త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HMWSSB | వాన నీటిని ఒడిసిపట్టడమే హైదరాబాద్‌కు శాశ్వత నీటి భద్రత

HMWSSB | వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంచుకోవడం ద్వారానే హైదరాబాద్ నగరానికి శాశ్వత నీటి భద్రత సాధ్యమవుతుందని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో రైన్‌వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటు చేయాలి. ప్రతి చుక్క వర్షపు నీరు భూమిలోకి చేరాలి. ప్రతి పౌరుడు నీటి సంరక్షణలో భాగస్వామి కావాలి. అప్పుడే హైదరాబాద్‌కు శాశ్వత జల భద్రత సాధ్యమవుతుంది అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Jul 31, 2026, 5.34 pm IST

HMWSSB | వాన నీటిని ఒడిసిపట్టడమే హైదరాబాద్‌కు శాశ్వత నీటి భద్రత
Advertisement

ఎల్‌నినో సవాళ్లను ఎదుర్కోవాలంటే
అందరం కలిసికట్టుగా పనిచేయాలి.
ప్రతి ఇంట్లో రైన్‌వాటర్ హార్వెస్టింగ్ తప్పనిసరి
జలమండలి ఎండీ కె అశోక్ రెడ్డి

HMWSSB | త్రినేత్ర‌.న్యూస్ : వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంచుకోవడం ద్వారానే హైదరాబాద్ నగరానికి శాశ్వత నీటి భద్రత సాధ్యమవుతుందని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో రైన్‌వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటు చేయాలి. ప్రతి చుక్క వర్షపు నీరు భూమిలోకి చేరాలి. ప్రతి పౌరుడు నీటి సంరక్షణలో భాగస్వామి కావాలి. అప్పుడే హైదరాబాద్‌కు శాశ్వత జల భద్రత సాధ్యమవుతుంది అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

శుక్రవారం ఆకాశవాణి – వివిధ భారతి నిర్వహించిన ప్రత్యక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, శ్రోతలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ రైన్‌వాటర్ హార్వెస్టింగ్, భూగర్భ జలాల సంరక్షణ, ట్యాంకర్లపై ఆధారపడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.

ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని, వచ్చే వేసవిలో తలెత్తే కరువు పరిస్థితులను అధిగమించాలంటే ప్రభుత్వం, అధికారులు ప్రజలు కలిసి సమష్టిగా పనిచేయాలని అన్నారు. హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి వంటి దూర ప్రాంతాల నుంచి తాగునీటిని పంపింగ్ చేసి సరఫరా చేస్తున్నప్పటికీ, భవిష్యత్తు అవసరాలను కేవలం కొత్త ప్రాజెక్టులతో తీర్చడం సాధ్యం కాదన్నారు. ప్రకృతి ప్రసాదించే ప్రతి వర్షపు చుక్కను భూమిలోకి ఇంకించడమే శాశ్వత పరిష్కారమని స్పష్టం చేశారు.

కేవలం 50 నుంచి 70 రోజులే వర్షం

ఏడాదిలో కేవలం 50 నుంచి 70 రోజులే వర్షం కురుస్తుందని, మిగిలిన కాలమంతా భూగర్భ జలాలపైనే ఆధారపడాల్సి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం నగరంలో కాంక్రీటీకరణ పెరగడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం తగ్గిపోయిందన్నారు. అందువల్ల ప్రతి ఇంట్లో, ప్రతి అపార్ట్‌మెంట్‌లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.

లక్షకు పైగా ట్యాంకర్లు బుక్

నగరంలో సుమారు పది లక్షల ఇళ్లలో బోర్‌వెల్‌లకు రైన్‌వాటర్ హార్వెస్టింగ్‌ను అనుసంధానం చేస్తే కొద్ది సంవత్సరాల్లోనే భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని, హైదరాబాద్‌ను ట్యాంకర్‌లపై ఆధారపడని నగరంగా మార్చే అవకాశం ఉందన్నారు. గతంలో సుమారు 40 వేల మంది మాత్రమే ట్యాంకర్లు బుక్ చేసుకునేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య లక్షకు పైగా పెరిగిందని తెలిపారు. ఇది భూగర్భ జలాల క్షీణతకు నిదర్శనమన్నారు. రైన్‌వాటర్ హార్వెస్టింగ్ అమలు చేసిన అనేక అపార్ట్‌మెంట్లలో ట్యాంకర్ వినియోగం 80–90 శాతం వరకు తగ్గిందని, నీటి వ్యయం కూడా గణనీయంగా తగ్గిందని వెల్లడించారు. రైన్‌వాటర్ హార్వెస్టింగ్ కోసం జలమండలి 18 స్వచ్ఛంద సంస్థలతో కలిసి సాంకేతిక సహాయం అందిస్తోందన్నారు. ఇంటి స్థలం, నేల స్వభావం, బోర్‌వెల్ పరిస్థితిని బట్టి ఇంకుడు గుంతలు, ఇంజెక్షన్ బోర్‌వెల్స్‌ ఏర్పాటు చేయడానికి అధికారులు మార్గదర్శకత్వం అందిస్తారని తెలిపారు. ఉపయోగంలో లేని బోర్‌వెల్స్‌ను కూడా ఇంజెక్షన్ బోర్‌వెల్స్‌గా మార్చి భూగర్భ జలాల రీచార్జ్‌కు వినియోగించవచ్చని వివరించారు.

ఒకటి కంటే ఎక్కువ ఇంకుడు గుంతలు

రైన్‌వాటర్ హార్వెస్టింగ్‌ను కేవలం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (OC) కోసం ఏర్పాటు చేసి వదిలేయకుండా, అవసరాన్ని బట్టి ఒకటి కంటే ఎక్కువ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లలో నాలుగు నుంచి ఐదు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పారు. నగరంలో వర్షాల సమయంలో నీరు నిలిచే 146 ప్రాంతాలను గుర్తించి, ప్రయోగాత్మకంగా భారీ భూగర్భ నీటి నిల్వ బావులను నిర్మించామని తెలిపారు. ఈ విధానంతో రహదారులపై నీరు నిలవకుండా ఉండటంతో పాటు భూగర్భ జలాలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నమూనాను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు తెలిపారు.

కనీసం 30 శాతం నీటిని ఆదా చేయాలి

కొత్త కాలనీలు, హైరైజ్(ఆకాశహర్మ్యం) భవనాల నిర్మాణంతో నీటి అవసరాలు పెరుగుతున్నాయని, అందుకు అనుగుణంగా పైప్‌లైన్ సామర్థ్యాన్ని పెంచడం, మౌలిక వసతుల విస్తరణ చేపడుతున్నామని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీటి కాలువలు, మురుగునీటి వ్యవస్థలను పూర్తిగా వేరు చేయడానికి జీహెచ్‌ఎంసీతో కలిసి సమగ్ర మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు నీటి వృథాను తగ్గించి కనీసం 30 శాతం నీటిని ఆదా చేయాలని, పడే ప్రతి వర్షపు చుక్కను భూమిలోకి ఇంకించాలని పిలుపునిచ్చారు. రాబోయే వర్షాకాలాన్ని సద్వినియోగం చేసుకుంటే వచ్చే వేసవిలో ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితిని గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు.

జలమండలి కాల్ సెంటర్ 155313

ఇంకుడు గుంతలు, రైన్‌వాటర్ హార్వెస్టింగ్‌కు సంబంధించిన సాంకేతిక సహాయం, మార్గదర్శకత్వం కోసం జలమండలి కాల్ సెంటర్ 155313, ఇంకుడు గుంతల ప్రత్యేక అధికారి 99899 85102, ప్రజా సంబంధాల అధికారి 91001 08462 మొబైల్ నంబర్ లను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. అవసరమైతే అధికారులు, సాంకేతిక నిపుణులు మార్గదర్శకత్వం అందిస్తారని తెలిపారు.

Advertisement
Advertisement