త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US Tariffs | భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ పిడుగు.. మరోసారి వాణిజ్య యుద్ధానికి తెర!

US Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. భారత్ సహా ఏడు దేశాలపై 25 శాతం వరకు అదనపు సుంకాలు విధించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చైనాపై 20 శాతం అదనపు టారిఫ్ విధించాలని నిర్ణయించినట్లుగా అంత‌ర్జాతీయ మీడియా పేర్కొంది.

P

Business | Published On Nov 25, 2026, 8.25 pm IST

US Tariffs | భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ పిడుగు.. మరోసారి వాణిజ్య యుద్ధానికి తెర!
Advertisement
  • 14 దేశాల పారిశ్రామిక ఉత్పత్తిపై ట్రంప్ సర్కారు దర్యాప్తు..
  • మరో ఆరు దేశాలపైనా 25 శాతం వరకు టారిఫ్‌లు

US Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. భారత్ సహా ఏడు దేశాలపై 25 శాతం వరకు అదనపు సుంకాలు విధించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చైనాపై 20 శాతం అదనపు టారిఫ్ విధించాలని నిర్ణయించినట్లుగా అంత‌ర్జాతీయ మీడియా పేర్కొంది. పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యం, మార్కెట్ డిమాండ్‌కు మించి తయారీ జరుగుతోందన్న ఆరోపణలతో అమెరికా ఈ చర్యలకు ఉపక్రమించింది. దీనిపై 14 ప్రధాన ఆర్థిక వ్యవస్థలపై దర్యాప్తు చేపట్టింది. భారత్‌తో పాటు దక్షిణ కొరియా, తైవాన్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, కంబోడియాలపై 25 శాతం వరకు సుంకాలు విధించాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆయా దేశాలు మార్కెట్ అవసరాలకు మించి పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయని వాషింగ్టన్ ఆరోపిస్తోంది. అమెరికా వస్తువుల కొనుగోళ్లను పెంచడం, తమ తయారీ యూనిట్లను అమెరికాకు తరలించేలా వాణిజ్య భాగస్వాములపై ఒత్తిడి పెంచడమే ఈ చర్యల వెనుక వ్యూహంగా కనిపిస్తోంది.

14 దేశాలపై సమగ్ర దర్యాప్తు..

పారిశ్రామిక తయారీ, ఉత్పత్తి సామర్థ్యంపై అమెరికా చేపట్టిన దర్యాప్తులో భారత్, చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్, బంగ్లాదేశ్, కంబోడియా, ఇండోనేషియా, దక్షిణ కొరియా, మలేషియా, సింగపూర్, స్విట్జర్లాండ్, తైవాన్, థాయ్‌లాండ్, వియత్నాం ఉన్నాయి. వీటిలో చైనాపై 20 శాతం అదనపు సుంకాలు ప్రతిపాదించినట్లు ఏఎఫ్‌పీ వెల్లడించింది. ఇతర దేశాలపైనా 20 శాతం వరకు టారిఫ్‌లు విధించే అవకాశం ఉంది. ఈ పరిణామం అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. మరోవైపు బ్రెజిల్‌పైనా అమెరికా ప్రత్యేకంగా చర్యలకు సిద్ధమైంది. విమానాలతో సహా ఆ దేశానికి చెందిన కొన్ని ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధించాలని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (యూఎస్‌టీఆర్) ప్రతిపాదించింది. అమెరికా వాణిజ్యపరమైన ఆందోళనలను బ్రెజిల్ పరిష్కరించలేదని ఈ సందర్భంగా వాషింగ్టన్ పేర్కొంది.

వెంటనే అమల్లోకి రావ్‌..

ప్రతిపాదించిన సుంకాలు తక్షణమే అమల్లోకి రావని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయా దేశాలతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. డిసెంబర్‌లో ఫ్లోరిడాలోని మయామిలో జరగనున్న జీ20 సదస్సుకు ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సదస్సుకు ట్రంప్ ప్రపంచ దేశాల నేతలకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. అయితే సుంకాల ప్రతిపాదనలతో దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఏర్పడతాయన్న ఆందోళనలను అమెరికా ఉన్నతాధికారి తోసిపుచ్చారు. సదస్సు సందర్భంగా వాణిజ్య భాగస్వామ్య దేశాలతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement