త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Smart Phones | ఉద‌యం నిద్ర లేవ‌గానే ఫోన్ల‌ను చూడ‌డం త‌గ్గిస్తున్నారు.. కార‌ణం ఇదే..

Smart Phones | గ‌తంలో చాలా మంది ఉద‌యం నిద్ర లేవ‌గానే త‌మ ఫోన్ల‌ను చెక్ చేసుకునే వార‌ని, కానీ ఇప్పుడు ఆ ధోర‌ణి క్ర‌మంగా మారుతుంద‌ని, ప్ర‌స్తుతం చాలా మంది ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే ఫోన్‌ను చూడ‌డం లేద‌ని, అందుకు ప‌లు కార‌ణాలు ఉన్నాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల్లో తేలింది.

S

Health | Published On May 26, 2026, 12.25 pm IST

Smart Phones | ఉద‌యం నిద్ర లేవ‌గానే ఫోన్ల‌ను చూడ‌డం త‌గ్గిస్తున్నారు.. కార‌ణం ఇదే..
Advertisement

Smart Phones | గ‌తంలో చాలా మంది ఉద‌యం నిద్ర లేవ‌గానే త‌మ ఫోన్ల‌ను చెక్ చేసుకునే వార‌ని, కానీ ఇప్పుడు ఆ ధోర‌ణి క్ర‌మంగా మారుతుంద‌ని, ప్ర‌స్తుతం చాలా మంది ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే ఫోన్‌ను చూడ‌డం లేద‌ని, అందుకు ప‌లు కార‌ణాలు ఉన్నాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల్లో తేలింది. ప్ర‌పంచ వ్యాప్తంగా నిత్యం అనేక చోట్ల క్రైమ్స్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఉద‌యం ఫోన్ చూడ‌గానే చాలా మందికి ఆ వార్త‌లే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. అందువ‌ల్ల ఉద‌యాన్నే యాక్సిడెంట్లు, మ‌ర‌ణ‌వార్త‌లు లేదా ఇత‌ర క్రైమ్ వార్త‌ల‌ను చూడ‌డం ఎందుక‌ని భావిస్తున్నార‌ని, అందుక‌నే నిద్ర లేవ‌గానే ఫోన్‌ను అధిక శాతం మంది చూడ‌డం లేద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఉద‌యం అలాంటి వార్త‌ల‌ను చూసినా లేదా చదివినా ఆ రోజంతా అల‌స‌ట‌, ఆందోళ‌న‌, నిరాశ వంటివి అధిక‌మ‌వుతున్నాయ‌ని, అందుక‌నే స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారులు ఉద‌యాన్నే ఫోన్‌ల‌ను చూడ‌డం మానేస్తున్నార‌ని చెబుతున్నారు.

ఉద‌యాన్నే ప్ర‌తికూల వార్త‌ల‌ను చ‌దివితే..

2025లో విడుదలైన రాయిటర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ డిజిటల్‌ న్యూస్‌ రిపోర్ట్ తెలిపిన ప్రకారం కెనడాలో 69 శాతం మంది కనీసం అప్పుడప్పుడు వార్తలను దూరంగా పెడుతున్నారని వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 40 శాతానికి చేరింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్థాయి. వార్తలు చూస్తే మూడ్‌ చెడిపోతోంద‌ని, ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నట్టు అనిపిస్తోందంటూ చాలా మంది తమ అనుభవాలను పంచుకుంటున్నారు. డెవలప్‌మెంటల్‌ సైకాలజీ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఇది బలహీనత కాదు, సమాజంపై ఆసక్తి తగ్గిపోవడం కూడా కాదు. మన మెదడు తట్టుకోలేని స్థాయిలో ప్రతికూల సమాచారాన్ని నిరంతరం స్వీకరించడం వల్లే ఈ పరిస్థితి వస్తోంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. మనిషి మెదడు వేల ఏళ్ల క్రితమే ప్రమాదాలను గుర్తించి బతికేలా అభివృద్ధి చెందింది. అడవిలో చిన్న శబ్దం వినిపించినా అప్రమత్తంగా ఉండే వారు బతికి బయటపడ్డారు. అందుకే మన మెదడు సహజంగానే ప్రతికూల విషయాలపై ఎక్కువ దృష్టి పెడుతుంది. దీనినే సైకాలజీలో నెగటివిటీ బయాస్‌ అంటారు. అందమైన సూర్యాస్తమయం కంటే దగ్గరలో ఉన్న ప్రమాదమే మెదడుకు ముఖ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రమాదాన్ని గుర్తించకపోతే ప్రాణహాని ఉంటుంది. అయితే అవసరం లేని భయానికి గరిష్ఠంగా కొన్ని నిమిషాల అప్రమత్తతే ఖర్చవుతుంది. అందుకే చెడు వార్తలకు మెదడు వెంటనే స్పందిస్తుంది.

ప్ర‌తికూల వార్త‌ల‌కే ఎక్కువ స్పంద‌న‌..

