త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Swine Flu | స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నా, ఆందోళ‌న అక్క‌ర్లేదు: మాజీ ఐసీఎంఆర్ చీఫ్

Swine Flu | భారత్‌లో స్వైన్‌ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని భారత వైద్య పరిశోధనా మండలి మాజీ డైరెక్టర్ జనరల్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ నిర్మల్ కుమార్ గంగూలీ తెలిపారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండటంతోపాటు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

S

Health | Published On Aug 27, 2026, 2.54 pm IST

Swine Flu | స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నా, ఆందోళ‌న అక్క‌ర్లేదు: మాజీ ఐసీఎంఆర్ చీఫ్
Advertisement

Swine Flu | భారత్‌లో స్వైన్‌ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని భారత వైద్య పరిశోధనా మండలి మాజీ డైరెక్టర్ జనరల్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ నిర్మల్ కుమార్ గంగూలీ తెలిపారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండటంతోపాటు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఐఏఎన్ఎస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో స్వైన్‌ఫ్లూ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపారు. హెచ్1ఎన్1 వైరస్ కొత్తది కాదని, అందువల్ల ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. వాస్తవానికి ఇన్‌ఫ్లుయెంజా వైరస్ చాలా పురాతనమైనద‌ని అన్నారు. ఈ రకమైన ఇన్‌ఫ్లుయెంజా వైరస్ తొలి పెద్ద వ్యాప్తి మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కనిపించింద‌ని, స్పెయిన్‌లో సంభవించినందున దాన్ని స్పానిష్ ఫ్లూ అని పిలిచార‌ని తెలిపారు.

భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు..

స్పెయిన్, ఫ్రాన్స్‌లలో పెద్ద మహమ్మారి కారణంగా రోగనిరోధక శక్తి లేకపోవడంతో సగం జనాభా అంతరించిపోయింద‌ని అన్నారు. ఆ తర్వాత ఈ వైరస్ క్రమం తప్పకుండా వ్యాప్తి చెందుతూనే ఉంద‌ని, వైరస్‌లోని రకాలు, వేరియంట్లు కూడా మారుతూ ఉంటాయ‌ని అన్నారు. ప్రధానంగా ఇన్‌ఫ్లుయెంజా ఎ, ఇన్‌ఫ్లుయెంజా బి, పారాఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు ఉన్నాయ‌ని, అయితే ఈ వైరస్ కొత్తది కాద‌ని ప్రొఫెసర్ గంగూలీ వివ‌రించారు. హెచ్1ఎన్1 ఒక వేరియంట్ అని, హెచ్3ఎన్2 మరో వేరియంట్ అని, భారత్‌లో హెచ్3ఎన్2 కేసులు తక్కువ సంఖ్యలో ఉన్నాయ‌ని, యూరప్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా హెచ్3ఎన్2 వేరియంట్ ఏకకాలంలో వ్యాప్తిలో ఉంద‌ని తెలిపారు. కాగా స్వైన్ ఫ్లూకు సంబంధించి 2011 నుంచి ఇప్పటి వరకు సుమారు 1.14 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు ఢిల్లీలో 2,300 కేసులు నమోదయ్యాయ‌ని, బెంగళూరులో ఈ ఏడాది ఆగస్టు వరకు సుమారు 4వేల కేసులు నమోదయ్యాయ‌ని తెలిపారు. కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, కేరళలో కూడా దాదాపు 2,500 నుంచి 3వేల వరకు కేసులు నమోదైన‌ట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఢిల్లీలో నమోదైన కేసుల సంఖ్య గతేడాది బెంగళూరులో నమోదైన పరిస్థితితో సమానంగా ఉందని, అందువ‌ల్ల ప్రస్తుతం త‌న‌కు భయపడాల్సిన కారణం కనిపించడం లేద‌ని అన్నారు.

హెచ్‌1ఎన్‌1, కోవిడ్ 19 వేర్వేరు..

ఆసుపత్రుల్లో ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి టీకా తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఈ టీకా కూడా అందుబాటు ధరలోనే ఉంద‌ని, దీని ధర సుమారు రూ.800 నుంచి రూ.900 వరకు ఉంటుందని, ఆసుపత్రి సిబ్బందికి కూడా టీకాలు వేస్తున్నారని చెప్పారు. అయితే బలహీన వర్గాల ప్రజల కోసం ఏం చేయవచ్చో పరిశీలించాల‌ని, ముఖ్యంగా మురికివాడల్లో నివసించే ప్రజలు వంటి వర్గాలపై ప్రత్యేక దృష్టి అవసరమ‌ని అన్నారు. అయితే హెచ్‌1ఎన్‌1, కోవిడ్ 19 మ‌ధ్య ప‌లు తేడాలు ఉన్నాయ‌ని తెలిపారు. ఈ రెండు వైరస్‌ల వర్గీకరణ పూర్తిగా భిన్నంగా ఉంటుంద‌ని, ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు మైక్సోవైరస్‌లకు చెందినవి కాగా, కోవిడ్ వైరస్ కరోనా వైరస్‌కు చెందినద‌ని వివ‌రించారు. అయితే రెండు వైరస్‌లు కూడా జంతువుల్లో ఉండి, ఆ తర్వాత మనుషుల్లోకి వ్యాప్తి చెందుతాయ‌ని, ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు పాత వైరస్‌లు కావడంతో యువతలో చాలామందికి ఇప్పటికే రోగనిరోధక శక్తి ఏర్పడింద‌ని అన్నారు. అందువల్ల ఇప్పుడు యువకుల్లో ఇన్‌ఫెక్షన్ తక్కువగా కనిపిస్తుంద‌ని, కోవిడ్ కొత్త వైరస్ కావడంతో యువకులు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమయ్యార‌ని అన్నారు.

కోవిడ్‌తో పోలిస్తే ప్ర‌భావం త‌క్కువే..

అలాగే ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లలో కోవిడ్‌తో పోలిస్తే మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం తక్కువగా ఉంటుంద‌ని తెలిపారు. గుండెపై ప్రభావం కోవిడ్‌లో కనిపిస్తుంద‌ని, అయితే రెండు వైరస్‌ల వల్లా న్యుమోనియా వ‌స్తుంద‌ని, కోవిడ్ సమయంలో న్యుమోనియా కేసులు అత్యధికంగా కనిపించాయ‌ని అన్నారు. ఈ సీజన్‌లో నమోదవుతున్న ఫ్లూ కేసుల్లో 98 శాతం హెచ్1ఎన్1 వైరస్‌కు సంబంధించినవేనని, ఇలాంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరికీ పరీక్ష తప్పనిసరి కాదని అన్నారు. ఎవరైనా ఫ్లూ తరహా లక్షణాలతో బాధపడితే పారాసిటమాల్ తీసుకోవడం, ఎక్కువగా ద్రవాలు తీసుకోవడం, పోషకాహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిద‌ని సూచించారు. అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఛాతిలో నొప్పి ఉంటే పరీక్ష చేయించుకోవడం మంచిద‌ని అన్నారు. ఏ పరిస్థితిలోనైనా పరిశుభ్రత పాటించడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం చాలా ముఖ్యమ‌ని, ఇది కొత్త వైరస్ అయితే పరీక్షలు తప్పనిసరిగా చేయాల్సి వచ్చేద‌ని, అయితే వైరస్ వ్యాప్తిని పర్యవేక్షించేందుకు నమూనాలను పరీక్షిస్తున్నార‌ని తెలిపారు.

Advertisement
Advertisement