త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US-Iran Peace Talks | అమెరికా-ఇరాన్ శాంతి చ‌ర్చ‌లు విఫ‌లం.. ఇరాన్‌కు ఇది చేదు వార్త అన్న జేడీ వాన్స్‌..

US-Iran Peace Talks | ప‌శ్చిమ ఆసియాలో కొన‌సాగుతున్న యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేసేందుకు, శాంతిని నెల‌కొల్పేందుకు పాకిస్థాన్ రాజ‌ధాని ఇస్లామాబాద్ వేదిక‌గా అమెరికా, ఇరాన్‌ల మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయి. పాకిస్థాన్ మ‌ధ్య వ‌ర్తిత్వంలో శ‌నివారం మ‌ధ్యాహ్నం నుంచి సుమారు 21 గంట‌ల పాటు చ‌ర్చ‌లు నిర్వ‌హించారు.

S

International | Published On Apr 12, 2026, 10.20 am IST

US-Iran Peace Talks | అమెరికా-ఇరాన్ శాంతి చ‌ర్చ‌లు విఫ‌లం.. ఇరాన్‌కు ఇది చేదు వార్త అన్న జేడీ వాన్స్‌..
Advertisement

US-Iran Peace Talks | ప‌శ్చిమ ఆసియాలో కొన‌సాగుతున్న యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేసేందుకు, శాంతిని నెల‌కొల్పేందుకు పాకిస్థాన్ రాజ‌ధాని ఇస్లామాబాద్ వేదిక‌గా అమెరికా, ఇరాన్‌ల మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయి. పాకిస్థాన్ మ‌ధ్య వ‌ర్తిత్వంలో శ‌నివారం మ‌ధ్యాహ్నం నుంచి సుమారు 21 గంట‌ల పాటు చ‌ర్చ‌లు నిర్వ‌హించారు. అయిన‌ప్ప‌టికీ ఎలాంటి తుది నిర్ణ‌యం వెలువ‌కుండానే చ‌ర్చ‌లు ముగిశాయి. వాషింగ్ట‌న్ ప్ర‌తినిధుల బృందానికి నాయ‌క‌త్వం వ‌హించిన అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ చ‌ర్చ‌లు ముగిసిన అనంత‌రం మాట్లాడుతూ ఇది ఇరాన్‌కు చేదు వార్త అని పేర్కొన్నారు. త‌మ బృందం ఇరాన్ ఎదుట బెస్ట్ డీల్‌ను ప్ర‌తిపాదించింద‌ని, అయిన‌ప్ప‌టికీ ఇరాన్ అంగీక‌రించ‌లేద‌ని, చ‌ర్చ‌లు విఫ‌లం అయినందున పాకిస్థాన్ నుంచి నిష్క్ర‌మిస్తున్నామ‌ని తెలిపారు.

అణ్వాయుధాల త‌యారీపైనే ప్ర‌ధాన వివాదం..

అమెరికా-ఇరాన్ ప్ర‌తినిధులు సుమారుగా 21 గంట‌ల‌పాటు కీల‌క చ‌ర్చ‌లు నిర్వ‌హించ‌గా ఆ వివ‌రాల‌ను వెల్ల‌డించేందుకు జేడీ వాన్స్ నిరాక‌రించారు. అయితే ప్ర‌ధానంగా వివాదం ఇరాన్ ఆణ్వాయుధాల త‌యారీపై ఏర్ప‌డింద‌ని పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాల‌ను త‌యారు చేయ‌బోమ‌ని స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వాల‌ని, అణ్వాయుధాల‌ను త‌యారు చేసేందుకు అవ‌స‌రం అయిన సాధ‌నాల‌ను కూడా అభివృద్ధి చేయ‌కూడ‌ద‌ని, ఇది అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని, అదే ల‌క్ష్యాన్ని చ‌ర్చ‌ల ద్వారా సాధించ‌డానికి ప్ర‌య‌త్నించామ‌ని, కానీ ఇరాన్ అందుకు ఒప్పుకోలేద‌ని తెలిపారు. వారి అణు కార్య‌క్ర‌మాలు, ముఖ్యంగా యురేనియం శుద్ధి కేంద్రాలు ఇప్ప‌టికే ధ్వంస‌మ‌య్యాయ‌ని వాన్స్ తెలిపారు. ఇరాన్ దీర్ఘ‌కాలంలోనూ అణ్వాయుధాల‌ను అభివృద్ధి చేయ‌కూడ‌ద‌ని అన్నారు. అయితే కొన్ని సంవ‌త్స‌రాల త‌రువాత ఇరాన్ నిబంధ‌న‌ల‌కు క‌ట్టుబ‌డి ఉంటుందా, అణ్వాయుధాల‌ను త‌యారు చేస్తుందా అన్న అంశాల‌పై స్ప‌ష్ట‌త లేద‌ని, వారు నిబంధ‌న‌ల‌ను పాటించ‌డంలో నిబ‌ద్ధ‌త‌ను క‌లిగి ఉంటార‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు.

