Harish Rao | మల్లన్న సాగర్‌ను కూల్చేందుకు రేవంత్ ప్రభుత్వం కుట్ర
Harish Rao | మేడిగడ్డ లెక్కనే మల్లన్నసాగర్ (Mallanna Sagar)ను కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.
- కట్టకు 150 మీటర్లలోనే అర్ధరాత్రి వేళ అక్రమ బ్లాస్టింగ్స్
- ఎస్ఐ, సీఐ, డీఎస్పీ, సీపీ, రెవెన్యూ అధికారులకు ఫోన్ చేస్తే ఎవరికీ పర్మిషన్ ఇచ్చినట్టు తెలియదంటున్నారు
- మరి అర్ధరాత్రి వేళ ఈ దొంగ బ్లాస్టింగ్స్ ఎవరి అండతో జరుగుతున్నాయి?
- తక్షణమే అక్రమ బ్లాస్టింగ్స్ ఆపి, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలి.. ఏజెన్సీపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి
- మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్
Harish Rao | త్రినేత్ర న్యూస్: మేడిగడ్డ లెక్కనే మల్లన్నసాగర్ (Mallanna Sagar)ను కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్‌లు ఎలా చేస్తారని ప్రశ్నించారు. 16 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టుకు ఏమన్నా అయితే ఎవరిది జిమ్మేదారి అని నిలదీశారు. మల్లన్న సాగర్ కట్ట పక్కనే జరుగుతున్న అక్రమ బ్లాస్టింగ్ పనులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. అక్కడే ఉన్న బ్లాస్టింగ్ చేసే సంబంధిత వ్యక్తులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
సిద్దిపేట జిల్లా తిప్పారం గ్రామం వద్ద మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్ట సమీపంలో పైప్‌లైన్లు, పంప్‌హౌస్ నిర్మాణం కోసం జలమండలి అనధికారికంగా భారీ బ్లాస్టింగ్స్ చేస్తుండటంతో రిజర్వాయర్ కట్ట దెబ్బతినే ప్రమాదం ఉందని, గ్రామంలో ఇండ్లు కూలిపోతున్నాయని తిప్పారం గ్రామస్తులు.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావుకి ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల సమాచారంతో ఈరోజు మల్లన్న సాగర్ వద్దకు చేరుకుని రిజర్వాయర్ కట్టను, అక్రమ బ్లాస్టింగ్స్ జరుగుతున్న ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు.
అనంతరం మల్లన్న సాగర్ కట్ట వద్ద మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచీ కుట్రలు చేస్తోందన్న విషయం ఇక్కడి పరిస్థితులను చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగిపోవడం వెనుక కూడా బ్లాస్టింగ్ జరిగిందా అనే అనుమానాలు ప్రజల్లో బలంగా ఉన్నాయి. ఆనాడు ఇంజినీర్లు కూడా బ్లాస్టింగ్ జరిగిందని ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే.
సర్పంచ్ భద్రప్ప ఫోన్ చేసి చెప్పిండు
నిన్న తిప్పారం గ్రామ సర్పంచ్ భద్రప్ప నాకు ఫోన్ చేసి.. అన్నా, మల్లన్న సాగర్ ప్రాజెక్టు దగ్గర మా గ్రామం పక్కనే కట్టకు కేవలం 100 నుంచి 200 మీటర్ల దూరంలోనే రాత్రిపూట చీకట్లో దొంగచాటుగా పెద్ద ఎత్తున బ్లాస్టింగ్స్ చేస్తున్నారు. దీనివల్ల మల్లన్న సాగర్ కట్ట అదురుతోంది. కిలోమీటర్ దూరంలో ఉన్న మా ఊర్లో ఇండ్లు నెర్రెలు బారి కూలిపోతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్ కోసం గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ ఇవ్వాలని తన మీద తీవ్ర ఒత్తిడి తెచ్చారని ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేసినా తాను పర్మిషన్ ఇవ్వలేదని సర్పంచ్ భద్రప్ప స్పష్టంగా చెప్తున్నారు.
