసన కార్యక్రమంపై సీజేఐ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన BCI.. ఆ బ్యాచ్ విద్యార్థులెవరూ భవిష్యత్తులో అడ్వకేట్లుగా ఎన్‌రోల్ చేసుకోకుండా బ్యాన్ విధిస్తూ ఆగస్టు 13న వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసింది. దేశ అత్యున్నత న్యాయమూర్తిని గౌరవించని వారు బాధ్యతగల లాయర్లు, జడ్జిలు కాలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

సుప్రీంకోర్టు ఎంట్రీతో సీన్ రివర్స్

ఈ వివాదం కాస్తా సుప్రీంకోర్టుకు (Supreme Court) చేరింది. అయితే, BCI తీసుకున్న ఈ కఠిన నిర్ణయాన్ని ఏకంగా సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనమే తప్పుబట్టింది. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు (Right to protest) ఉంటుందని, వారిపై ఇలాంటి అనవసరపు యాక్షన్ తీసుకోవడం ఏమాత్రం సరికాదని BCIకి మొట్టికాయలు వేసింది. నల్సార్ విద్యార్థులు లేదా ఫ్యాకల్టీపై ఎలాంటి శిక్షాత్మక చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది. దీంతో దిగివచ్చిన BCI ఆ ఎన్‌రోల్‌మెంట్ బ్యాన్ ఆర్డర్‌ను వెంటనే వెనక్కి తీసుకుంది.

నాకు ఎలాంటి ఈగో లేదు.. క్షమించండి

తాజాగా ఈ ఘటనపై స్పందించిన BCI చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా (బీజేపీ రాజ్యసభ ఎంపీ కూడా) విద్యార్థులకు క్షమాపణలు చెబుతూ లేఖ రాశారు. "ఈ వివాదంలో నా మాటలు లేదా నా లేఖ వల్ల మన న్యాయ విద్యార్థుల మనోభావాలు దెబ్బతింటే, నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. ఈగోలు (Ego), పట్టింపులకు ఇక్కడ తావులేదు. విద్యార్థులకు భావప్రకటనా స్వేచ్ఛ (Freedom of expression) ఎప్పుడూ ఉంటుంది" అని ఆయన స్పష్టం చేశారు.

భవిష్యత్ లీడర్లు మీరే..

శాంతియుతంగా విభేదించడం, ప్రశ్నించడం, నిరసన తెలపడం అనేది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో భాగమని మిశ్రా తన లేఖలో పేర్కొన్నారు. లా స్టూడెంట్స్ (Law students) స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేంత పరిణతి చెందిన వారని.. వాళ్లపై ఎవరి ఒత్తిడీ ఉండకూడదని ఆయన తెలిపారు. స్నాతకోత్సవానికి హాజరుకావాలా వద్దా అనేది పూర్తిగా వాళ్ల ఇష్టమని స్పష్టం చేశారు. రేపటి రోజున ఈ విద్యార్థులే అడ్వకేట్లు, సీనియర్ న్యాయవాదులు, జడ్జిలు తదితర ఉన్నత స్థానాలకు వెళ్తారని.. న్యాయవ్యవస్థ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని ప్రశంసించారు.

Advertisement
Advertisement