ప్ర‌జ‌ల జాతీయ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుతాం: ఇరాన్‌

ఇరాన్ మాత్రం తాము అణ్వాయుధాల త‌యారీ దిశ‌గా ముందుకు వెళ్ల‌డం లేద‌ని స్ప‌ష్టం చేసింది. మ‌ధ్య‌ప్రాచ్యంలో కొన‌సాగుతున్న యుద్ధాన్ని పూర్తిగా ఆపేందుకు చ‌ర్చిస్తున్నామ‌ని, కానీ అమెరికా అన్యాయ‌మైన డిమాండ్ల‌ను త‌మ ముందుంచింద‌ని ఆరోపించింది. ఇరాన్ ప్ర‌జ‌ల జాతీయ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకు త‌మ ప్ర‌తినిధుల బృంధం 21 గంట‌ల‌పాటు నిరంత‌రాయంగా, తీవ్రంగా చ‌ర్చ‌లు జ‌రిపింద‌ని, తాము అనేక ప్ర‌తిపాద‌నలు చేసిన‌ప్ప‌టికీ అమెరికా వైపు నుంచి వ‌చ్చిన అన్యాయ‌మైన డిమాండ్ల వ‌ల్ల చ‌ర్చ‌ల పురోగ‌తి దెబ్బ‌తిన్న‌ద‌ని పేర్కొంది. దీంతో తుది నిర్ణ‌యం రాకుండానే చ‌ర్చ‌లు ముగిశాయ‌ని తెలిపింది. ఈ మేర‌కు ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ IRIB టెలిగ్రామ్‌లో వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

మంచి ఒప్పందం సాధించేందుకు ప్ర‌య‌త్నించాం: జేడీ వాన్స్

సుదీర్ఘంగా సాగిన చర్చ‌ల్లో ఇరాన్‌కు సంబంధించిన ఫ్రీజ్ చేసిన ఆస్తుల‌పై చ‌ర్చించారా అని మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌కు వాన్స్ స్పందిస్తూ ఆ అంశం స‌హా అనేక విష‌యాల‌ను చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. కానీ త‌మ ష‌ర‌తుల‌ను ఇరాన్ అంగీక‌రించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇరాన్ వార్తా సంస్థ ప్రెస్ టీవీ నివేదిక ప్ర‌కారం హోర్ముజ్ జ‌ల‌సంధి స‌హా అనేక అంశాల‌పై ఈ చ‌ర్చ‌ల్లో ఇరు దేశాల మ‌ధ్య విభేదాలు ఏర్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. అమెరికా ప్ర‌తినిధుల బృందం చాలా సౌక‌ర్య‌వంతంగా, అనుకూలంగా చ‌ర్చ‌లు జ‌రిపింద‌ని వాన్స్ తెలిపారు. ట్రంప్ సూచ‌న‌ల మేర‌కు మంచి న‌మ్మ‌కంతో ఒప్పందం సాధించేందుకు ప్రయ‌త్నించామ‌ని అన్నారు.

ప్లాన్ బి అవ‌స‌రం లేదు: ట్రంప్‌

ఇరాన్‌తో శాంతి చ‌ర్చలు విఫ‌ల‌మైతే లేదా హోర్ముజ్ జ‌ల‌సంధిని తిరిగి తెర‌వ‌డానికి ఇరాన్ నిరాకరిస్తే ప్ర‌త్యామ్నాయ ప్ర‌ణాళిక ఏమిట‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మీడియా ప్ర‌తినిధులు చ‌ర్చ‌ల‌కు ముందు ప్ర‌శ్నించ‌గా, ఆయ‌న అందుకు బ‌దులిస్తూ త‌మ‌కు ప్లాన్ బి అవ‌స‌రం లేద‌ని చెప్పారు. ఇరాన్ సైన్యం ఇప్ప‌టికే ఓట‌మి పాలైంద‌ని, తాము అన్నింటినీ స‌మగ్రంగా నియంత్రించామ‌ని, వారి వ‌ద్ద ప్ర‌స్తుతం చాలా త‌క్కువ క్షిప‌ణులు ఉన్నాయ‌ని తెలిపారు. ఇరాన్ ఆయుధ సామ‌గ్రి త‌యారీ సామ‌ర్థ్యం కూడా పూర్తిగా త‌గ్గింద‌ని, వారిని చాలా గట్టి దెబ్బ కొట్టామ‌ని అన్నారు. అమెరికా సైన్యం అద్భుతంగా ప‌నిచేసింద‌ని ట్రంప్‌ కితాబిచ్చారు.

Advertisement
Advertisement