త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amarnath Yatra 2026 | భక్తిశ్రద్ధలతో అమర్‌నాథ్ ‘ప్రథమ పూజ’.. జులై 3 నుంచి యాత్ర ప్రారంభం!

జమ్ముకశ్మీర్‌లోని పవిత్ర అమర్‌నాథ్ గుహలో ఎల్‌జీ మనోజ్ సిన్హా 'ప్రథమ పూజ' నిర్వహించారు. జులై 3 నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే.

J

National | Published On Jun 29, 2026, 7.11 pm IST

Amarnath Yatra 2026 | భక్తిశ్రద్ధలతో అమర్‌నాథ్ ‘ప్రథమ పూజ’.. జులై 3 నుంచి యాత్ర ప్రారంభం!
Advertisement
  • జ్యేష్ట పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ అమర్‌నాథ్ గుహలో ప్రథమ పూజలు నిర్వహించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
  • జులై 3వ తేదీన పహల్గామ్, బల్తాల్ మార్గాల ద్వారా లాంఛనంగా ప్రారంభం కానున్న 57 రోజుల వార్షిక యాత్ర
  • భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి జులై 2వ తేదీన ఉదయం 4 గంటలకు యాత్రకు బయలుదేరనున్న తొలి భక్తుల బ్యాచ్
  • ఆగస్టు 28వ తేదీన రక్షా బంధన్ పర్వదినం రోజున ముగియనున్న శ్రీ అమర్‌నాథ్ యాత్ర

Amarnath Yatra 2026 | శ్రీ అమర్‌నాథ్ యాత్రకు (Shri Amarnath Yatra) సర్వం సిద్ధమైంది. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ (LG) మనోజ్ సిన్హా సోమవారం పవిత్ర అమర్‌నాథ్ గుహలో 'ప్రథమ పూజ' (Pratham Puja) నిర్వహించారు. జ్యేష్ట పౌర్ణమిని పురస్కరించుకుని ఈ పూజలు చేయడంతో.. 57 రోజుల పాటు సాగే ఈ వార్షిక యాత్రకు లాంఛనంగా శ్రీకారం చుట్టినట్లయింది. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మంచు శివలింగాన్ని (Baba Barfani) దర్శించుకుని వెళ్లాలని ఎల్‌జీ మనోజ్ సిన్హా ఆహ్వానించారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అడ్మినిస్ట్రేషన్, శ్రీ అమర్‌నాథ్ జీ శ్రైన్ బోర్డు (SASB), ఆర్మీ, పోలీసులు, భద్రతా బలగాలు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాయని మనోజ్ సిన్హా తెలిపారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, భక్తులకు అవసరమైన వసతి, వైద్య సహాయం, శానిటేషన్, కమ్యూనికేషన్ సేవలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.

రెండు మార్గాల్లో ప్రయాణం

జులై 3వ తేదీన రెండు సాంప్రదాయ మార్గాల ద్వారా యాత్ర అధికారికంగా ప్రారంభమవుతుంది.

పహల్గామ్ (Pahalgam) మార్గం: అనంతనాగ్ జిల్లా మీదుగా వెళ్లే ఈ దారి కాస్త పొడవుగా ఉన్నప్పటికీ ఎక్కడానికి సులభంగా ఉంటుంది.

బల్తాల్ (Baltal) మార్గం: గందర్‌బల్ జిల్లా మీదుగా వెళ్లే ఈ రూట్ తక్కువ దూరమే ఉన్నా.. ప్రయాణం కాస్త కష్టంగా ఉంటుంది. ఈ రెండు మార్గాల్లో ఫుడ్ స్టాల్స్, రెస్క్యూ టీమ్స్, విశ్రాంతి కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

Amarnath Yatra 2026 LG Performs Pratham Puja, Check Key Dates

విజయవంతంగా 'డ్రై రన్'

వార్షిక యాత్రకు ముందు భద్రతను, వసతులను సమీక్షించేందుకు సోమవారం ఉదయం 5 గంటలకు జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి రాంబన్ జిల్లా వరకు భద్రతా బలగాలు విజయవంతంగా 'డ్రై రన్' (Dry run) నిర్వహించాయి. ఈ ట్రయల్ రన్‌లో ఎలాంటి లోపాలు కనిపించలేదని, ఏవైనా చిన్నపాటి లోపాలు ఉంటే జులై 1వ తేదీలోగా సరిదిద్దుతామని జమ్ము డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.

రిజిస్ట్రేషన్ తప్పనిసరి

అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా ముందుగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ (Registration) చేసుకోవాలి. ఎత్తైన ప్రాంతాల్లో ప్రయాణించడానికి శారీరకంగా దృఢంగా ఉన్నారో లేదో తెలిపే కంపల్సరీ హెల్త్ సర్టిఫికెట్ (Health Certificate) కూడా సమర్పించాలి. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా యాత్రకు వెళ్లొద్దని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తగిన దుస్తులు ధరించాలని అధికారులు భక్తులకు సూచిస్తున్నారు.

ముఖ్యమైన తేదీలు ఇవే (Key Dates)

జూన్ 29: ఎల్‌జీ మనోజ్ సిన్హాచే ప్రథమ పూజ, జమ్ము నుంచి భద్రతా బలగాల లాజిస్టిక్స్ డ్రై రన్.

జులై 1: లాజిస్టిక్స్ లేదా మౌలిక సదుపాయాల్లోని చిన్నపాటి లోపాలను సరిదిద్దేందుకు చివరి తేదీ.

జులై 2 (ఉదయం 4 గంటలకు): జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరనున్న తొలి భక్తుల బ్యాచ్.

జులై 3: పహల్గామ్, బల్తాల్ మార్గాల్లో లాంఛనంగా ప్రారంభం కానున్న 57 రోజుల అమర్‌నాథ్ యాత్ర.

ఆగస్టు 28: రక్షా బంధన్ పర్వదినం రోజున యాత్ర ముగింపు.

Advertisement

తాజావార్తలు

Advertisement