త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hanukkah Festival | బొండై బీచ్‌లో హనుక్కా వేడుకల్లోనే కాల్పులు.. అసలేంటీ పండుగ? ప్రాముఖ్యత ఏంటి?

హనుక్కా అంటే అర్థం డెడికేషన్. అంకితభావం అన్నమాట. ఇది హీబ్రూ భాష. 2000 ఏళ్ల క్రితం జెరూసలేంలో ఉన్న పవిత్ర దేవాలయాన్ని తిరిగి యూదులు స్వాధీనం చేసుకున్నందుకు గుర్తుగా ఈ పండుగను నిర్వహిస్తారు. ఆ సమయంలో గ్రీకు రాజు అయిన ఆంటియోకస్‌కి యూదులంటే పడదు.

J

International | Published On Dec 18, 2025, 10.48 am IST

Hanukkah Festival | బొండై బీచ్‌లో హనుక్కా వేడుకల్లోనే కాల్పులు.. అసలేంటీ పండుగ? ప్రాముఖ్యత ఏంటి?
Advertisement

Hanukkah Festival | ఆస్ట్రేలియాలోని సిడ్నీ(Sydney)లో ఉన్న ప్రముఖ బొండై బీచ్‌(Bondi Beach)లో యూదు(Jewish) సమాజానికి చెందిన ప్రజలు హనుక్కా వేడుకలను జరుపుకుంటుండగా ఇద్దరు సాయుధులైన దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఆ ఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం లేపింది. ఇది మరో పహల్‌గామ్ ఘటన అని, ఉగ్రదాడి అని ప్రపంచ నేతలు మండిపడ్డారు. కావాలనే హనుక్కా వేడుకలను జరుపుకుంటున్న వాళ్లను టార్గెట్ చేసి ఈ దాడి చేశారా? అనేది పోలీసులు దర్యాప్తులో తేలనుంది. కానీ, ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో అప్పటి నుంచి ప్రపంచమంతా అసలేంటి ఈ హనుక్కా పండుగ? దీనికి యూదులకు ఏంటి సంబంధం? దీన్ని ఎందుకు జరుపుకుంటారు.. అనే ఆసక్తి అందరిలో నెలకొన్నది. అందుకే దాని గురించి ఒకసారి లోతుగా మన భాషలో విశ్లేషిద్దాం రండి.

హనుక్కా అంటే ఏంటి?

హనుక్కాను కాంతి పండుగ అని పిలుస్తారు. దాన్నే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటారు. మనం దీపావళిని ఎలా ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటామో అలా అన్నమాట. దీన్ని చలికాలంలోనే నిర్వహిస్తారు. ఎనిమిది రోజుల పాటు ఉంటుంది. అందుకే దీన్ని ఎనిమిది రోజులు శీతాకాలపు పండుగ అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఈ పండుగ జరుగుతుంది. సాధారణంగా నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం అవడం రెండో వారం, మూడో వారంలో ముగియడం జరుగుతుంది. ఈ సంవత్సరం అంటే 2025 లో 14 డిసెంబర్ 2025 నుంచి 22 డిసెంబర్ 2025 వరకు నిర్వహిస్తారు.

మెనోరాను వెలిగించడం, ప్రత్యేక ప్రార్థనలు చేయడం

ఈ ఎనిమిది రోజుల్లో ప్రతి రోజు రాత్రి మెనోరాను వెలిగిస్తారు. మెనోరా అంటే కొవ్వొత్తులను పెట్టేందుకు ఉపయోగించే స్టాండ్. దానిలో ఉన్న కొవ్వొత్తులను వెలిగించి, ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆ తర్వాత ఫ్రై చేసిన ఆహారాన్ని కుటుంబం అంతా కలిసి కూర్చొని తింటారు. ఇలా ఎనిమిది రోజుల పాటు కొవ్వొత్తులను వెలిగిస్తూ ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. పండుగ రోజుల్లో డ్రెడెల్ అనే ఓ ఆటను ఆడుతూ సంతోషంగా గడుపుతారు.

చారిత్రక నేపథ్యం ఇదే

హనుక్కా అంటే అర్థం డెడికేషన్. అంకితభావం అన్నమాట. ఇది హీబ్రూ భాష. 2000 ఏళ్ల క్రితం జెరూసలేంలో ఉన్న పవిత్ర దేవాలయాన్ని తిరిగి యూదులు స్వాధీనం చేసుకున్నందుకు గుర్తుగా ఈ పండుగను నిర్వహిస్తారు. ఆ సమయంలో గ్రీకు రాజు అయిన ఆంటియోకస్‌కి యూదులంటే పడదు. యూదుల ఆచారాలను నిషేధించి, గ్రీకు దేవుళ్లనే పూజించాలని, గ్రీకు ఆచారాలనే పాటించాలని బలవంతపెట్టేవాడు. దీంతో యూదులంతా ఏకమై మకాబీలు అనే యూదు సమాజం కొన్నేళ్ల పాటు పోరాడి గ్రీకు రాజుపై విజయం సాధించి ఆ తర్వాత యూదు ఆచారాలనే పాటించేవారు.

గ్రీకు రాజుపై యుద్ధం ముగిసిన తర్వాత తమ పవిత్ర దేవాలయాన్ని స్వాధీనం చేసుకొని ధ్వంసమైన ఆలయాన్ని శుభ్రం చేసి అక్కడ దీపం వెలిగించేందుకు ప్రయత్నించారు. కానీ, అక్కడ ఒక్క రోజుకు సరిపడ నూనె మాత్రమే ఉండటంతో ఏం చేయాలో వాళ్లకు తెలియదు. దీపం మాత్రం వెలిగించారు కానీ.. ఆ దీపం ఒక్క రోజులో ఆగిపోలేదు. ఏకంగా ఎనిమిది రోజుల పాటు వెలుగుతూనే ఉంది. అలా నిరంతరాయంగా 8 రోజుల పాటు వెలుగుతూ ఉండటం వల్ల ఆ అద్భుతాన్ని ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ హనుక్కా పండుగను ఎనిమిది రోజుల పాటు యూదు సమాజం ఎంతో వైభవంగా జరుపుకుంటుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement