త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Money Saving | చిన్న చిన్న ఖ‌ర్చులే దీర్ఘ‌కాలంలో భారీ న‌ష్టాల‌ను ఇస్తాయా.. డ‌బ్బు పొదుపు చేయ‌డంలో మ‌ల్లర్నీ ఏం చెప్పారు..?

Money Saving | రోజూ చేసే చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ ఆర్థిక నష్టానికి కారణమవుతాయని అమెరికాకు చెందిన వెల్త్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఎటాన్ సొల్యూష‌న్స్ సీఈవో, యూనివ‌ర్సిటీ ఆఫ్ నార్త్ క‌రోలినా ప్రైవేట్ వెల్త్ మేనేజ్‌మెంట్ అధ్యాప‌కుడు రాబ్ మల్లర్నీ అన్నారు.

S

Business | Published On May 26, 2026, 12.48 pm IST

Money Saving | చిన్న చిన్న ఖ‌ర్చులే దీర్ఘ‌కాలంలో భారీ న‌ష్టాల‌ను ఇస్తాయా.. డ‌బ్బు పొదుపు చేయ‌డంలో మ‌ల్లర్నీ ఏం చెప్పారు..?
Advertisement

Money Saving | రోజూ చేసే చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ ఆర్థిక నష్టానికి కారణమవుతాయని అమెరికాకు చెందిన వెల్త్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఎటాన్ సొల్యూష‌న్స్ సీఈవో, యూనివ‌ర్సిటీ ఆఫ్ నార్త్ క‌రోలినా ప్రైవేట్ వెల్త్ మేనేజ్‌మెంట్ అధ్యాప‌కుడు రాబ్ మల్లర్నీ అన్నారు. పెట్టుబడులపై అధిక రాబడుల‌ను వెంబడించడం కంటే, రోజువారీ స్పెండింగ్ ట్రాప్స్ ను నియంత్రించడం ద్వారానే నిజమైన సంపద పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. బిజినెస్ ఇన్ సైడ‌ర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ ధనికులు కేవలం ఎక్కువ సంపాదించడమే కాకుండా తమ ఖర్చులపై కఠిన నిఘా ఉంచుతారని చెప్పారు. ప్రతిరోజూ తీసుకునే చిన్న నిర్ణయాలే జీవితకాలంలో కోట్ల‌ రూపాయ‌ల‌ను ఆదా చేయిస్తాయ‌ని, అలా చేయ‌క‌పోతే అవే డ‌బ్బుల‌ను మ‌నం న‌ష్ట‌పోతామ‌ని చెప్పారు. జీవితంలో డ‌బ్బు సంపాదించాల‌ని లేదా డ‌బ్బు విష‌యంలో ల‌క్ష్యాల‌ను క‌లిగి ఉండే వారు 3 ముఖ్య‌మైన నియ‌మాల‌ను గుర్తుంచుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

టీ, కాఫీ చిన్న విష‌య‌మే.. కానీ..

ప్ర‌తి ఉద‌యం చాలా మంది ఉద‌యం టీ, కాఫీల‌ను ఇంట్లో తాగ‌కుండా బ‌య‌ట తాగుతుంటారు. వాస్త‌వానికి రూ.10 టీ చిన్న విష‌య‌మే అయిన‌ప్ప‌టికీ, దీర్ఘ‌కాలంలో అది భారీ మొత్తంగా మారుతుందని మ‌ల్ల‌ర్నీ తెలిపారు. ఆ డ‌బ్బును సేవ్ చేసి పెట్టుబ‌డిగా మార్చితే రిటైర్ అయ్యే స‌మ‌యానికి పోర్ట్ ఫోలియోలో ల‌క్ష‌ల రూపాయ‌ల అద‌న‌పు సంప‌ద చేరుతుంద‌ని అన్నారు.

విలాసాలు వ‌ద్దు..

చాలా మంది స‌రైన ఆర్థిక స్థోమ‌త లేక‌పోయినా డిజైన‌ర్ వ‌స్తువులు, ల‌గ్జ‌రీ కార్లు లేదా ఫోన్లు, ఇత‌ర గ్యాడ్జెట్ల‌ను కొంటుంటారు. వాస్త‌వానికి అవి తాత్కాలికంగానే సంతృప్తిని ఇస్తాయ‌ని ఆయ‌న అన్నారు. అధిక నిక‌ర విలువ క‌లిగిన వ్య‌క్తులు ఇత‌రుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి కాకుండా, అవ‌స‌రం లేదా విలువ ఆధారిత కొనుగోలు నిర్ణ‌యాల‌ను మాత్ర‌మే తీసుకుంటార‌ని అన్నారు.

లెక్క‌ల‌ను ట్రాక్ చేయాలి..

చాలా మంది రోజూ డ‌బ్బును అనేక విధాలుగా ఖ‌ర్చు చేస్తుంటారు. కానీ దేనికి ఎంత మొత్తం, ఎప్పుడు, ఎక్క‌డ ఎలా ఖ‌ర్చు చేశారో లెక్కల‌ను ట్రాక్ చేయ‌రు. ఇది స‌రైన ఆర్థిక క్ర‌మ శిక్ష‌ణ కాద‌ని మ‌ల్ల‌ర్నీ అన్నారు. ఫుడ్ డెలివ‌రీ, ఆన్ లైన్ షాపింగ్‌, ఇంటికి కావ‌ల్సిన స‌రుకులు, ఇత‌ర ఖ‌ర్చులు ఏవైనా స‌రే ప్ర‌తి పైసాను ఎలా ఖ‌ర్చు చేస్తున్నారో లెక్క రాసుకోవాల‌ని అన్నారు. దీని వ‌ల్ల ఏయే అంశాల్లో ఎక్కువ డ‌బ్బు ఖ‌ర్చ‌వుతుందో తెలుసుకుని ఖ‌ర్చును త‌గ్గించుకునే అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌న్నారు. చాలా మంది ధ‌నికులు ఇదే సూత్రాన్ని పాటిస్తార‌ని, అందుకనే అనేక వ్యాపారాల్లోనూ రాణిస్తుంటార‌ని, వ్యాపారం లేదా ప‌రిశ్ర‌మ ఏది నిర్వ‌హించినా స‌రే ఖ‌ర్చుల‌ను లెక్క రాసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి అని అన్నారు. దీని వ‌ల్ల బ‌డ్జెట్‌పై నియంత్ర‌ణ ఏర్ప‌డుతుంద‌ని, ఖర్చులు త‌గ్గుతాయ‌ని, పొదుపు పెరుగుతుంద‌ని తెలిపారు.

ఇక రిటైర్మెంట్ ఫండ్ అంశంపై కూడా మ‌ల్ల‌ర్నీ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. వైద్యం లేదా ఇత‌ర ఖ‌ర్చుల‌కు అప్ప‌టిక‌ప్పుడు ఎమ‌ర్జెన్సీలో అవ‌స‌రం అయ్యే అత్య‌వ‌సర నిధిని ఏర్పాటు చేసుకోవాల‌ని, అలాగే రిటైర్ అయ్యాక డ‌బ్బుకు ఢోకా లేకుండా ఉండేందుకు ముందు నుంచే రిటైర్మెంట్ ప్లాన్లు త‌ప్ప‌నిస‌రి అని ఆయ‌న సూచించారు.

Advertisement
Advertisement