త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Assam UCC Bill | అస్సాంలో ఉమ్మడి పౌర స్మృతికి గ్రీన్ సిగ్నల్: లివ్-ఇన్ జంటలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. లేదంటే జైలే!

అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్, గుజరాత్ తర్వాత ఉమ్మడి పౌర స్మృతి (UCC) బిల్లును ఆమోదించిన మూడో రాష్ట్రంగా రికార్డు సృష్టించింది.

J

National | Published On May 27, 2026, 3.43 pm IST

Assam UCC Bill | అస్సాంలో ఉమ్మడి పౌర స్మృతికి గ్రీన్ సిగ్నల్: లివ్-ఇన్ జంటలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. లేదంటే జైలే!
Advertisement

Assam UCC Bill | త్రినేత్ర.న్యూస్ : అస్సాం (Assam) రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ సర్కారు బుధవారం అసెంబ్లీలో ప్రతిష్టాత్మక 'ఉమ్మడి పౌర స్మృతి' (UCC) బిల్లును ఆమోదించింది. ఐదు రోజుల అసెంబ్లీ సమావేశాల చివరి రోజున విపక్షాల ఆందోళనల మధ్యే ఈ బిల్లును సభ ఆమోదించింది. దీంతో ఉత్తరాఖండ్, గుజరాత్ తర్వాత దేశంలో యూసీసీని అమలు చేయనున్న మూడో రాష్ట్రంగా అస్సాం చరిత్రకెక్కింది.

బహుభార్యత్వంపై బ్యాన్.. లివ్-ఇన్‌కు రిజిస్ట్రేషన్

ఈ కొత్త చట్టం ప్రకారం, రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని (Polygamy) పూర్తిగా నిషేధించారు. అలాగే, 'లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌'లో (Live-in relationship) ఉండే జంటలు తమ బంధాన్ని తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పెళ్లికి కనీస వయసు పురుషులకు 21 ఏళ్లు, మహిళలకు 18 ఏళ్లుగా ఖరారు చేశారు. అయితే, రాష్ట్రంలోని గిరిజన సంస్కృతులను పరిరక్షించే ఉద్దేశంతో షెడ్యూల్డ్ తెగలకు (STs) మాత్రం ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు.

మహిళల హక్కుల రక్షణ కోసమే

వివాహం, విడాకులు, ఆస్తి పంపకాలు, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లకు సంబంధించిన చట్టాలను సరళీకరించి.. అందరికీ సమాన న్యాయం చేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) పేర్కొన్నారు. వివాహం, విడాకుల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయడం ద్వారా భార్యాభర్తలకు చట్టపరమైన రక్షణ, భరణం, ఆస్తి హక్కులు దక్కుతాయన్నారు. "లివ్-ఇన్ జంటలకు, వారికి పుట్టే పిల్లలకు కూడా చట్టబద్ధమైన హక్కులు కల్పించడం ఇదే తొలిసారి" అని ఆయన వివరించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు

ఈ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

బహుభార్యత్వం: బహుభార్యత్వానికి పాల్పడితే (భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 82 ప్రకారం) 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.

లివ్-ఇన్ రిజిస్ట్రేషన్: లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ను నెల రోజుల్లోగా రిజిస్టర్ చేసుకోకపోతే 3 నెలల జైలు లేదా రూ.10 వేల జరిమానా విధిస్తారు. తప్పుడు సమాచారం ఇస్తే 3 నెలల జైలుతో పాటు రూ.25 వేల ఫైన్ విధిస్తారు.

అక్రమ విడాకులు: చట్టవిరుద్ధంగా విడాకులు తీసుకుంటే 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు.

పెళ్లి రిజిస్ట్రేషన్: పెళ్లి లేదా విడాకులను 60 రోజుల్లోగా రిజిస్టర్ చేసుకోకపోతే రూ.10 వేల ఫైన్ కట్టాల్సి ఉంటుంది. నకిలీ పత్రాలు సమర్పిస్తే జైలు శిక్ష ఖాయం.

విపక్షాల అభ్యంతరం

కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, రైజోర్ దళ్ వంటి ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. చట్టం తెచ్చే ముందు అన్ని వర్గాలతో చర్చలు జరపాలని, ఈ బిల్లును మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు సెలెక్ట్ కమిటీకి (Select Committee) పంపాలని డిమాండ్ చేశాయి. విపక్షాల ఆందోళనల మధ్యే ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదింపజేసుకుంది.

Advertisement
Advertisement