త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stress Test | స్ట్రెస్ టెస్ట్ నార్మ‌ల్ వ‌స్తే లైట్ తీసుకోవ‌ద్దు.. గుండె పోటు ప్ర‌మాదం పూర్తిగా తొల‌గిపోదు..

Stress Test | గుండెకు రక్తప్రసరణ తీవ్రంగా తగ్గిపోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం వల్ల గుండెపోటు (హార్ట్ అటాక్) సంభవిస్తుంది. ఇది సాధారణమైనదే అయినప్పటికీ అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య. ప్రధానంగా కరోనరీ ఆర్టరీల్లో కొవ్వు, కొలెస్ట్రాల్, ఇతర పదార్థాలు పేరుకుపోయి ప్లాక్ (వ్య‌ర్థాలు) ఏర్పడటం వల్ల ఈ పరిస్థితి వస్తుంది.

S

Lifestyle | Published On May 29, 2026, 4.26 pm IST

Stress Test | స్ట్రెస్ టెస్ట్ నార్మ‌ల్ వ‌స్తే లైట్ తీసుకోవ‌ద్దు.. గుండె పోటు ప్ర‌మాదం పూర్తిగా తొల‌గిపోదు..
Advertisement

Stress Test | గుండెకు రక్తప్రసరణ తీవ్రంగా తగ్గిపోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం వల్ల గుండెపోటు (హార్ట్ అటాక్) సంభవిస్తుంది. ఇది సాధారణమైనదే అయినప్పటికీ అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య. ప్రధానంగా కరోనరీ ఆర్టరీల్లో కొవ్వు, కొలెస్ట్రాల్, ఇతర పదార్థాలు పేరుకుపోయి ప్లాక్ (వ్య‌ర్థాలు) ఏర్పడటం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. స్ట్రెస్ టెస్ట్‌లో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ గుండెపోటు ప్రమాదం పూర్తిగా తొలగిపోదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు ప్రమాదాన్ని అంచనా వేయడానికి వైద్యులు తరచూ స్ట్రెస్ టెస్ట్ చేయించాలని సూచిస్తున్నారు. గుండె అత్యధికంగా పనిచేస్తున్న సమయంలో అది ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. అయితే స్ట్రెస్ టెస్ట్ ఫలితం నార్మల్ గా వచ్చినా, గుండెపోటు వచ్చే అవకాశాలు సున్నా అని చెప్పలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఆర్ట‌రీలు ఎలా ఉన్నాయో చూపించ‌దు..

అమెరికాకు చెందిన కార్డియాలజిస్టు, హార్ట్ ఫెయిల్యూర్, ట్రాన్స్‌ప్లాంటేషన్ నిపుణుడు డాక్టర్ దిమిత్రి యారనోవ్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్ట్రెస్ టెస్ట్ అసలు ఏం పరిశీలిస్తుందో, దాని పరిమితులు ఏమిటో, అలాగే గుండె ఆరోగ్యంపై ఆందోళన ఉన్నవారు గమనించాల్సిన ఇతర లక్షణాలు ఏమిటో వివ‌రించారు. స్ట్రెస్ టెస్ట్ గుండెకు రక్తప్రసరణ ఎలా జరుగుతోందో చూపిస్తుంది. కానీ ఆర్టరీలు వాస్తవంగా ఎలా ఉన్నాయో మాత్రం ఇది చూపించదు. ఒత్తిడి సమయంలో గుండెకు వెళ్లే రక్తప్రవాహం తగ్గితే, అది సాధారణంగా ప్లాక్ పేరుకుపోవడం వల్ల ఆర్టరీ గణనీయంగా ఇరుకుగా మారిందని సూచిస్తుంది. అయితే ప్రమాదకరమైన ప్లాక్‌లలో సాఫ్ట్ ప్లాక్, ఇన్‌ఫ్లేమ్డ్ ప్లాక్, నాన్-ఆబ్స్ట్రక్టివ్ ప్లాక్, అలాగే పగిలే ముందు దాగి ఉండే ప్లాక్‌లు కూడా ఉంటాయి. చాలా గుండెపోటులు రక్తప్రవాహాన్ని తీవ్రంగా అడ్డుకోని ప్లాక్‌ల వల్లే సంభవిస్తాయ‌ని డాక్టర్ యారనోవ్ తెలిపారు.

వీటిని కూడా గ‌మ‌నించాలి..

గుండెపోటు ప్రమాదాన్ని ప్రభావితం చేసే మూడు ముఖ్యమైన అంశాలను స్ట్రెస్ టెస్ట్ గుర్తించలేదని డాక్టర్ యారనోవ్ వెల్లడించారు. స్ట్రెస్ టెస్ట్ నేరుగా ప్లాక్‌ను పరిశీలించదని, స్ట్రెస్ టెస్ట్ అథెరోస్క్లెరోసిస్ లేదని నిర్ధారించలేదని, సాఫ్ట్, నాన్-ఆబ్స్ట్రక్టివ్ ప్లాక్‌లను విశ్వసనీయంగా గుర్తించలేద‌ని తెలిపారు. ప్లాక్ రక్తనాళ గోడల్లో దాగి ఉండి రక్తప్రవాహానికి అడ్డంకి కాకపోతే, ఆ ఆర్టరీలో రక్తప్రసరణ సాధారణంగానే కనిపిస్తుంద‌ని అన్నారు. స్ట్రెస్ టెస్ట్ రిపోర్ట్ నార్మల్ గా రావడం కొంత భరోసా కలిగించినప్పటికీ, అది గుండెపోటు నుంచి పూర్తి రక్షణ కల్పించదని డాక్టర్ యారనోవ్ పేర్కొన్నారు. అందువల్ల ముందస్తు హెచ్చరికలుగా కనిపించే కొన్ని లక్షణాలను తప్పనిసరిగా గమనించాలని సూచించారు. ఛాతీలో అసౌకర్యం (చెస్ట్ డిస్‌కంఫర్ట్), శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్), వ్యాయామం చేయలేకపోవడం లేదా త్వరగా అలసిపోవడం (ఎక్సర్‌సైజ్ ఇంటోలరెన్స్), కుటుంబంలో గుండె జబ్బుల బలమైన చరిత్ర (స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ), మెటబాలిక్ వ్యాధులు ఉండ‌డం వంటి కార‌ణాలు కూడా గుండె ఆరోగ్యాన్ని ప్ర‌భావితం చేస్తాయ‌ని చెప్పారు. అందువ‌ల్ల స్ట్రెస్ టెస్ట్ నార్మ‌ల్ వ‌చ్చినా లైట్ తీసుకోకూడ‌ద‌ని, ఆయా అంశాల‌ను కూడా ప‌రిశీలించాల్సి ఉంటుంద‌ని తెలిపారు. లేదంటే దాగి ఉన్న గుండె స‌మ‌స్య‌ను గుర్తించ‌లేమ‌ని హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement