త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Sajjanar | బక్రీద్‌ వేళ నకిలీ యాప్‌లతో మోసాలు.. వ్యాపారులను హెచ్చరించిన సీపీ సజ్జనార్‌

CP Sajjanar | బక్రీద్‌ పండుగ సమీపిస్తుండటంతో నగరంలోని మేకలు, గొర్రెల మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. అయితే ఈ రద్దీని అవకాశంగా తీసుకుని కొందరు కేటుగాళ్లు డిజిటల్‌ చెల్లింపుల పేరుతో వ్యాపారులను మోసం చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా ఫోన్‌పే వంటి యాప్‌లకు పోలి ఉండే నకిలీ యాప్‌లను ఉపయోగిస్తూ వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్నారు.

P

Hyderabad | Published On May 26, 2026, 12.12 pm IST

CP Sajjanar | బక్రీద్‌ వేళ నకిలీ యాప్‌లతో మోసాలు.. వ్యాపారులను హెచ్చరించిన సీపీ సజ్జనార్‌
Advertisement

CP Sajjanar | బక్రీద్‌ పండుగ సమీపిస్తుండటంతో నగరంలోని మేకలు, గొర్రెల మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. అయితే ఈ రద్దీని అవకాశంగా తీసుకుని కొందరు కేటుగాళ్లు డిజిటల్‌ చెల్లింపుల పేరుతో వ్యాపారులను మోసం చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా ఫోన్‌పే వంటి యాప్‌లకు పోలి ఉండే నకిలీ యాప్‌లను ఉపయోగిస్తూ వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్నారు. మోసగాళ్లు తమ మొబైల్‌లో ‘పేమెంట్‌ సక్సెస్‌’ అయినట్లు కనిపించే ఫేక్‌ స్క్రీన్‌ చూపించి, డబ్బులు పంపినట్టు నమ్మిస్తున్నారు. మార్కెట్‌లో ఉండే హడావుడిని ఆసరాగా చేసుకుని, డబ్బు ఖాతాలో పడిందో లేదో చెక్‌ చేయకుండా పశువులను తీసుకెళ్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని కంచన్‌బాగ్‌, రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఇలాంటి రెండు మోసాలు నమోదయ్యాయి. కంచన్‌బాగ్‌లో ముగ్గురు బైక్‌లపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు ఓ వ్యాపారితో బేరం కుదుర్చుకుని రూ.68 వేల చెల్లింపు చేసినట్లు నకిలీ యాప్‌ స్క్రీన్‌ చూపించి మేకలను తీసుకెళ్లారు.

రాజేంద్రనగర్‌లో నలుగురు వ్యక్తులు రూ.48 వేల విలువైన మేకలను కొనుగోలు చేసి, ఫేక్‌ పేమెంట్‌ యాప్‌తో వ్యాపారిని మోసం చేశారు. తర్వాత బ్యాంక్‌ ఖాతా చెక్‌ చేసిన బాధితులకు డబ్బులు జమ కాలేదని తెలిసి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనల నేపథ్యంలో మేకలు, గొర్రెల వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సూచించారు. ఎవరైనా ఆన్‌లైన్‌ ద్వారా డబ్బు పంపించామని చెబితే, కేవలం వారి మొబైల్‌లో కనిపించే స్క్రీన్‌షాట్‌, ‘పేమెంట్‌ సక్సెస్‌’ మెసేజ్‌ను నమ్మొద్దని సూచించారు. వ్యాపారులు తమ మొబైల్‌కు వచ్చే అధికారిక బ్యాంక్‌ ఎస్ఎంఎస్‌, బ్యాంకింగ్‌ యాప్‌లో బ్యాలెన్స్‌ పెరిగిందో లేదో స్వయంగా నిర్ధారించుకున్న తర్వాతే మేకలు, గొర్రెలను అప్పగించాలని సూచించారు. వీలైతే పెద్ద మొత్తాల లావాదేవీలు నగదు రూపంలోనే జరపడం మంచిదని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా, మోసం చేసే ప్రయత్నం చేసినా వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని, సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Advertisement
Advertisement