త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhutan Rejects Indian Fuel | ఇండియా E20 పెట్రోల్ మాకొద్దు.. భారత్ ఆయిల్ కంపెనీల ఆఫర్‌ను తిరస్కరించిన భూటాన్!

భారత చమురు కంపెనీలు ఆఫర్ చేసిన E20 ఇథనాల్ పెట్రోల్‌ను పొరుగు దేశం భూటాన్ సున్నితంగా తిరస్కరించింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న సాంకేతిక కారణాలు ఇవే.

J

International | Published On Jul 4, 2026, 4.16 pm IST

Bhutan Rejects Indian Fuel | ఇండియా E20 పెట్రోల్ మాకొద్దు.. భారత్ ఆయిల్ కంపెనీల ఆఫర్‌ను తిరస్కరించిన భూటాన్!
Advertisement
  • ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) సరఫరా చేస్తామన్న E20 పెట్రోల్‌ను తీసుకునేందుకు నిరాకరించిన భూటాన్ 
  • భూటాన్‌లోని ఇంధన నిల్వ ట్యాంకులు పాతవి కావడం, ఎత్తైన కొండ ప్రాంతాల వాతావరణమే ఇందుకు ప్రధాన కారణం
  • E20 పెట్రోల్ వాతావరణంలోని తేమను సులభంగా గ్రహిస్తుందని, దీనివల్ల అండర్ గ్రౌండ్ ట్యాంకుల్లో నీరు చేరి ఇంధనం పాడవుతుందని భావిస్తున్న అక్కడి అధికారులు
  • భారత మార్కెట్లో ఉన్నంత కాలం సాధారణ పెట్రోల్‌నే తమకు సరఫరా చేయాలని కోరిన భూటాన్ 

Bhutan Rejects Indian Fuel | త్రినేత్ర.న్యూస్ : ఒకవైపు భారతదేశంలో E20 పెట్రోల్ (20% ఇథనాల్, 80% పెట్రోల్ మిశ్రమం) వాడకం వల్ల వాహనాల పనితీరు, మైలేజ్‌పై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో.. పొరుగు దేశం భూటాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) సరఫరా చేస్తామన్న E20 పెట్రోల్ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించింది. 'ది భూటానీస్' (The Bhutanese) రిపోర్ట్ ప్రకారం.. భారత మార్కెట్లో సాధారణ పెట్రోల్ అందుబాటులో ఉన్నంత కాలం అదే తమకు సరఫరా చేయాలని భూటాన్ కోరింది.

భూటాన్ ఎందుకు 'నో' చెప్పింది?

భూటాన్ తన ఇంధన అవసరాల కోసం పూర్తిగా భారతదేశంపైనే ఆధారపడుతుంది. ప్రస్తుతం, ఇండియా నుంచి ఎగుమతి నాణ్యత (higher-export quality) కలిగిన, కాస్త ఖరీదైన పెట్రోల్, డీజిల్‌ను కొనుగోలు చేస్తోంది. అయితే, IOCL, BPCL, HPCL వంటి కంపెనీలు E20 ఇస్తామని ఆఫర్ చేయగా భూటాన్ వాణిజ్య శాఖ 'నో' చెప్పింది.

దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి

పాత స్టోరేజ్ ట్యాంకులు: భూటాన్‌లోని భూగర్భ ఇంధన నిల్వ ట్యాంకులు పాతవి కావడం వల్ల వాటిలోకి నీరు చేరే ప్రమాదం ఎక్కువగా ఉందని ఒక భూటాన్ అధికారి తెలిపారు.

కెమిస్ట్రీ ఫ్యాక్టర్: E20 పెట్రోల్‌లోని ఇథనాల్ హైగ్రోస్కోపిక్ (hygroscopic) స్వభావాన్ని కలిగి ఉంటుంది.. అంటే వాతావరణంలోని తేమను, నీటిని సులభంగా గ్రహిస్తుంది. పాత ట్యాంకుల్లో నిల్వ చేసినప్పుడు.. ఇంధనంలోకి నీళ్లు చేరితే పెట్రోల్ నాణ్యత దెబ్బతింటుంది. ఆ నీళ్లు.. పెట్రోల్ నుంచి విడిపోవడం చాలా కష్టం.

తుప్పు పట్టే ప్రమాదం: ట్యాంకుల్లో నీళ్లు చేరడం వల్ల స్టీల్ ట్యాంకులు, పైపులు త్వరగా తుప్పు పడతాయని.. దీర్ఘకాలంలో ఇది ఇంజిన్ సమస్యలకు దారితీస్తుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Why Bhutan Declined India E20 Petrol Offer The Real Reason

పర్వత ప్రాంతాల సవాళ్లు

భూటాన్‌లోని చాలా ఫ్యూయల్ డిపోలు పర్వత ప్రాంతాల్లో, అధిక తేమ (humidity) ఉన్న ప్రదేశాల్లో ఉన్నాయి. ఇలాంటి వాతావరణంలో ట్యాంకుల్లోకి తేమ చేరకుండా ఆపడం దాదాపు అసాధ్యం. పైగా భూటాన్ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, అక్కడి ఎత్తైన కొండ ప్రాంతాల్లో వాహనాలకు గరిష్ట పవర్ అవసరం. ఇథనాల్ బ్లెండెడ్ E20 పెట్రోల్.. కొండ ప్రాంతాల్లో అవసరమైన కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోవచ్చన్నది వారి మరో ప్రధాన ఆందోళన.

దీనివల్ల భవిష్యత్తులో ఇండియా పూర్తిగా ఇథనాల్ పెట్రోల్‌కు మారాలని నిర్ణయించుకుంటే తమకు ముందుగానే సమాచారం ఇవ్వాలని భూటాన్ కోరింది. అలాగే లీకేజీలు లేని ట్యాంకులను (leak-proof tanks) అందించాలని భారతీయ OMCలను అభ్యర్థించింది.

ఇండియాలో E20 వివాదం

ఇండియాలో 2023 కంటే ముందు తయారైన వాహనాల్లో E20 వాడకం వల్ల ఇంధన సామర్థ్యం (మైలేజ్) తగ్గడం, మెయింటెనెన్స్ ఖర్చులు పెరగడం వంటి సమస్యలు వస్తున్నాయని ఓనర్లు ఫిర్యాదు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పెట్రోల్ వల్ల మైలేజ్ కాస్త తగ్గుతుందని అంగీకరించినప్పటికీ, ఇంజిన్ పర్ఫార్మెన్స్ మెరుగుపడుతుందని సమర్థిస్తోంది.

ఇటీవల సుప్రీంకోర్టు విచారణలో అటార్నీ జనరల్ ఈ E20 విధానాన్ని ఒక "ప్రయోగం" (experiment) గా పేర్కొనడం తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలను ప్రభుత్వం ఖండించినప్పటికీ, సదరు వీడియో వైరల్‌గా మారింది. మరోవైపు, భారత్ E25 పెట్రోల్‌ను కూడా పరీక్షిస్తోందని పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలను రాస్తున్నాయి.

ఒకవేళ భారత్ పొరపాటున E20 పెట్రోల్‌ను భూటాన్‌కు పంపినా సులభంగా గుర్తించవచ్చని.. ఇథనాల్‌లో కొద్దిగా నీళ్లు చేరినా పెట్రోల్ పాల రంగులోకి (milky) మారుతుందని అక్కడి అధికారి స్పష్టం చేశారు. ఇంధన మార్పులనేవి అన్ని భౌగోళిక ప్రాంతాలకు ఒకేలా సెట్ అవ్వవని.. కఠినమైన కొండ ప్రాంతాలకు స్వచ్ఛమైన పెట్రోలే సరైనదని ఈ భూటాన్ ఉదంతం స్పష్టం చేస్తోంది.

Advertisement
Advertisement