త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Monsoon Session | 12 బిల్లుల‌కు ఆమోదం.. ఒక్క దానిపైనే చ‌ర్చ‌

Monsoon Session | విపక్షాల ఆందోళనలు, నిరసనల కారణంగా ఈ వర్షాకాల సమావేశాల్లో చర్చలు ఆశించిన స్థాయిలో సాగలేదని కేంద్ర పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు (Kiren Rijiju) వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఉత్పాదకత కేవలం 19 శాతంగా నమోదైందని చెప్పారు. అటు రాజ్యసభ ఉత్పాదకత 39 శాతంగా ఉందని వివరించారు. ఈ సమావేశాల్లో లోక్ సభ, రాజ్యసభలో కలిపి మొత్తం 12 బిల్లులు ఆమోదం పొందిన‌ట్లు తెలిపారు. కేవ‌లం ఒకే ఒక్క బిల్లుపై మాత్ర‌మే విస్తృతంగా చ‌ర్చ జ‌రిగింద‌ని వివ‌రించారు.

D

National | Published On Aug 13, 2026, 2.12 pm IST

Monsoon Session | 12 బిల్లుల‌కు ఆమోదం.. ఒక్క దానిపైనే చ‌ర్చ‌
Advertisement
  • ముగిసిన పార్ల‌మెంట్ స‌మావేశాలు..
  • లోక్‌సభలో 19%.. రాజ్యసభలో 39%
  • చర్చలు ఆశించిన స్థాయిలో సాగలేదు
  • విప‌క్షాల తీరుపై కిర‌ణ్ రిజుజు ధ్వ‌జం
  • చ‌ర్చ‌ల నుంచి పారిపోయిందంటూ విమ‌ర్శ‌

Monsoon Session | త్రినేత్ర‌.న్యూస్ : పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ముగిశాయి. జులై 20న ప్రారంభ‌మైన ఈ స‌మావేశాలు.. రామమందిర విరాళాల చోరీ, నీట్ పేప‌ర్ లీక్ ఆందోళ‌న‌ల సంద‌ర్భంగా నిర‌స‌న తెలుపుతున్న విద్యార్థుల‌పై పోలీసుల లాఠీఛార్జ్‌, పెల్లెట్ గ‌న్స్ వాడ‌టంపై విప‌క్షాలు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఆయా అంశాల‌పై ప్ర‌తిప‌క్ష ఎంపీలంతా పార్ల‌మెంట్ లోప‌లా, బ‌య‌ట త‌మ నిర‌స‌న‌ల‌ను కొన‌సాగించారు. విప‌క్షాల నిర‌స‌ల‌న‌తో 19 రోజుల పాటు సాగిన ఈ సమావేశాలు ఎలాంటి అర్థవంతమైన చర్చలూ లేకుండా ఉభ‌య స‌భ‌లు నిర‌వ‌ధిక వాయిదా ప‌డ్డాయి.

విపక్షాల ఆందోళనలు, నిరసనల కారణంగా ఈ వర్షాకాల సమావేశాల్లో చర్చలు ఆశించిన స్థాయిలో సాగలేదని కేంద్ర పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు (Kiren Rijiju) వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఉత్పాదకత కేవలం 19 శాతంగా నమోదైందని చెప్పారు. అటు రాజ్యసభ ఉత్పాదకత 39 శాతంగా ఉందని వివరించారు. ఈ సమావేశాల్లో లోక్ సభ, రాజ్యసభలో కలిపి మొత్తం 12 బిల్లులు ఆమోదం పొందిన‌ట్లు తెలిపారు. కేవ‌లం ఒకే ఒక్క బిల్లుపై మాత్ర‌మే విస్తృతంగా చ‌ర్చ జ‌రిగింద‌ని వివ‌రించారు. "ఈ సమావేశాలను ప్రభుత్వం రెండు కోణాల్లో చూస్తోంది. శాన‌ప‌ర‌మైన ప్ర‌క్రియ‌లో చూస్తే 12 బిల్లుల ఆమోదం శాసనపరమైన పనిలో ఒక విజయమే. అయితే, చర్చలు, సంప్రదింపుల కోసం అందుబాటులో ఉన్న సమయాన్ని ఆశించిన విధంగా ఉపయోగించుకోలేదు" అని రిజుజు అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇలాంటి ప్ర‌తిప‌క్షాన్ని ఎక్క‌డా చూడ‌లేదు..

ఈ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్షాల తీరుపై రిజుజు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. స‌భ‌లో చ‌ర్చ‌లు జ‌ర‌కూడ‌ద‌నే విధంగా ప్ర‌తిప‌క్షాలు తీరు ఉంద‌ని ధ్వ‌జమెత్తారు. వారి సృష్టించిన అడ్డంకుల వ‌ల్లే స‌భా స‌మ‌యం వృథా అయింద‌ని వ్యాఖ్యానించారు. చర్చల నుంచి తప్పించుకోవడానికి రకరకాల సాకులు వెతికాయని ఆయన విమర్శించారు. తన రాజకీయ జీవితంలో తొలిసారిగా విపక్షాలు చర్చల నుంచి పారిపోతున్న పరిస్థితిని చూస్తున్నానని అన్నారు. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు.

"ప్రతిపక్షాలు కావాలనే చర్చల నుంచి పారిపోతున్నాయి. ప్ర‌జాస్వామ్యంలో ఎక్క‌డైనా ప్ర‌తిప‌క్షాలు చ‌ర్చ‌కు డిమాండ్ చేయాలి. ప్ర‌భుత్వం స‌మాధానం ఇవ్వాలి. కానీ ప్ర‌తిప‌క్షాలు చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌ట్ట‌కుండా పారిపోతున్నాయి. కేవ‌లం స‌భ‌లో నినాదాలు చేయ‌డం, ప్ల‌కార్డులు, బ్యాన‌ర్ల‌తో గంద‌ర‌గోళం సృష్టించ‌డానికే ప్రాధాన్యం ఇచ్చాయి. చ‌ర్చ‌కు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని ప్ర‌క‌టిస్తే.. మంత్రి స‌మాధానం వినే ఆస‌క్తి మాకు లేదంటూ పారిపోయారు" అని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

ఆ ఒక్క‌ బిల్లుపై మాత్ర‌మే చ‌ర్చ‌.. అదేంటంటే..?

ఈ స‌మావేశాల్లో కేవ‌లం ఒకే ఒక బిల్లుపై మాత్ర‌మే విస్తృతంగా చ‌ర్చ జ‌రిగింద‌ని చెప్పారు. పరీక్షల్లో పేపర్ లీక్‌లు, అక్రమాలకు పాల్పడే వారిని కట్టడి చేసేందుకు తెచ్చిన 'యాంటీ పేపర్ లీక్ బిల్లు'పైనే (Public Examinations Amendment Bill 2026)ఈ చర్చ జరిగిందని తెలిపారు. ఈ చ‌ట్టాన్ని ఉభ‌య‌స‌భ‌ల్లో ఆమోదించిన‌ట్లు గుర్తు చేశారు. రాబోయే శీతాకాల సమావేశాల్లో వాతావరణం మెరుగ్గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సభలో చర్చలు నిర్మాణాత్మకంగా జరగాలని ఆయన అభిలషించారు.

చ‌ట్టంలోని కీల‌క స‌వ‌ర‌ణ‌లు ఇవే..

దేశవ్యాప్తంగా జ‌రిగే నీట్‌, జేఈఈ వంటి పోటీ పరీక్షల్లో జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 'పబ్లిక్ పరీక్షల (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు, 2026' (యాంటీ పేపర్ లీక్ బిల్లు)ను పార్లమెంటు ముందుకు తెచ్చిన విష‌యం తెలిసిందే. ఈ బిల్లుకు ఉభ‌య‌స‌భ‌లు ఆమోదం తెలిపాయి. అనంత‌రం రాష్ట్ర‌ప‌తి ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు.

ఇప్పటికే అమల్లో ఉన్న 2024 చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ ఈ ముసాయిదాను రూపొందించారు. ఈ బిల్లులో కేంద్రం కీల‌క మార్పులకు ప్ర‌తిపాదించింది. ఈ తరహా కేసులను వేగంగా విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. లీకేజీలు, అవకతవకలకు పాల్పడే వ్యక్తులకు విధించే గరిష్ఠ జైలు శిక్షను ఐదేళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచారు. నిందితులకు విధించే గరిష్ఠ జరిమానాను రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంచారు. వ్య‌వ‌స్థీకృత నేరాల‌కు క‌నీసం ఏడేళ్ల జైలు శిక్ష‌, రూ.10 కోట్ల జ‌రిమానా ప‌డుతుంది. అక్రమాలకు పాల్పడే సర్వీస్ ప్రొవైడర్లు లేదా ప్రైవేట్ పరీక్షా ఏజెన్సీలకు రూ. 5 కోట్ల వరకు జరిమానా విధించడంతో పాటు ఎనిమిదేళ్ల పాటూ పరీక్షలు నిర్వహించకుండా నిషేధం విధిస్తారు. ఆయా కేసుల్లో ఛార్జిషీట్ దాఖ‌లు చేసిన మూడు నెల‌ల్లోనే విచార‌ణ పూర్తి చేయాల‌ని ప్ర‌తిపాదించారు. ఈ కేసుల విచారణ కోసం అవ‌స‌ర‌మైతే స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) ప్రత్యేక దర్యాప్తు చేపట్టనుంది.

Also Read..

ఆ ఘ‌ట‌న చాలా అవ‌మానంగా అనిపించింది.. హ‌ల్ద్వానీలో వేదిక శుద్ధిపై ఖ‌ర్గే భావోద్వేగం

లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా.. వందేమాతరంతో ముగింపు.. చ‌రిత్ర‌లో తొలిసారి

క్యాబ్ సంస్థ‌ల‌కు కేంద్రం ఝ‌ల‌క్‌.. ఇక‌పై ముందస్తు టిప్ కుద‌ర‌దు..

Advertisement
Advertisement