హైదరాబాద్ మూసీ సుందరీకరణ కోసం మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోవడానికి ఇక్కడ సంపు, పంప్ హౌస్ కట్టాలని పనులు చేస్తున్నారు. మూసీ సుందరీకరణకు నీళ్లు తీసుకుపోండి, కానీ పనులు చేయడానికి ఒక పద్ధతి, నియమ నిబంధనలు ఉండాలి కదా.. ఇరిగేషన్ నిబంధనల ప్రకారం రిజర్వాయర్ కట్టను ఆనుకుని ఇలాంటి పనులు చేయకూడదు. మల్లన్న సాగర్ కట్ట ఎత్తు 40 మీటర్లు. నిబంధనల ప్రకారం కట్ట ఎత్తుకు 10 రెట్ల దూరం.. అంటే 400 మీటర్ల దూరం వరకు ఎలాంటి బ్లాస్టింగ్స్ గానీ నిర్మాణాలు గానీ చేయకూడదు. ఆ 400 మీటర్ల అవతల కూడా ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖల అనుమతితో కేవలం కంట్రోల్డ్ బ్లాస్టింగ్ మాత్రమే చేయాలి.
150 మీటర్ల లోపలనే..
కానీ ఇక్కడ కట్ట నుంచి కేవలం 150 మీటర్ల లోపలనే.. ఇరిగేషన్ శాఖ, పోలీస్ శాఖ, గ్రామ పంచాయతీ అనుమతులు ఏవీ లేకుండా డైరెక్ట్‌గా జిలెటిన్ స్టిక్స్ పెట్టి గత రెండు మూడు నెలలుగా అడ్డగోలుగా పెద్ద పెద్ద బండలను పేల్చివేస్తున్నారు. దాదాపు అర కిలోమీటర్ నుంచి కిలోమీటర్ పొడవునా, 16 నుంచి 20 మీటర్ల లోతున తవ్వి టన్నుల కొద్దీ బండరాళ్లను గుట్టలు గుట్టలుగా కుప్పలు పోశారు. ఈ భారీ పేలుళ్ల ధాటికి ఇక్కడి నుంచి ముప్పావు కిలోమీటర్, కిలోమీటర్ దూరంలో ఉన్న తిప్పారం గ్రామంలో అనేక ఇండ్లు నెర్రెలు బారాయి. రాత్రిపూట పడుకుంటే మట్టి పెళ్లలు విరిగి మీద పడుతున్నాయని, పేలుళ్ల తీవ్రతకు ఇంట్లో మంచాలు ఎగిరి పడుతున్నాయని, బోర్లు, గిన్నెలు కింద పడుతున్నాయని గ్రామస్తులు చెప్తున్నారు.
కిలోమీటర్ దూరంలో ఉన్న గ్రామంలోనే ఇండ్లు కూలిపోతుంటే.. కేవలం 150 మీటర్ల దూరంలో ఉన్న మల్లన్న సాగర్ కట్ట పరిస్థితి ఏమిటి? ఇక్కడ పనిచేసే గ్రామ రైతులు, కూలీలు, గొర్రెలు కాసే శంభులింగం, బాలయ్య, సాయిలు తదితరులు చెప్తున్న మాటలు వింటుంటే ఆందోళన కలుగుతోంది. గతంలో ఎప్పుడూ లేనిది ఈ బ్లాస్టింగ్స్ జరిగిన తర్వాత కట్ట పక్క నుంచి సీపేజీ పెరిగి నీళ్లు బయటకు లీక్ అవుతున్నాయని, పేలుళ్ల ధాటికి కట్ట పక్కన ఉండే రాళ్లు అర్ధ గజం మేర ఎగిరిపడి కూలిపోయాయని, కట్ట అదిరి కుంగినట్లు అనిపిస్తోందని ప్రత్యక్ష సాక్షులైన గ్రామస్తులు చెప్తున్నారు.
అసలు ఇంత పెద్ద ఎత్తున బ్లాస్టింగ్స్ జరగడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారని నేను ఇక్కడి నుంచే పోలీస్ అధికారులకు ఫోన్ చేసి అడిగాను. కుక్కునూరుపల్లి ఎస్ఐకి ఫోన్ చేస్తే పర్మిషన్ ఇచ్చినట్టు నాకు గుర్తులేదు సార్ అంటున్నారు. వాస్తవానికి నెల రోజుల క్రితమే సర్పంచ్ ఎస్ఐకి ఫోన్ చేసి ఊర్లో ఇండ్లు దెబ్బతింటున్నాయని చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుకోలేదు. తొగుట సీఐకి ఫోన్ చేస్తే నేను కొత్తగా వచ్చాను, నా నోటీసులో లేదు అన్నారు. డీఎస్పీకి ఫోన్ చేస్తే దరఖాస్తు పెట్టారు గానీ పర్మిషన్ వచ్చిందో లేదో నాకు తెలవదు, సీపీకి తెలుస్తుంది అన్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ కి ఫోన్ చేస్తే నాకు ఐడియా లేదు సార్, వెరిఫై చేస్తాను అన్నారు.
ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫోన్ చేసి ప్రశ్నిస్తే.. సార్, ఏ అనుమతి లేకుండా బ్లాస్టింగ్స్ చేయొద్దని, వెంటనే పనులు ఆపేయాలని మేము HMWS&SB అధికారులకు లేఖ రాశాం. కానీ వాళ్లు మా మాట పట్టించుకోకుండా బ్లాస్టింగ్స్ చేసుకుంటూ పోతున్నారు, మేమేం చేయాలి అని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులను అడిగితే మాకు అసలు ఐడియానే లేదంటున్నారు. ఇరిగేషన్ అనుమతి లేదు, పోలీస్ పర్మిషన్ లేదు, రెవెన్యూకు తెలియదు, గ్రామ పంచాయతీ తీర్మానం లేదు.. మరి ఎవరి అండతో అర్ధరాత్రి వేళ ఈ దొంగ బ్లాస్టింగ్స్ చేస్తున్నారు?
ఇవన్నీ చూస్తుంటే మల్లన్న సాగర్ ప్రాజెక్టును దెబ్బతీయడానికి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కుట్ర చేస్తోందన్న బలమైన అనుమానాలు కలుగుతున్నాయి. మల్లన్న సాగర్ అనేది యాదాద్రి, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పాటు 16,23,000 ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌తో సహా 10 జిల్లాలకు తాగునీరు అందించే వరప్రదాయని లాంటి ప్రాజెక్టు. కేవలం చిల్లర రాజకీయాల కోసం ఇంతటి మహత్తర ప్రాజెక్టుపై కుట్ర చేయడం దుర్మార్గం. మరోవైపు ఇక్కడ 60 ఎకరాల భూసేకరణలోనూ కలెక్టర్, గజ్వేల్ ఆర్డీవో రైతులను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసి తీవ్ర అన్యాయం చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పట్టా రైతులకైనా, అసైన్డ్ రైతులకైనా ఒకే విధమైన పరిహారం ఇవ్వాలి. పెరిగిన రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం మూడింతలు చెల్లించాలి.
ఉత్తమ్‌కు లేఖ రాస్తున్నం
కానీ ఇక్కడ పట్టా రైతులకు ఒక రేటు, ఎస్సీ అసైన్డ్ రైతులకు మరో రేటు ఇచ్చి వివక్ష చూపారు. ఇచ్చే 10 లక్షలు తీసుకోకపోతే అవి కూడా రావు, భూములు గుంజుకుంటాం అని కలెక్టర్, ఆర్డీవో బెదిరించి బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని రైతులు వాపోతున్నారు. కలెక్టర్, ఆర్డీవో తక్షణమే భూసేకరణ పరిహారంపై రివ్యూ చేయాలి. 2013 చట్టం ప్రకారం అసైన్డ్, పట్టా అనే తేడా లేకుండా ప్రతి రైతుకూ ఎకరాకు కనీసం రూ. 20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష పోరాటానికి దిగుతుంది.
మల్లన్న సాగర్ భద్రతపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇప్పుడే బహిరంగ లేఖ రాసి విడుదల చేస్తున్నాం.
దెబ్బతిన్న ఇండ్లకు పరిహారం ఇవ్వాలి
మంత్రి తక్షణమే స్పందించి ఈ అక్రమ బ్లాస్టింగ్స్‌పై రివ్యూ చేయాలి, నిపుణులైన ఇంజినీర్లతో కట్టను పరిశీలించి భద్రతా చర్యలు చేపట్టాలి. తక్షణమే ఈ బ్లాస్టింగ్ పనులను నిలిపివేయాలి. తిప్పారం సర్పంచ్, గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వెంటనే FIR నమోదు చేసి, అక్రమ బ్లాస్టింగ్స్ చేసిన కాంట్రాక్టర్, ఏజెన్సీపై నాన్-బెయిలబుల్ కేసులు పెట్టాలి. అనుమతులు లేకుండా పనులు చేయించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. బ్లాస్టింగ్స్ వల్ల తిప్పారం గ్రామంలో దెబ్బతిన్న ఇండ్లను మేం ఇప్పుడు వెళ్లి పరిశీలిస్తున్నాం. ఇండ్లు నష్టపోయిన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి కొత్త ఇండ్లు కట్టించి ఇవ్వాలి. మల్లన్న సాగర్ కట్టకు ఏ చిన్న నష్టం జరిగినా దానికి పూర్తి బాధ్యత జలమండలి HMWS&SB అధికారులదేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
హరీశ్ రావు వెంట దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, బక్కి వెంకటయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, తిప్పారం గ్రామస్తులు ఉన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KTR | ఈ కరువు పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ ఎవరి కోసం, దేని కోసం?
అక్టోబర్ 29, 2026

Maheshkumar Goud | ఎన్ని గెలిచామన్నది కాదు.. ఎక్కడ గెలిచామన్నదే పాయింట్
అక్టోబర్ 29, 2026

Graduate MLC Elections | పట్టభద్రుల MLC పోరు: కాంగ్రెస్ మార్క్ వ్యూహం.. ఏకంగా 233 మంది ఇన్ఛార్జుల రంగప్రవేశం!
అక్టోబర్ 29, 2026
తాజావార్తలు
- ●Trisha | త్రిష తెలుగు వెబ్‌సిరీస్ - సినిమాల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్...
- ●KTR | ఈ కరువు పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ ఎవరి కోసం, దేని కోసం?
- ●Super El Nino | సూపర్ ఎల్‌నినో ముప్పు.. మార్చి నాటికి భారత్‌లో 55,000 మరణాలు
- ●Hyundai Bayon | హ్యుందాయ్ బయాన్ ఎస్యూవీ వచ్చేసింది.. ధరలు ఎంతంటే?
- ●CEC Gyanesh Kumar | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై అవినీతి దర్యాప్తు: కేరళం ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రూ.700 కోట్ల రోడ్డు ప్రాజెక్టులో ఏం జరిగింది?
- ●Jason Sanjay | హీరోగా దళపతి విజయ్ కొడుకు - రంగంలోకి అల్లు అర్జున్ డైరెక్టర్

Trisha | త్రిష తెలుగు వెబ్‌సిరీస్ - సినిమాల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్...

KTR | ఈ కరువు పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ ఎవరి కోసం, దేని కోసం?

Super El Nino | సూపర్ ఎల్‌నినో ముప్పు.. మార్చి నాటికి భారత్‌లో 55,000 మరణాలు

Hyundai Bayon | హ్యుందాయ్ బయాన్ ఎస్యూవీ వచ్చేసింది.. ధరలు ఎంతంటే?







