త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US-Israel Strikes | 24 గంట‌ల్లో ఇరాన్‌పై భీక‌ర దాడులు.. మ‌ధ్య ప్రాచ్యానికి మ‌రిన్ని బ‌ల‌గాలు పంపుతున్న‌ అమెరికా..!

US-Israel Strikes | ఇరాన్‌ (Iran), అమెరికా-ఇజ్రాయెల్ దాడుల‌తో (US-Israel Strikes) ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌లు రోజురోజుకూ తీవ్ర‌త‌ర‌మ‌వుతున్నాయి. దాడులు, ప్ర‌తిదాడుల‌తో ప‌శ్చిమాసియా దేశాలు అట్టుడుకుతున్నాయి.

D

International | Published On Mar 3, 2026, 3.56 pm IST

US-Israel Strikes | 24 గంట‌ల్లో ఇరాన్‌పై భీక‌ర దాడులు.. మ‌ధ్య ప్రాచ్యానికి మ‌రిన్ని బ‌ల‌గాలు పంపుతున్న‌ అమెరికా..!
Advertisement

US-Israel Strikes | ఇరాన్‌ (Iran), అమెరికా-ఇజ్రాయెల్ దాడుల‌తో (US-Israel Strikes) ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌లు రోజురోజుకూ తీవ్ర‌త‌ర‌మ‌వుతున్నాయి. దాడులు, ప్ర‌తిదాడుల‌తో ప‌శ్చిమాసియా దేశాలు అట్టుడుకుతున్నాయి. వ‌రుస‌గా నాలుగో రోజు కూడా దాడులు కొన‌సాగుతున్నాయి. ఇరాన్ సైనిక స్థావ‌రాలే ల‌క్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ ద‌ళాలు మిస్సైళ్ల‌తో విరుచుకుప‌డుతుండ‌గా.. ఇరాన్ సైతం గ‌ల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావ‌రాల‌పై దాడి చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇరాన్‌పై భీక‌ర దాడుల‌కు అగ్ర‌రాజ్యం రెఢీ అవుతోంది.

ముందుంది అస‌లైన దాడి..

రాబోయే 24 గంట‌ల్లో ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు చేసే అవ‌కాశం ఉంద‌ని అమెరికాకు చెందిన ఉన్న‌త స్థాయి అధికారులు తెలిపారు. ఇరాన్ క్షిప‌ణి ఉత్ప‌త్తి కేంద్రాలు, డ్రోన్లు, నౌకాద‌ళ సామ‌ర్థ్యాన్ని నాశ‌నం చేయ‌డంపైనే ప్ర‌ధానంగా దృష్టి సారించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ (Donald Trump) కూడా ఇలాంటి వ్యాఖ్య‌లే చేయ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. సీఎన్ఎన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఇరాన్‌పై దాడుల తీవ్ర‌త పెంచ‌నున్న‌ట్లు ట్రంప్ హింట్ ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కూ తాము ఇరాన్‌పై పెద్ద‌గా దాడులు చేయ‌లేద‌ని తెలిపారు. టెహ్రాన్‌పై భారీ దాడులు చేప‌ట్టలేద‌ని తెలిపారు. అస‌లైన భీక‌ర‌ దాడి త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌బోతోంద‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు యుద్ధం ఎక్కువ‌ కాలం కొన‌సాగించే ఉద్దేశం త‌మ‌కు లేద‌న్నారు. అనుకున్న దానికంటే ముందే ల‌క్ష్యాల‌ని సాధిస్తామ‌ని పేర్కొన్నారు. "యుద్ధం ఎక్కువ కాలం సాగాల‌ని మేం కోరుకోవడం లేదు. త్వరలోనే ముగిస్తాం. అనుకున్న దానికంటే ముందుగానే లక్ష్యాలను సాధిస్తాం" అని ట్రంప్ ప్ర‌క‌టించారు.

మ‌ధ్య ప్రాచ్యానికి మ‌రిన్ని బ‌ల‌గాలు..

ఇరాన్‌పై భీక‌ర దాడుల‌కు సిద్ధ‌మ‌వుతున్న అమెరికా.. మ‌ధ్య‌ప్రాచ్యానికి (Middle East) మ‌రిన్ని బ‌ల‌గాల‌ను పంపుతోంది (US sending more toops). ఈ విష‌యాన్ని అమెరికా ర‌క్ష‌ణ‌శాఖాధికారి జ‌న‌ర‌ల్ డాన్ కేన్ తెలిపిన‌ట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. "ఈ ప్రక్రియ ఇప్పుడే మొదలైంది. ఇది ఇంకా కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో అదనపు యుద్ధ విమానాలు చేరుకున్నాక.. మొత్తం యుద్ధ సామర్థ్యం, శక్తి పరంగా అమెరికా అనుకున్న స్థాయికి చేరుకుంటుంది" అని ఆయన పేర్కొన్నారు.

లెక్క‌లేన‌న్ని ఆయుధాలు..

తమవద్ద లెక్కలేనన్ని ఆయుధాలు ఉన్నాయ‌ని ట్రంప్ స్ప‌ష్టం చేశారు. "అమెరికా యుద్ధ సామ‌గ్రి నిల్వ‌లు మునుపెన్న‌డూ లేనంత గ‌రిష్ట‌స్థాయిలో చాలా మెరుగ్గా ఉన్నాయి. అమెరికా కోసం ఉన్నతశ్రేణి ఆయుధాలను ఇతర దేశాల్లో కూడా నిల్వ చేశాం. అమెరికా వద్ద నిల్వలు భారీ విజయాలు సాధించేంతగా ఉన్నాయి. ఈ నిల్వ‌ల‌ను ఉప‌యోగించి ఎప్ప‌టికీ యుద్ధాల‌ను విజ‌య‌వంతంగా కొన‌సాగించ‌గ‌లం. మా ద‌గ్గ‌ర ఉన్న ఆయుధాలు ఇత‌ర దేశాల అత్యుత్త‌మ ఆయుధాల కంటే చాలా మెరుగైన‌వే" అని ట్రంప్ స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు త‌న సొంత సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్టు చేశారు.

ఇరాన్‌పై అమెరికా యుద్ధ ఖ‌ర్చు.. 779 మిలియన్‌ డాలర్లు

ఫిబ్ర‌వ‌రి 28న ఇరాన్‌పై అమెరికా దాడులు చేప‌ట్టింది. ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ పేరుతో ఇజ్రాయెల్‌తో క‌లిసి టెహ్రాన్‌ను చుట్టుముట్టింది. ఇరాన్ సైనిక స్థావ‌రాలే ల‌క్ష్యంగా క్షిప‌ణుల వ‌ర్షం కురిపిస్తోంది. ఇప్ప‌టికే టెహ్రాన్‌కు చెందిన యుద్ధ నౌక‌లను, సైనిక స్థావ‌రాల‌ను అమెరికా ధ్వంసం చేసింది. ఈ దాడుల కోసం అమెరికా త‌న వ‌ద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాల‌ను ఉప‌యోగిస్తోంది. ఈ యుద్ధం కోసం అగ్ర‌రాజ్యం భారీగా ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు అంత‌ర్జాతీయ మీడియా వెల్ల‌డిస్తోంది. యుద్ధం ప్రారంభించిన తొలి 24 గంట‌ల్లోనే దాదాపు 779 మిలియన్‌ డాలర్లను యూఎస్ ఖ‌ర్చు చేసిన‌ట్లు స‌మాచారం. అంటే మ‌న భార‌త క‌రెన్సీలో రూ.7వేల కోట్లు. ఈ యుద్ధం సుదీర్ఘ కాలం కొన‌సాగితే.. ఈ ఖ‌ర్చు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

అమెరికా ఎయిర్ బేస్‌ ధ్వంసం

అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చ‌ర్య‌కు ప్ర‌తిగా ఇరాన్ (Iran) సైతం దాడులు చేస్తున్న‌ది. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున సౌదీఅరెబీయా రాజ‌ధాని రియాద్‌లోని అమెరికా రాయ‌బార కార్యాల‌యంపై (US Embassy) ఇరాన్ డ్రోన్ల‌తో దాడిచేసింది. రెండు డ్రోన్లు ఎంబ‌సీపైకి దూసుకొచ్చాయి. దీంతో భారీ శ‌బ్దం వినిపించ‌డ‌మే కాకుండా ద‌ట్ట‌మైన న‌ల్ల‌టి పొగ ఆకాశాన్ని క‌మ్మేసింది. ఈ దాడిని సౌదీ అరేబియా ర‌క్ష‌ణ శాఖ ధృవీక‌రించింది. దాడుల వ‌ల్ల భ‌వ‌నం స్వల్పంగా ధ్వంస‌మైంద‌ని, మంట‌లు చెల‌రేగ‌డంతో వెంట‌నే ఆర్పివేశామ‌ని తెలిపింది. అదేవిధంగా కువైట్‌లోని యూఎస్ ఎంబ‌సీపై కూడా మిస్సైళ్లు, డ్రోన్ల‌తో ఇరాక్ దాడికి పాల్ప‌డింది.

అంతేకాదు, బెహ్రెయిన్‌లోని షేక్ ఇసా ప్రాంతంలో గ‌ల అమెరికా ఎయిర్ బేస్‌ను ధ్వంసం చేసిన‌ట్లు ఇరాన్ ప్ర‌క‌టించుకుంది. 20 డ్రోన్లు, మూడు క్షిప‌ణుల‌తో ల‌క్ష్యాల‌ను ఛేదించిన‌ట్లు వెల్ల‌డించింది. ఇరాన్ దాడుల నేప‌థ్యంలో సౌదీ, కువైట్‌, బెహ్రెయిన్, జోర్దాన్‌లోని ఎంబ‌సీల‌ను అమెరికా మూసివేసింది. అంతేకాదు పౌరుల‌కు కీల‌క హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఎట్టిప‌రిస్థితుల్లోనూ బ‌ట‌య‌కు రావొద్ద‌ని హెచ్చ‌రించింది. సుర‌క్షిత ప్రాంతాల్లోనే ఉండాల‌ని సూచించింది.

ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా డ్రోన్ దాడులు

ఇదిలా ఉండ‌గా.. ఇరాన్‌కు మ‌ద్ద‌తుగా లెబ‌నాన్ (Lebanon) మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా ( Hezbollah) సైతం ఇజ్రాయెల్‌పై దాడుల‌ను కొన‌సాగిస్తోంది. టెల్ అవీవ్‌లోని ప‌లు ప్రాంతాల‌పై డ్రోన్ల‌తో దాడులు చేస్తోంది. మౌంట్ మెరాన్‌, ర‌మ‌త్ డేవిడ్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది. ఇజ్రాయెల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను ల‌క్ష్యంగా చేసుకొని డ్రోన్ల‌ను పంపింది. అయితే, హెజ్బొల్లా దాడుల‌ను అడ్డుకున్న‌ట్లు ఇజ్రాయెల్ ప్ర‌క‌టించింది.

వారి భ‌ద్ర‌త‌కు గ్యారెంటీ ఇవ్వ‌లేం.. యూఎస్‌

మ‌రోవైపు ఉద్రిక్త‌త‌లు తీవ్ర‌రూపం దాల్చ‌డంతో జెరూస‌లెంలోని అమెరికా రాయ‌బార కార్యాల‌యం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇజ్రాయెల్‌లో ప‌నిచేస్తున్న అమెరికా ఉద్యోగులు, వారి కుటుంబ స‌భ్యుల భ‌ద్ర‌త‌కు గ్యారెంటీ ఇవ్వ‌లేమ‌ని తెలిపింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అక్క‌డున్న అమెరిక‌న్ల‌ను త‌ర‌లించ‌డం లేదా సాయం చేసే ప‌రిస్థితుల్లో ఎంబ‌సీ లేద‌ని స్ప‌ష్టం చేసింది. తుదుప‌రి నోటీసులు వ‌చ్చే వ‌ర‌కూ సుర‌క్షిత ప్రాంతాల్లో ఉండాల‌ని సూచించింది.

Also Read..

ఇరాన్ దాడిలో ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్‌ డైరెక్ట‌ర్ మృతి - సోష‌ల్ మీడియా రూమ‌ర్ల‌లో నిజ‌మెంత?

దాడుల వేళ ఇరాన్‌ను వ‌ణికించిన భూకంపం

ఇరాన్ దాడుల ఎఫెక్ట్: దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో 1200 నుంచి 20కి పడిపోయిన విమాన సర్వీసులు

Advertisement
Advertisement