త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ATM Robbery | ఎట్ట‌కేల‌కు దొరికారు.. బీద‌ర్‌లో ఏటీఎంను కొల్ల‌గొట్టి.. కూక‌ట్‌ప‌ల్లిలో షెల్ట‌ర్ తీసుకున్నారు..

ATM Robbery | వాళ్లు క‌ర‌డుగ‌ట్టిన దొంగ‌లు. క‌ర్ణాట‌క‌లోని బీద‌ర్‌లో (Bidar) ఏటీఎం (ATM Robbery) కొల్ల‌గొట్టారు. అక్క‌డి నుంచి ప‌రారై హైద‌రాబాద్ వ‌చ్చారు. కూక‌ట్‌ప‌ల్లిలో ఆశ్ర‌యం పొందారు. దొంగిలించిన డ‌బ్బుతో న‌ర‌గం నుంచి రాయ్‌పూర్ వెళ్లాల‌నుకున్నారు.

G

Hyderabad | Published On Aug 13, 2026, 1.45 pm IST

ATM Robbery | ఎట్ట‌కేల‌కు దొరికారు.. బీద‌ర్‌లో ఏటీఎంను కొల్ల‌గొట్టి.. కూక‌ట్‌ప‌ల్లిలో షెల్ట‌ర్ తీసుకున్నారు..
Advertisement

ATM Robbery | త్రినేత్ర‌.న్యూస్‌: వాళ్లు క‌ర‌డుగ‌ట్టిన దొంగ‌లు. క‌ర్ణాట‌క‌లోని బీద‌ర్‌లో (Bidar) ఏటీఎం (ATM Robbery) కొల్ల‌గొట్టారు. అక్క‌డి నుంచి ప‌రారై హైద‌రాబాద్ వ‌చ్చారు. కూక‌ట్‌ప‌ల్లిలో ఆశ్ర‌యం పొందారు. దొంగిలించిన డ‌బ్బుతో న‌ర‌గం నుంచి రాయ్‌పూర్ వెళ్లాల‌నుకున్నారు. ఈ క్ర‌మంలో అఫ్జ‌ల్‌గంజ్‌లో (Afzalgunj Shooting) ఓ ట్రావెల్స్ బ‌స్సు టికెట్ బుక్‌చేసుకున్నారు. బ‌స్సులో ఎక్కే క్ర‌మంలో ట్రావెల్స్‌ మేనేజ‌ర్‌కు అనుమానం రావ‌డంతో వారివ‌ద్ద ఉన్న బ్యాగ్‌ను చూపించాల‌ని అడిగాడు. దీంతో అత‌ని కాల్పులు జ‌రిపి అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. గ‌తేడాది జ‌న‌వ‌రిలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. తాజాగా దాదాపు ఏడాదిన్న‌ర త‌ర్వాత ఆ దొంగ‌లు పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు.

బీహార్‌లోని (Bihar) వైశాలీ జిల్లా ఫ‌తేపూర్ పుల్వారియా చెందిన అలోక్ కుమార్, అమ‌న్ కుమార్.. గ‌తేడాది జ‌న‌వ‌రి 16న‌ క‌ర్ణాట‌క‌లోని బీద‌ర్‌లో ఎస్బీఐ ఏటీఎం (SBI ATM) మిషన్లలో నగదు నింపే సీఎంఎస్‌ సంస్థ ఉద్యోగి గిరి వెంకటేశ్‌ను చంపి, శివకుమార్‌ను గాయపరిచి రూ.83 లక్షలతో ఉడాయించారు. ఆ డ‌బ్బును బ్యాగుల్లో పెట్టుకుని ద్విచ‌క్ర వాహ‌నాల‌పై హైద‌రాబాద్ (Hyderabad) చేరుకున్నారు. కూక‌ట్ ప‌ల్లి ప్రాంతంలో షెల్ట‌ర్ తీసుకున్నారు. నేరానికి వాడిన బైక్‌ను ఎంజీబీఎస్ పార్కింగ్‌లో ఉంచారు.

అనంత‌రం అఫ్జల్‌గంజ్‌లోని రోషన్‌ ట్రావెల్స్‌ (Roshan Travels) బస్సులో రాయ్‌పూర్‌ వెళ్లేందుకు అమిత్‌కుమార్‌ పేరుతో టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. బ‌స్సు ఎక్కే క్ర‌మంలో ల‌గేజీని చెక్‌చేస్తుండ‌గా ట్రావెల్స్ మేనేజర్‌ జహంగీర్‌పై కాల్పులు జ‌రిపారు. అనంత‌రం అక్క‌డి నుంచి పారిపోయారు. ఈ హత్యాయత్నంపై అఫ్జల్‌గంజ్‌ ఠాణాలో కేసు నమోదైంది. ఈ దోపిడీ దొంగలు నగరం నుంచి కడప, నెల్లూరు మీదుగా చెన్నై వరకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆపై వీరి కదలికలు కనిపెట్టడం సాధ్యం కాలేదు. అయితే ఈ ఇద్ద‌రి కోసం ముమ్మరంగా వేటాడిన బీదర్‌ పోలీసులు బీహార్‌లో ఆగ‌స్టు 12న (బుధ‌వారం) పట్టుకున్నారు. దీంతో వారిని త్వరలో పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌ తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

యూపీలో మోస్ట్ వాంటెడ్‌..

అలోక్ కుమార్ నేతృత్వంలోని ముఠాలో అమన్, చందన్‌ కుమార్, రాజీవ్‌ సాహ్ని సభ్యులుగా ఉండేవారు. ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనాలనే ల‌క్ష్యంగా చేసుకుని దోపిడీల‌కు పాల్ప‌డేవారు. 2023 సెప్టెంబర్‌ 12న ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) మిర్జాపూర్‌లో సెక్యూరిటీ గార్డు జైసింగ్‌ను హత్య చేసి రూ.40 లక్షలు ఉన్న ట్రంక్‌ పెట్టెతో ప‌రార‌య్యారు. అయితే 2024 సెప్టెంబర్‌లో ముంబైలో చందన్‌ కుమార్‌ను, వైశాలీలో రాజీవ్‌ సాహ్నిని యూపీ ఎస్టీఎఫ్ పోలీసులు ప‌ట్టుకున్నారు. ముఠాలో మిగిలిన ఇద్ద‌రు అమన్, అలోక్‌లు వైశాలీ జిల్లాలోని మహిసౌర్‌ జన్‌ధన్‌ వద్ద ఉన్నట్లు గుర్తించారు. వీరికోసం పోలీసులు ముమ్మ‌రంగా గాలిస్తుండ‌టంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గతేడాది జనవరి 16న బీదర్‌లో ఏటీఎం న‌గ‌దును కొట్టేయ‌డంతో మ‌రోసారి వార్త‌ల్లోకెక్కారు. చివ‌రికి బీద‌ర్ పోలీసుల‌కు చిక్కి ఊచ‌లు లెక్క‌బెడుతున్నారు.

Advertisement
Advertisement