త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US Storm | అమెరికాలో తుఫాను బీభ‌త్సం.. ముంచెత్తిన వ‌ర‌ద‌, నిలిచిన విద్యుత్ సరఫరా

US Storm | థ్యాంక్స్ గివింగ్ (Thanksgiving) పండుగ వేళ అమెరికా తూర్పు తీరాన్ని 'నార్‌ఈస్టర్' (Nor'easter) తుఫాన్ ముంచెత్తింది. కుండపోత వర్షాలు, బలమైన ఈదురుగాలులు (US Storm) బీభత్సం సృష్టించాయి.

G

International | Published On Nov 27, 2026, 7.45 am IST

US Storm | అమెరికాలో తుఫాను బీభ‌త్సం.. ముంచెత్తిన వ‌ర‌ద‌, నిలిచిన విద్యుత్ సరఫరా
Advertisement

US Storm | త్రినేత్ర న్యూస్‌: థ్యాంక్స్ గివింగ్ (Thanksgiving) పండుగ వేళ అమెరికా తూర్పు తీరాన్ని 'నార్‌ఈస్టర్' (Nor'easter) తుఫాన్ ముంచెత్తింది. కుండపోత వర్షాలు, బలమైన ఈదురుగాలులు (US Storm) బీభత్సం సృష్టించాయి. కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి ఎంతో ఉత్సాహంగా జరుపుకునే థ్యాంక్స్ గివింగ్ పండుగ సంబురాలను ఆకస్మిక వరదలు నీరుగార్చాయి. ప్రతికూల వాతావరణం వ‌ల్ల‌ న్యూయార్క్‌లో ప్రసిద్ధి చెందిన 'మేసీస్ పరేడ్' (Macy's Parade) వాయిదా ప‌డింది. గ‌త వందేండ్ల‌లో న్యూయార్క్‌ ప‌రేడ్ వాయిదా ప‌డ‌టం ఇదే మొద‌టిసారి కావ‌డం గ‌మ‌నార్హం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మూడేండ్ల‌ పాటు ఈ ప‌రేడ్ ర‌ద్దుచేశారు. కాగా, ప‌రేడ్‌ను శ‌నివారం నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

తుఫాన్ ప్రభావంతో న్యూజెర్సీ, న్యూయార్క్, మేరీల్యాండ్, వర్జీనియా, డెలావేర్, వాషింగ్టన్‌తోపాటు తూర్పు ఫ్లోరిడా తీర ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. బలమైన గాలులకు చెట్లు కూలి విద్యుత్ తీగలు, ఇళ్లపై పడ్డాయి. న్యూజెర్సీలో (New Jersey ) ప్రధాన పట్టణాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో వీధులు, నివాసాలు, వ్యాపార సముదాయాల్లోకి భారీగా వరద నీరు చేరింది. తుఫానుకు ఈదురుగాలులు తోడ‌వ‌డంతో 9 లక్షలకు పైగా ఇండ్లు, ప‌రిశ్ర‌మ‌లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా పెన్సిల్వేనియా, మేరీల్యాండ్, వర్జీనియా రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని 'పవర్ ఔటేజ్' (PowerOutage) వెబ్‌సైట్ తెలిపింది.

రోడ్డు ప్రయాణాలను తగ్గించుకోవాలని అధికారులు సూచించారు. బలమైన గాలుల కారణంగా పలు ప్రధాన వంతెనలను మూసివేశారు. సుమారు 400 విమానాలు రద్దు కాగా, 2 వేల‌కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. వీటిలో ఎక్కువ భాగం తూర్పు ప్రాంతంలోనే ఉన్నాయని 'ఫ్లైట్ అవేర్' (FlightAware) గణాంకాలు వెల్లడించాయి.

Advertisement
Advertisement