త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Taslima Nasrin | 19 ఏళ్ల తర్వాత.. కోల్‌క‌తాలో అడుగుపెట్టిన‌ తస్లీమా

Taslima Nasrin | బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి (Bangladeshi author), సామాజిక కార్య‌క‌ర్త‌ త‌స్లీమా న‌స్రీమ్ (Taslima Nasreen) దాదాపు రెండు ద‌శాబ్దాల త‌ర్వాత ప‌శ్చిమ‌ బెంగాల్ గ‌డ్డ‌పై అడుగుపెట్టారు.

D

National | Published On Jul 31, 2026, 5.43 pm IST

Taslima Nasrin | 19 ఏళ్ల తర్వాత.. కోల్‌క‌తాలో అడుగుపెట్టిన‌ తస్లీమా
Advertisement

Taslima Nasrin | త్రినేత్ర‌.న్యూస్ : బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి (Bangladeshi author), సామాజిక కార్య‌క‌ర్త‌ త‌స్లీమా న‌స్రీమ్ (Taslima Nasreen) దాదాపు రెండు ద‌శాబ్దాల త‌ర్వాత ప‌శ్చిమ‌ బెంగాల్ గ‌డ్డ‌పై అడుగుపెట్టారు. వివాదాలు, నిర‌స‌న‌ల మ‌ధ్య 19 ఏళ్ల క్రితం న‌గ‌రాన్ని వీడిన ఆమె ఇవాళ కోల్‌క‌తా (Kolkata) చేరుకున్నారు. సుదీర్ఘ విరామం త‌ర్వాత న‌గ‌రానికి రావ‌డంపై ఆమె ఒకింత భావోద్వేగానికి గుర‌య్యారు.

త‌స్లీమా 1962 ఆగష్టు 25న బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్‌లో జన్మించారు. మహిళల అణచివేతపై రాసిన వ్యాసాలు, నవలల వల్ల ఆమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 1993లో ఆమె రాసిన 'లజ్జ' (Lajja) నవల అంతర్జాతీయంగా విపరీతమైన ప్రజాదరణ పొందింది. బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరిగిన దాడుల నేపథ్యంతో ఈ నవలను రాశారు. ఈ పుస్తకాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధించింది. ఆ త‌ర్వాత 1994లో ఆమెపై ప‌లు మ‌త‌ప‌ర‌మైన ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఇస్లామిక్ గ్రూపుల నుంచి బెదిరింపులు వ‌చ్చాయి. దీంతో త‌స్లీమా బంగ్లాను వీడాల్సి వ‌చ్చింది.

ఆ త‌ర్వాత యూర‌ప్, అమెరికా వంటి దేశాల్లో ప్ర‌వాస జీవితాన్ని గ‌డిపిన త‌స్లీమా.. 2004లో భార‌త్‌కు వ‌చ్చారు. బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తాలో సెటిల్ అయ్యారు. అయితే, ఆమె రాసిన‌ ఆత్మకథ ‘ద్విఖండిత’పై తీవ్ర నిర‌స‌న చెల‌రేగింది. పుస్తకావిష్కరణ తర్వాత నగరంలో హింసాత్మక ఘ‌ర్ష‌ణ‌లు చెలరేగడంతో నాటి ప్ర‌భుత్వం ఆ పుస్త‌కంపై నిషేధం విధించింది. సుమారు 3,000 ప్రతులను వెంటనే స్వాధీనం చేసుకుంది. అయితే, 2005లో కోల్‌క‌తా హైకోర్టు ఆ పుస్తకం మతపరమైన మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో రాలేదని, ప్రభుత్వ నిర్ణయం సమర్థనీయం కాదని పేర్కొంది. ఈ మేర‌కు ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ కీల‌క తీర్పు ఇచ్చింది. ఆ స‌మ‌యంలో కోల్‌క‌తాలో కొన్ని తీవ్ర‌వాద గ్రూపులు ఆమెకు వ్య‌తిరేకంగా అడ‌పాద‌డ‌పా నిర‌స‌న‌లు కొన‌సాగించాయి.

2007 నవంబ‌ర్‌లో కోల్‌క‌తాలో తీవ్ర స్థాయిలో హింసాత్మ‌క ఆందోళ‌న‌లు జ‌రిగాయి. తీవ్రవాద గ్రూపులు ఆమెను బహిష్కరించాలని డిమాండ్ చేశాయి. చివరికి భద్రతా కారణాల దృష్ట్యా ఆమెను వేరే ప్రాంతానికి త‌ర‌లించాల్సి వ‌చ్చింది. కొన్ని మ‌త‌ప‌ర‌మైన గ్రూపులు త‌స్లీమాను దేశం నుంచి బ‌హిష్క‌రించాల‌ని కోరుతూ ఆమెపై ఫ‌త్వా కూడా జారీ చేశాయి. పెద్ద ఎత్తున అల్ల‌ర్లు చెల‌రేగ‌డంతో 2007 న‌వంబ‌ర్‌లో ఆమె దేశాన్ని వీడాల్సి వ‌చ్చింది. ఇన్నేళ్లు ప్ర‌వాస జీవితాన్ని గ‌డిపిన ఆమె సుదీర్ఘ విరామం త‌ర్వాత ఇప్పుడు కోల్‌క‌తా గ‌డ్డ‌పై అడుగుపెట్టారు. రేపు న‌గ‌రంలో జ‌ర‌గ‌బోయే ఓ కార్యక్ర‌మానికి ఆమె హాజ‌రుకానున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి బెంగాల్ సీఎం సువేందు అధికారి కూడా హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. తిరిగొచ్చిన సంద‌ర్భంగా ఆమె ఒకింత భావోద్వేగానికి గుర‌య్యారు. కోల్‌క‌తాను తాను వ‌దిలిపెట్ట‌లేద‌ని.. అప్ప‌టి ప్ర‌భుత్వం ఆ ప‌రిస్థితి క‌ల్పించింద‌ని అన్నారు.

Also Read..

వాన నీటిని ఒడిసిపట్టడమే హైదరాబాద్‌కు శాశ్వత నీటి భద్రత

భారీ బ్యాట‌రీ, ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లేతో లాంచ్ అయిన హువావే మేట్ ప్యాడ్‌.. ధ‌ర ఎంతంటే..

ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న‌ల‌తో ద‌ద్ద‌రిల్లిన ఉభ‌య‌స‌భ‌లు

Advertisement
Advertisement