గతంలో మనుషులు తమ చుట్టుపక్కల జరిగే సంఘటనలతో మాత్రమే జీవించేవారు. పొరుగువారి సమస్యలు, గ్రామంలో కరువు, కుటుంబంలో అనారోగ్యం వంటి పరిమిత సమాచారం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్ర‌స్తుత త‌రుణంలో ఒక‌ రోజులోనే ప్రపంచంలోని యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, వాతావరణ విపత్తులు, హింసాత్మక ఘటనలు అన్నీ ఒకేసారి మొబైల్‌ స్క్రీన్‌లోకి వస్తున్నాయి. దీంతో మెదడు నిరంతరం ఒత్తిడిలో పడుతోంది. నేచర్‌ హ్యూమన్‌ బిహేవియర్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం 1.05 లక్షలకుపైగా న్యూస్‌ హెడ్‌లైన్స్‌ను విశ్లేషించగా ప్రతికూల పదాలు ఉన్న వార్తలకు ఎక్కువ క్లిక్స్‌ వచ్చినట్లు తేలింది. పాజిటివ్‌ పదాలు ఉన్న వార్తలకు మాత్రం తక్కువ స్పందన వచ్చింది. ఇటీవల నిర్వహించిన అధ్యయనాల ప్ర‌కారం ప్రతికూల వార్తలను చూసినప్పుడు శరీరం ముందే స్పందిస్తుంది. ఆ వార్త మనకు సంబంధముందా లేదా అనేది మెదడు నిర్ణయించేలోపే ఒత్తిడి ప్రతిచర్య మొదలవుతుంది.

ఏంటీ పీఎన్‌సీ..

పరిశోధకులు ప్ర‌స్తుతం దీన్ని ప్రాబ్లమాటిక్‌ న్యూస్‌ కన్సంప్షన్ (పీఎన్‌సీ) అనే క్లినికల్‌ ఫ్రేమ్‌వర్క్‌గా పరిగణిస్తున్నారు. అంటే వార్తలపై అతిగా దృష్టి పెట్టడం వల్ల వ్యక్తి రోజువారీ జీవితం, భావోద్వేగాలు, మానసిక సమతుల్యత దెబ్బతినే పరిస్థితి ఏర్ప‌డుతుంది. 2022లో అమెరికాలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, 17 శాతం మంది పెద్దలు తీవ్రమైన స్థాయి పీఎన్‌సీతో బాధపడుతున్న‌ట్లు వెల్ల‌డైంది. ఈ వర్గంలో 61 శాతం మంది తీవ్ర మానసిక అస్వస్థతను అనుభవిస్తున్నట్లు తెలిపారు. పీఎన్‌సీ లేని వారిలో ఇది కేవలం 6 శాతంగానే ఉంది. ప్రత్యేకంగా మైనారిటీ వర్గాలు, వలసదారులపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటోంది. తమ దేశం లేదా తమ సమాజానికి సంబంధించిన హింసాత్మక ఘటనలు వరుసగా చూస్తూ ఉండటం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతోంది. అలాంటి వార్తల నుంచి పూర్తిగా దూరంగా ఉండటం కూడా వారికి అంత సులభం కావ‌డం లేదని వెల్ల‌డైంది. అయితే పూర్తిగా వార్తలు మానేయడం సరైన పరిష్కారం కాదు. ప్రజాస్వామ్యంలో సమాచారం తెలిసిన పౌరులు అవసరం. తప్పుడు సమాచార వ్యాప్తి ఇప్పటికే పెద్ద సమస్యగా మారింది. నమ్మదగిన వార్తలను దూరం పెట్టడం వల్ల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంటుంది.

వార్త‌ల‌ను చ‌ద‌వ‌డం ఆప‌వ‌ద్దు.. కానీ..

మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వార్తల వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. రోజులో నిర్ణీత సమయాల్లో మాత్రమే వార్తలు చూడాలి. సోషల్‌ మీడియా పోస్టుల కంటే లోతైన విశ్లేషణలున్న ఆర్టికల్స్‌ చదవాలి. ప్రతి వార్తపై ఆందోళన చెందకుండా, మనం ఏం చేయగలమో దానిపై దృష్టి పెట్టాలి. సోషల్‌ మీడియాలో ఉద్దేశపూర్వకంగా కోపం తెప్పించే రేజ్‌ బైట్‌ కంటెంట్‌ను గుర్తించి దూరంగా ఉండాలి. ప్రపంచంలో చెడు వార్తలు తగ్గకపోవచ్చు. కానీ వాటితో సంబంధాన్ని నియంత్రించుకోవడం మాత్రం సాధ్యమే. మెదడు ఈ స్థాయి సమాచార ప్రవాహానికి తయారుకాలేదు. కానీ పరిస్థితులకు తగినట్టు మారడం మాత్రం నేర్చుకునే సామ‌ర్థ్యం క‌లిగి ఉంటుంది. అందుకు కావ‌ల్సింద‌ల్లా ఓపిక మాత్ర‌మేన‌ని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement