త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Green India Challenge | నాడు లక్ష్మణుడిని కాపాడిన సంజీవని కూడా ఒక మొక్కే

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మాజీ ఎంపీ జోగినప‌ల్లి సంతోష్‌కుమార్ అప్ర‌తిహ‌తంగా కొన‌సాగిస్తున్నార‌ని శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామి చెప్పారు. ఈ హ‌రిత ఉద్య‌మం దేశ‌మంత‌లా విస్త‌రించాల‌ని ఆకాంక్షించారు. స‌మ‌స్త జీవ కోటికి వృక్షాలే ప్రాణాధార‌మ‌ని విధుశేఖర భారతి మహాస్వామి అన్నారు.

N

Telangana | Published On Jul 7, 2026, 3.23 pm IST

Green India Challenge |  నాడు లక్ష్మణుడిని కాపాడిన సంజీవని కూడా ఒక మొక్కే
Advertisement
  • హరిత ఉద్యమం విశ్వ‌వ్యాప్తం కావాలి
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న‌ జగద్గురు శ్రీ విదుశేఖర భారతి

Green India Challenge |  తరువులే ఇలలో ప్రధానమని జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామి చెప్పారు. గాలిని శుద్ధి చేసి, రోగాలను నశింపజేసి, మానవులను ఎండ, చలి, తుఫానుల నుండి కాపాడుతున్న వృక్షాలను..ధర్మంగా భావించి ప్రతి ఒక్కరూ నాటి పెంచి పోషించాల్సిన అవసరం ఉన్నదని బోధించారు. పవిత్ర ధర్మ విజయ యాత్రలో భాగంగా శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామి ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు గ్రామంలో వేదపాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ను శ్రీ విదుశేఖర భారతి ఆశీర్వదిస్తూ.. హరిత ధరిత్రి కోసం పాటుపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం పరిఢవిల్లాలని ఆకాంక్షించారు.

నాడు లక్ష్మణుడిని కాపాడింది కూడా  మొక్కే

ప్రకృతి తనను తాను ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకోగలదని కానీ ప్రకృతే స్వయంగా తనను తాను నయం చేసుకోవడం ప్రారంభిస్తే.. ఆ పర్యవసానాల వల్ల వచ్చే బాధను మానవాళి తట్టుకోలేదని శ్రీ విదుశేఖర్ భారతి హెచ్చరించారు. ఈ సందర్భంగా సనాతన ధర్మంలో.. వృక్షాలకు గల పవిత్ర స్థానాన్ని వివరిస్తూ జగద్గురువు పలు సంస్కృత శ్లోకాలను ఉటంకించారు. "వృక్షాలు గాలిని శుద్ధి చేసి, రోగాలను నశింపజేస్తాయి. కాబట్టి, మొక్కలను నాటి, రక్షించడం సమస్త జీవులకు శ్రేయస్కరం. వృక్షాలు కేవలం ఇతరుల కోసమే జీవిస్తాయి. తుఫానులు, వర్షాలు, ఎండ, చలిని భరిస్తూ అవి మనదాకా రాకుండా మనల్ని రక్షిస్తున్నాయి.
"లక్ష్మణుడి ప్రాణాలను రక్షించడానికి హనుమంతుడు తీసుకువచ్చిన సంజీవని కూడా ఒక తరువే (మొక్క/వృక్షం) అన్న విషయం మరిచిపోకూడదు. అలాగే, సీతా మాతకు ఆశ్రయమిచ్చి, ఆమె దుఃఖాన్ని ఉపశమింపజేసినది కూడా ఆశోక వనమే. వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు అన్నీ తరువులకే ప్రాధాన్యతనిచ్చాయి. వృక్షాలను గౌరవించడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, ధార్మిక నాగరికతకే మూలస్తంభం" అని ఈ సందర్భంగా విదుశేఖర భారతి ధర్మశాస్త్రాలను ఉటంకించారు.

గ్రీన్ ఇండియా ..పరిఢవిల్లాలి

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా అడవుల పెంపకం, పునరుజ్జీవన ఉద్యమాలలో ఒకటైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను అప్రతిహతంగా కొనసాగిస్తున్నందుకు జోగినపల్లి సంతోష్ కుమార్‌ను విదుశేఖర భారతి అభినందించారు. ఈ కార్యక్రమం విశ్వవ్యాప్తం కావాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ సంస్కృత నిఘంటువు అమరకోశం నుండి ధార్మిక అంశాలను ప్రస్తావిస్తూ.. వైదిక విశ్వవీక్షణంలో వృక్షాల ప్రాధాన్యతను జగద్గురువులు స్పష్టం చేశారు. సంతోష్ అనే పేరులోనే ఆనందం ఉందని, ఆ ఆనందం ఈ హరిత ఉద్యమం ద్వారా దేశమంతటా విస్తరించాలని ఆశీర్వదించారు. కాగా, ఈ సందర్భంగా శ్రీ విదుశేఖర భారతి.. పరమ శివునికి ప్రీతిపాత్రమైన బిల్వ (మారేడు), అమ్మవారికి ఇష్టమైన కదంబం, అన్ని పురాణాల్లో ఫలాలనిచ్చే వృక్షంగా మన్ననలు అందుకునే పిప్పల (రావి) మొక్కలను నాటారు. సమస్త జీవి కోటికి ఈ వృక్షాలే ప్రాణాధారమని పేర్కొన్నారు.

Advertisement
Advertisement