త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dy CM Bhatti Vikramarka | తెలంగాణ విద్యుత్‌ రంగానికి కేంద్రం సహకరించాలి

Dy CM Bhatti Vikramarka | తెలంగాణ విద్యుత్‌ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి, ప్రసార, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు పలు కీలక ప్రతిపాదనలు కేంద్రం ముందుంచారు.

P

Telangana | Published On Nov 27, 2026, 9.59 pm IST

Dy CM Bhatti Vikramarka | తెలంగాణ విద్యుత్‌ రంగానికి కేంద్రం సహకరించాలి
Advertisement
  • రూ.25,096 కోట్ల విద్యుత్‌ ప్రాజెక్టుల డీపీఆర్‌లకు 60 రోజుల్లో ఆమోదం తెలపాలి
  • పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులకు వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ఇవ్వాలి
  • ఛార్జీల మినహాయింపును 2030 మార్చి వరకు పొడిగించాలి
  • రాష్ట్రాల విద్యుత్‌ మంత్రుల సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి

Dy CM Bhatti Vikramarka | తెలంగాణ విద్యుత్‌ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి, ప్రసార, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు పలు కీలక ప్రతిపాదనలు కేంద్రం ముందుంచారు. రూ.25,096 కోట్ల విలువైన విద్యుత్‌ ప్రాజెక్టుల డీపీఆర్‌లకు 60 రోజుల్లో ఆమోదం తెలపాలని, పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్రాల విద్యుత్‌ శాఖ మంత్రుల సదస్సులో భట్టి విక్రమార్క ఈ అంశాలను ప్రస్తావించారు.

డీపీఆర్‌లకు త్వరగా ఆమోదం ఇవ్వాలి

రివాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీమ్‌ (ఆర్‌డీఎస్‌ఎస్‌) కింద స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు, విద్యుత్‌ పంపిణీ నష్టాల తగ్గింపు, వ్యవస్థల ఆధునికీకరణ కోసం రూ.25,096 కోట్లతో రూపొందించిన డీపీఆర్‌లను ఈ ఏడాది మే 27న పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు సమర్పించినట్లు తెలిపారు. వీటికి 60 రోజుల్లో ఆమోదం తెలపడంతోపాటు పనుల అమలుకు 2028 మార్చి 31 వరకు గడువు ఇవ్వాలని కోరారు. ఈ పథకం కింద ఇప్పటివరకు తెలంగాణకు రూ.72 కోట్ల బడ్జెట్‌ సాయం మాత్రమే అందిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు చేపట్టే పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులకు మెగావాట్‌కు రూ.కోటి చొప్పున వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ అందించాలని భట్టి విజ్ఞప్తి చేశారు. టీజీజెన్‌కో చేపట్టనున్న కల్లూరు పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ప్రతిపాదించిన 2,000 మెగావాట్‌ అవర్ల బ్యాటరీ విద్యుత్‌ నిల్వ ప్రాజెక్టులకు కూడా కేంద్ర ఆర్థిక సాయం అందించాలని పేర్కొన్నారు.

ప్రసార ఛార్జీల్లో పారదర్శకత ఉండాలి

అంతర్రాష్ట్ర విద్యుత్ ట్రాన్స్‌మిష‌న్ ఛార్జీల విధానంలో పారదర్శకత అవసరమని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణకు కేటాయించిన 5,801 మెగావాట్ల నెట్‌వర్క్‌ యాక్సెస్‌లో మార్పు లేకపోయినా, 2025 అక్టోబర్‌లో రూ.195 కోట్లు, నవంబర్‌లో రూ.145 కోట్ల ప్రసార ఛార్జీలు విధించారని తెలిపారు. రాష్ట్రాల వారీగా ఛార్జీల వివరాలను ప్రతి నెలా వెల్లడించాలని, మెగావాట్‌కు వార్షిక ప్రాతిపదికన ఛార్జీలు నిర్ణయించి ఏడాదికి ఒకసారి మాత్రమే సర్దుబాటు చేయాలని కోరారు. పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులకు ప్రస్తుతం అమల్లో ఉన్న అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీల మినహాయింపును 2030 మార్చి 31 వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత గడువు 2028 జూన్‌తో ముగియనుండగా, కొత్త ప్రాజెక్టులు 2029 నుంచి అందుబాటులోకి రానున్నాయని వివరించారు.

వేసవిలో గ్యాస్‌ విద్యుత్‌ కేంద్రాలు సిద్ధంగా ఉంచాలి

వచ్చే వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగే అవకాశం ఉన్నందున 2027 ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్‌ 30 వరకు దేశంలోని గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ కేంద్రాలన్నింటినీ అందుబాటులో ఉంచాలని కేంద్రాన్ని కోరారు. గ్యాస్‌ సరఫరాకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని, అదనపు వ్యయాన్ని ఏ ఒక్క రాష్ట్రంపైనా మోపకుండా ఉమ్మడి విధానం అమలు చేయాలని సూచించారు. రాయ్‌గఢ్‌–పుగళూర్‌–త్రిస్సూర్‌ హెచ్‌వీడీసీ విద్యుత్‌ ప్రసార వ్యవస్థకు జాతీయ హోదా కల్పించాలని భట్టి కోరారు. 23,480 ఎంవీఏ సామర్థ్యంతో ప్రతిపాదించిన గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ ప్రాజెక్టులకు తొలి విడతలోనే ఆమోదం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సేడం–పరిగి 400 కేవీ విద్యుత్‌ లైన్‌, మహేశ్వరం–2 సబ్‌స్టేషన్‌ను అంతర్రాష్ట్ర ప్రాజెక్టులుగా చేపట్టి ఖర్చును జాతీయ స్థాయిలో పంచుకోవాలని కోరారు. విద్యుత్‌ పంపిణీ సంస్థల పనితీరు మెరుగుదల, స్మార్ట్‌ మీటర్లు, వ్యవసాయ ఫీడర్ల సౌరీకరణ, విద్యుత్‌ నిల్వ సామర్థ్యం పెంపు వంటి అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు కేంద్రం పూర్తి సహకారం అందించాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌, టీజీ ట్రాన్స్‌కో సీఎండీ, ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణభాస్కర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement