త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mojtaba Khamenei Statement | ఎట్టకేలకు నోరు విప్పిన మొజ్తబా ఖమేనీ.. అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తొలిసారిగా హెచ్చరించారు. దుబాయ్, బహ్రెయిన్‌లపై ఇరాన్ దాడులు చేయగా, ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైతం భీకరంగా విరుచుకుపడుతోంది. మరోవైపు, ఇరాన్‌లో చిక్కుకున్న 9 వేల మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.

J

International | Published On Mar 12, 2026, 8.00 pm IST

Mojtaba Khamenei Statement | ఎట్టకేలకు నోరు విప్పిన మొజ్తబా ఖమేనీ.. అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్
Advertisement

ఆడియో సందేశం ద్వారా బహిరంగ ప్రకటన

హార్ముజ్ జలసంధి మూతపడి ఉండాల్సిందేనన్న ఖమేనీ

మిడిల్ ఈస్ట్‌ని నాశనం కానివ్వనన్న ట్రంప్

Mojtaba Khamenei Statement | త్రినేత్ర.న్యూస్ : అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొజ్తబా ఖమేనీ తొలిసారిగా ఓ ఆడియో సందేశం ద్వారా బహిరంగ ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి.

అమెరికా బేస్‌లు మూసేయాలి.. లేదంటే దాడులే!

గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిలిటరీ బేస్‌లను తక్షణమే మూసివేయాలని, లేదంటే వాటిపై దాడులు తప్పవని మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు. పొరుగు దేశాలతో స్నేహాన్ని తాము కోరుకుంటున్నామని చెబుతూనే.. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని మాత్రం మూసివేసే ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. శత్రువుల వల్ల జరిగిన నష్టానికి పరిహారం వసూలు చేస్తామని లేదా వారి ఆస్తులను ధ్వంసం చేస్తామని ఆయన ప్రతినబూనారు.

దుబాయ్, బహ్రెయిన్‌లపై ఇరాన్ దాడులు.. ఇజ్రాయెల్ ప్రతీకారం

యుద్ధం ఇజ్రాయెల్, ఇరాన్‌లకే పరిమితం కాలేదు. గల్ఫ్ అంతటా దాడుల మోత మోగుతోంది. టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ నిఘా సంస్థ 'షిన్ బెట్' ప్రధాన కార్యాలయంతో పాటు పామాచిమ్, ఒవ్డా ఎయిర్‌బేస్‌లపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసినట్లు ప్రకటించింది. దుబాయ్‌లోని అల్-బదా పరిసరాల్లో రెండు ఇరాన్ డ్రోన్లు దాడి చేశాయి. బహ్రెయిన్‌లోని ముహర్రక్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోనూ ఇరాన్ దాడుల వల్ల భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇరాన్ దాడులకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అంతే దీటుగా బదులిస్తోంది. ఇరాన్‌లోని వ్యూహాత్మక, అణు కేంద్రాలే లక్ష్యంగా భారీ వైమానిక దాడులకు దిగింది. దక్షిణ లెబనాన్‌లో దాడులను తీవ్రతరం చేస్తూ.. లెబనాన్ భూభాగంలోని 10 శాతం మంది ప్రజలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. హిజ్బుల్లా కీలక కమాండర్ అబు అలీ రియాన్‌ను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది.

ఇరాన్‌లో ఆమ్ల వర్షాలు

చమురు నిల్వ కేంద్రాలపై దాడుల కారణంగా టెహ్రాన్‌లో ఆకాశమంతా దట్టమైన పొగ కమ్ముకుని ఆమ్ల వర్షాలు కురుస్తున్నాయి. యుద్ధం కారణంగా ఇరాన్‌లో 3.2 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారని యూఎన్ శరణార్థుల సంస్థ వెల్లడించింది. ఇరాన్ అనుబంధ సంస్థల దాడుల్లో ఇప్పటివరకు 19 కమర్షియల్ నౌకలు దెబ్బతిన్నాయి.

అణ్వాయుధాలు రానివ్వను: డొనాల్డ్ ట్రంప్

ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. "దుష్ట సామ్రాజ్యమైన ఇరాన్ అణ్వాయుధాలు సాధించకుండా అడ్డుకోవడమే నా ముందున్న అతిపెద్ద లక్ష్యం. మిడిల్ ఈస్ట్‌ను, ప్రపంచాన్ని నాశనం కానివ్వను" అని ట్రంప్ 'ట్రూత్ సోషల్' వేదికగా పోస్ట్ చేశారు.

9 వేల మంది భారతీయుల తరలింపు: కేంద్ర ప్రభుత్వం

ఇరాన్‌లో ఉన్న దాదాపు 9000 మంది భారతీయులను (విద్యార్థులు, వ్యాపారులు, పర్యాటకులు తదితరులు) సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. "అజర్‌బైజాన్, అర్మేనియా మీదుగా వీసాలు, బోర్డర్ క్రాసింగ్స్ ఏర్పాటు చేసి కమర్షియల్ ఫ్లైట్స్ ద్వారా భారతీయులను తీసుకొస్తున్నాం" అని తెలిపారు. టెహ్రాన్‌లోని భారత ఎంబసీ విద్యార్థులతో నిరంతరం టచ్‌లో ఉందన్నారు.

విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇప్పటికే మూడుసార్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో ఫోన్‌లో మాట్లాడారని, సముద్ర మార్గాల్లో భద్రత, భారత్ ఇంధన అవసరాలపై చర్చించారని వెల్లడించారు.

భారత కెప్టెన్ ఆధ్వర్యంలో నడుస్తున్న లైబీరియా జెండా ఉన్న ట్యాంకర్ 'షెన్‌లాంగ్' సౌదీ అరేబియా నుంచి సురక్షితంగా భారత జలాల్లోకి ప్రవేశించింది.

చమురు కొరత లేదు: ఇండియన్ ఆయిల్ భరోసా

గల్ఫ్ టెన్షన్ల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందన్న ఆందోళనల మధ్య ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పష్టత ఇచ్చింది. దేశవ్యాప్తంగా తమ ఫ్యూయల్ స్టేషన్లు అన్నీ పూర్తిగా పనిచేస్తున్నాయని, ఇంధన సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదని, వదంతులను నమ్మవద్దని సూచించింది.

Advertisement
Advertisement