త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singareni | థర్మల్‌ కేంద్రాలకు కొరత లేకుండా సరఫరా చేయాలి : సింగరేణి సీఎండీ బుద్ధ‌ప్ర‌కాశ్‌

Singareni | రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని సింగరేణి సీఎండీ డాక్ట‌ర్ బుద్ధప్రకాష్‌ జ్యోతి అధికారులను ఆదేశించారు. థర్మల్‌ కేంద్రాల డిమాండ్‌కు అనుగుణంగా రోజూ కనీసం 28 నుంచి 32 రేకుల బొగ్గును రవాణా చేయాలని సూచించారు.

P

Telangana | Published On Jul 31, 2026, 4.56 pm IST

Singareni | థర్మల్‌ కేంద్రాలకు కొరత లేకుండా సరఫరా చేయాలి : సింగరేణి సీఎండీ బుద్ధ‌ప్ర‌కాశ్‌
Advertisement

Singareni | రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని సింగరేణి సీఎండీ డాక్ట‌ర్ బుద్ధప్రకాష్‌ జ్యోతి అధికారులను ఆదేశించారు. థర్మల్‌ కేంద్రాల డిమాండ్‌కు అనుగుణంగా రోజూ కనీసం 28 నుంచి 32 రేకుల బొగ్గును రవాణా చేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ నుంచి శుక్రవారం అన్ని ఏరియాల జనరల్‌ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్‌బర్డెన్‌ తొలగింపు, నాణ్యత తదితర అంశాలపై సమీక్షించారు. వర్షాల కారణంగా ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో ఉత్పత్తిపై కొంత ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని సీఎండీ సూచించారు.

వర్షాకాలంలో భూగర్భ గనుల్లో ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర విద్యుత్‌ అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇస్తూ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు సింగరేణి ఉత్పత్తిలో 75 నుంచి 80 శాతం బొగ్గును సరఫరా చేస్తున్నట్లు సీఎండీ తెలిపారు. విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వల్లో కొరత రాకుండా రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాకాలంలో వరద ముప్పును దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ సింగరేణి రెస్క్యూ బృందాలు, ఇతర విభాగాల అధికారులు అవసరమైనప్పుడు వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనేలా సిద్ధంగా ఉండాలని సూచించారు. అన్ని ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో ఉత్పత్తి లక్ష్యాల సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎండీ అన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను పూర్తి చేయడంతోపాటు భవిష్యత్తులో 70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 500 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌బర్డెన్‌ తొలగింపు లక్ష్యాలను చేరుకునేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కొత్త గనుల ఏర్పాటుకు అవసరమైన వివిధ అనుమతుల ప్రక్రియను ఇప్పటి నుంచే వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో సింగరేణి డైరెక్టర్లు ఎల్‌వీ సూర్యనారాయణ (ఆపరేషన్స్‌), కే వెంకటేశ్వర్లు (పీ అండ్‌ పీ), గౌతమ్‌ పోట్రు (పర్సనల్‌, ఫైనాన్స్‌), ఎం తిరుమలరావు (ఈ అండ్‌ ఎం), ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ బీ వెంకన్న (కోల్‌ మూవ్‌మెంట్‌), జీఎం టీ శ్రీనివాస్‌ (కోఆర్డినేషన్‌, మార్కెటింగ్‌)తో పాటు అన్ని ఏరియాల జీఎంలు, కార్పొరేట్‌ విభాగాల జీఎంలు, శాఖాధిపతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement