త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Winter Storm | అమెరికాలో మంచు తుఫాన్ ఉగ్ర రూపం.. 20 రాష్ట్రాల్లో ఎమ‌ర్జెన్సీ..

Winter Storm | అమెరికాలోని తూర్పు ప్రాంతంలో మూడింట రెండొంతుల భాగాన్ని మంచు తుఫాన్ పూర్తిగా క‌ప్పేసింది. దీంతో స్థానిక ప్రజ‌లకు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. న్యూమెక్సికో నుంచి న్యూఇంగ్లాండ్ వరకు సుమారు 2వేల మైళ్ల విస్తీర్ణంలో మంచు తుఫానులు, గడ్డకట్టే వర్షాలు, తీవ్రమైన ఐస్ పొరలు, ప్రాణాపాయకరమైన చలి వాతావరణం విస్తరించాయి.

S

International | Published On Jan 26, 2026, 7.58 am IST

Winter Storm | అమెరికాలో మంచు తుఫాన్ ఉగ్ర రూపం.. 20 రాష్ట్రాల్లో ఎమ‌ర్జెన్సీ..
Advertisement

Winter Storm | అమెరికాలోని తూర్పు ప్రాంతంలో మూడింట రెండొంతుల భాగాన్ని మంచు తుఫాన్ పూర్తిగా క‌ప్పేసింది. దీంతో స్థానిక ప్రజ‌లకు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. న్యూమెక్సికో నుంచి న్యూఇంగ్లాండ్ వరకు సుమారు 2వేల మైళ్ల విస్తీర్ణంలో మంచు తుఫానులు, గడ్డకట్టే వర్షాలు, తీవ్రమైన ఐస్ పొరలు, ప్రాణాపాయకరమైన చలి వాతావరణం విస్తరించాయి. ఈ ప్రకృతి విపత్తు దాదాపు 21.3 కోట్ల మందిపై ప్రభావం చూపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే 8.5 లక్షల మందికిపైగా ప్ర‌జ‌లకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా, 14 వేలకుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. దాదాపు 20 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ తుఫాన్‌ను అధికారులు చ‌రిత్రాత్మ‌క తుఫాన్‌గా పేర్కొంటుండ‌గా, దీని వ‌ల్ల దీర్ఘకాలంగా విద్యుత్‌కు అంత‌రాయం ఏర్ప‌డుతుంద‌ని, అలాగే ప్ర‌యాణ మార్గాల‌పై కూడా ప్ర‌భావం ప‌డుతుంద‌ని అధికారులు చెబుతున్నారు.

3220 కిలోమీట‌ర్ల మేర ప్ర‌భావం..

అమెరికా నేష‌న‌ల్ వెద‌ర్ స‌ర్వీస్‌ (NWS) ఈ తుఫానును అసాధారణమైనదిగా అభివర్ణించింది, 3,220 కిలోమీటర్ల మేర విస్తరించిన ప్రభావాన్ని గుర్తించింది. ఓహియో వ్యాలీ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు భారీ మంచు కురుస్తుండగా, లోయర్ మిసిసిపీ వ్యాలీ నుంచి దక్షిణ తూర్పు ప్రాంతాల వరకు విపరీతమైన ఐస్ పొర ఏర్పడుతోందని హెచ్చరించింది. వాతావరణ నిపుణురాలు అలిసన్ సాంటోరెల్లీ మాట్లాడుతూ, ఇంత విస్తృతంగా, ఇంత తీవ్రంగా ప్రభావం చూపే తుఫాను చాలా అరుదని, సాధారణంగా ఇలాంటి పరిస్థితులకు అలవాటు లేని ప్రాంతాలు ఇప్పుడు తీవ్రంగా దెబ్బతింటున్నాయని తెలిపారు. ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి దిగువకు పడిపోవడంతో పాటు, స్లీట్, ఫ్రీజింగ్ రైన్ పరిస్థితులు ఇంకా కొన్ని రోజులు కొనసాగవచ్చని అంచనా. గల్ఫ్ కోస్ట్ వరకు కూడా చలిగాలుల తీవ్రత మైనస్ డిగ్రీలకు చేరే అవకాశముందని అధికారులు తెలిపారు. దీని వల్ల రహదారులు ప్రమాదకరంగా మారడం, మౌలిక సదుపాయాలు దెబ్బతినడం, చెట్లు కూలిపోవడం, విద్యుత్ లైన్లు తెగిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని హెచ్చరించారు.

8.5 ల‌క్ష‌ల మందికి నిలిచిన విద్యుత్ స‌ర‌ఫ‌రా..

కాగా పవర్‌అవుటేజ్.యూఎస్ నివేదిక ప్రకారం, ప్రస్తుతం 8.5 లక్షల మందికి పైగా ప్రజలు విద్యుత్ లేక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. టెన్నెస్సీలో సుమారు 2.9 లక్షల మంది విద్యుత్ కోల్పోయారు. ఫ్లైట్ అవేర్ గణాంకాల ప్రకారం శనివారం నుంచి సోమవారం వరకు 14,800కుపైగా విమానాలు రద్దయ్యాయి. ఆదివారం ఒక్కరోజే 10 వేలకుపైగా విమానాలు రద్దయ్యాయి. సోమవారం నాటికి న్యూయార్క్, బోస్టన్ కేంద్రంగా మరో 1,600కుపైగా విమానాలు రద్దయ్యాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్ తమ విమానాల్లో 43 శాతం, డెల్టా సంస్థ 35 శాతం వరకు సర్వీసులు నిలిపివేసినట్లు తెలిపాయి. రన్‌వేలు మంచుతో కప్పుకుపోవడం, డీ-ఐసింగ్ ప్రక్రియలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ విపత్తుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో స్పందిస్తున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెన్నెస్సీ, జార్జియా, నార్త్ కరోలైనా, మేరీల్యాండ్, ఆర్కాన్సాస్, కెంటకీ, లూసియానా, మిసిసిపీ, ఇండియానా, వెస్ట్ వర్జీనియా సహా కనీసం 10 రాష్ట్రాలకు ఫెడరల్ డిజాస్టర్ డిక్లరేషన్లను ఆమోదించారు. మొత్తం మీద దాదాపు 20 రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీ అత్యవసర పరిస్థితిలో ఉన్నాయి. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో తుఫాను ప్రభావిత రాష్ట్రాలన్నింటితో నిరంతరం సంప్రదింపుల్లో ఉంటాం. అందరూ జాగ్రత్తగా ఉండండి.. అని పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement