త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Micro Plastics | తాగునీటిలో మైక్రోప్లాస్టిక్స్.. ఆర్‌వో ప్యూరిఫైయర్స్ అవ‌స‌రం అంటున్న నిపుణులు..

Micro Plastics | ఇప్పటి వరకు ఇంట్లోని తాగునీటిలో భారీ లోహాలు, హానికర బ్యాక్టీరియా వంటి కాలుష్యాల గురించి మాత్రమే ప్రజలు ఆందోళన చెందేవారు. అయితే ఇప్పుడు మరో కొత్త ప్రమాదం వెలుగులోకి వచ్చింది. ఇంటికి వచ్చే ట్యాప్ వాటర్‌లో మైక్రోప్లాస్టిక్స్ కలుషితం అవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

S

Lifestyle | Published On Jun 23, 2026, 11.47 am IST

Micro Plastics | తాగునీటిలో మైక్రోప్లాస్టిక్స్.. ఆర్‌వో ప్యూరిఫైయర్స్ అవ‌స‌రం అంటున్న నిపుణులు..
Advertisement

Micro Plastics | ఇప్పటి వరకు ఇంట్లోని తాగునీటిలో భారీ లోహాలు, హానికర బ్యాక్టీరియా వంటి కాలుష్యాల గురించి మాత్రమే ప్రజలు ఆందోళన చెందేవారు. అయితే ఇప్పుడు మరో కొత్త ప్రమాదం వెలుగులోకి వచ్చింది. ఇంటికి వచ్చే ట్యాప్ వాటర్‌లో మైక్రోప్లాస్టిక్స్ కలుషితం అవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో వాటర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్‌ను ఎంపిక చేసే సమయంలో ఎవ‌రైనా స‌రే కొత్త ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మైక్రోప్లాస్టిక్స్ అంటే సాధారణంగా 5 మిల్లీమీటర్ల కంటే చిన్న పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ కణాలు. ప్లాస్టిక్ ర్యాపర్లు, వాహనాల టైర్లు, పాలిస్టర్ దుస్తులు వంటి వస్తువులు క్రమంగా విచ్ఛిన్నం కావడం వల్ల ఇవి ఏర్పడతాయి. ఈ సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి ప్రవేశిస్తే ఆక్సిడేటివ్ డ్యామేజ్, డీఎన్ఏ నష్టం, జన్యు కార్యకలాపాల్లో మార్పులు త‌దిత‌ర‌ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. దీర్ఘకాలంలో క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుంద‌ని పరిశోధనలు చెబుతున్నాయి.

తాగునీటిలో భారీగా మైక్రో ప్లాస్టిక్స్‌..

2024లో స్విట్జర్లాండ్‌కు చెందిన స్వ‌చ్ఛంద‌ సంస్థ ఈఏ ఎర్త్ యాక్ష‌న్ చేసిన‌ విశ్లేషణ ప్రకారం భారత్‌లోని నీటి వనరుల్లోకి సుమారు 3,91,879 టన్నుల మైక్రోప్లాస్టిక్స్ విడుదలై ఉంటాయ‌ని అంచనా వేసింది. దీనికి ప్రధాన కారణంగా సరైన వ్యర్థాల నిర్వహణ లేకపోవడాన్ని గుర్తించింది. అలాగే గతేడాది ఢిల్లీ ప్రభుత్వం చేప‌ట్టిన‌ ఓ అధ్యయనంలో రాజధాని ప్రాంతంలోని భూగర్భ జల నమూనాల్లో కూడా మైక్రోప్లాస్టిక్స్ ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విశ్వసనీయమైన వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్‌లో పెట్టుబడి పెట్టడం ఆవ‌శ్య‌క‌మైంది. సాధారణ కార్బన్ ఫిల్టర్లు రసాయనాలు, దుర్వాసనలను తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. అయితే మైక్రోప్లాస్టిక్స్‌ను ప్రత్యేకంగా అడ్డుకునే విధంగా వాటిని రూపొందించలేదు. అందుకే నిపుణులు ఆర్‌వో, యూఎఫ్ లేదా ఎంఎఫ్‌ మెంబ్రేన్ టెక్నాలజీ కలిగిన ప్యూరిఫైయర్లను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ మెంబ్రేన్‌లు సూక్ష్మ ప్లాస్టిక్ కణాలను భౌతికంగా అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

స‌రైన ఫిల్ట్రేష‌న్ అవ‌స‌రం..

ప్రపంచవ్యాప్తంగా నదులు, భూగర్భ జలాలు, బాటిల్ వాటర్, శుద్ధి చేసిన ట్యాప్ వాటర్‌లో కూడా మైక్రోప్లాస్టిక్స్ ను గుర్తించారు. వీటి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నప్పటికీ, ఈ కణాలు హానికర పదార్థాలను మోసుకెళ్లే అవకాశం ఉంటుందని, కాలక్రమేణా శరీరంలో పేరుకుపోతాయ‌ని అధ్యయనాలు తెలియ‌జేస్తున్నాయి. తాగునీరు రోజువారీగా చాలా మంది తీసుకునే ప్రధాన వనరు కావడంతో, సరైన ఫిల్ట్రేషన్ వ్యవస్థను ఉపయోగించడం ద్వారా మైక్రోప్లాస్టిక్స్ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.

ఆర్‌వో వ్య‌వ‌స్థ మేలు..

మైక్రోప్లాస్టిక్స్ తొలగింపే ప్రధాన లక్ష్యమైతే, ఫిల్ట్రేషన్ మెంబ్రేన్ నాణ్యతను మొదట పరిశీలించాలి. రివర్స్ ఆస్మోసిస్ (ఆర్‌వో) వ్యవస్థలు అత్యంత సూక్ష్మ స్థాయి ఫిల్ట్రేషన్‌ను అందిస్తాయి. అందువల్ల సూక్ష్మ కణాలను తొలగించడంలో ఇవి అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి. ఆర్‌వోతో పాటు యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్ట్రేషన్ కలిగిన ప్యూరిఫైయర్లను ఎంపిక చేయడం మంచిది. తాగునీరు మొత్తం మెంబ్రేన్ ద్వారా వెళ్లేలా ఉండాలి. ఎన్ఎస్ఎఫ్‌, ఏఎన్ఎస్ఐ 58 త‌దిత‌ర గుర్తింపు పొందిన సర్టిఫికేషన్లు ఉన్నాయా అనే విషయాన్ని కూడా పరిశీలించాలి. కేవలం మార్కెటింగ్ పదజాలం లేదా ఫిల్ట్రేషన్ స్టేజీల సంఖ్యపై ఆధారపడకుండా, ఉపయోగిస్తున్న ఫిల్ట్రేషన్ టెక్నాలజీలను స్పష్టంగా వెల్లడించే ఉత్పత్తులను ఎంచుకోవడం ఉత్తమం.

చెక్ చేసి కొనాలి..

అత్యాధునిక ప్యూరిఫైయర్ అయినప్పటికీ దాని పనితీరు ఫిల్టర్ల స్థితిపై ఆధారపడి ఉంటుంది. క్రమం తప్పకుండా నిర్వహణ చేయడం వల్ల ఫిల్ట్రేషన్ సామర్థ్యం స్థిరంగా ఉంటుంది. అలాగే పాడైన లేదా క్ష‌యానికి గురైన‌ భాగాల ద్వారా కలుషితాలు తిరిగి నీటిలోకి చేరకుండా నివారించవచ్చు. తయారీదారు సూచించిన షెడ్యూల్ ప్రకారం ప్రీ-ఫిల్టర్లు, కార్బన్ ఫిల్టర్లు, ఆర్‌వో మెంబ్రేన్‌ను మార్చాలి. స్టోరేజ్ ట్యాంక్‌ను కూడా నిర్దిష్ట వ్యవధిలో శుభ్రం చేయాలి. నీటి రుచి, వాసన లేదా ప్రవాహంలో మార్పులు కనిపిస్తే వెంటనే తనిఖీ చేయడం అవసరం. క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయడం ద్వారా ఫిల్ట్రేషన్ సామర్థ్యంతోపాటు ప్యూరిఫైయర్ జీవితకాలం కూడా పెరుగుతుంది.

Advertisement
Advertisement