త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Strait of Hormuz | హార్ముజ్ జలసంధి మాదే.. ఒమన్ అడ్డువస్తే బాంబులేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్, బదులిచ్చిన టెహ్రాన్!

హార్ముజ్ జలసంధిని అమెరికా కొత్త భూభాగంగా ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అయితే తమ డిమాండ్లు నెరవేర్చేదాకా జలసంధిని తెరిచేది లేదని ఇరాన్ తేల్చిచెప్పడంతో ఉద్రిక్తతలు పెరిగాయి.

J

International | Published On Aug 18, 2026, 6.14 pm IST

Strait of Hormuz | హార్ముజ్ జలసంధి మాదే.. ఒమన్ అడ్డువస్తే బాంబులేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్, బదులిచ్చిన టెహ్రాన్!

సంక్షిప్త సారాంశం

వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) "అమెరికా కొత్త భూభాగం"గా ప్రెసిడెంట్ ట్రంప్ 'ట్రూత్ సోషల్'లో మ్యాప్ షేర్ చేశారు. తమపై ఉన్న నావికా దిగ్బంధనాన్ని, ఆంక్షలను ఎత్తివేసే వరకు జలసంధిని మూసివేస్తామని ఇరాన్ టాప్ నెగోషియేటర్ గాలిబాఫ్ స్పష్టం చేశారు. జలసంధి రాకపోకల విషయంలో ఒమన్‌తో ఇరాన్ చర్చలు జరుపుతుండగా.. తమకు అడ్డువస్తే ఒమన్‌పై బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా-ఇరాన్ మధ్య సానుకూల చర్చలు జరుగుతున్నాయని, ఇరాన్ చేతికి అణ్వాయుధాలు వెళ్లకూడదన్నదే ట్రంప్ ప్రధాన డిమాండ్ అని రాయబారి జారెడ్ కుష్నర్ తెలిపారు.

Advertisement

Strait of Hormuz | త్రినేత్ర.న్యూస్ : అమెరికా (US), ఇరాన్ (Iran) మధ్య ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన వాణిజ్య, ఇంధన రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధిపై (Strait of Hormuz) పట్టు కోసం ఇరు దేశాలు తీవ్రస్థాయిలో తలపడుతున్నాయి. ఈ వ్యూహాత్మక జలసంధి తమ "అమెరికా కొత్త భూభాగం" (New US territory) అని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మంగళవారం 'ట్రూత్ సోషల్' (Truth Social) వేదికగా ఒక మ్యాప్‌ను పోస్ట్ చేసి సంచలనం సృష్టించారు. ఈ మార్గంపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని ఆయన పేర్కొన్నారు. అటు ఇరాన్ సైతం వెనక్కి తగ్గకుండా, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఈ మార్గాన్ని మూసివేస్తామని తేల్చిచెప్పింది.

ఇరాన్ ప్రధాన డిమాండ్లు ఇవే..

ఈ పరిణామాలపై ఇరాన్ టాప్ నెగోషియేటర్ మహ్మద్ బఘేర్ గాలిబాఫ్ (Mohammad Bagher Ghalibaf) ప్రభుత్వ టీవీ ద్వారా స్పందించారు. అమెరికా తమపై విధించిన నావికా దిగ్బంధనాన్ని (Naval blockade), చమురు ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను తిరిగి ఇవ్వాలని.. అమెరికా తన హామీలను నెరవేర్చే వరకు హర్ముజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. జూన్‌లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో ఈ డిమాండ్లు ఉన్నాయని, కానీ ఆ తర్వాత ఆ ఒప్పందం విఫలమైందని టెహ్రాన్ చెబుతోంది. దాడులకు ప్రతిదాడులు చేసేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని గాలిబాఫ్ హెచ్చరించారు.

యుద్ధం, వాణిజ్య ఆంక్షలు

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 8 నుంచి దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ.. హార్ముజ్ జలసంధి పరిసరాల్లో ఇంకా ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. పర్షియన్ గల్ఫ్‌ను, గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంతో కలిపే ఈ మార్గం ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకం. ప్రస్తుతం ఈ మార్గం ఇరాన్ నియంత్రణలో ఉండటంతో.. ఇక్కడి నుంచి వెళ్లే నౌకలు ముందస్తు అనుమతి తీసుకోవడంతో పాటు రవాణా రుసుము చెల్లించాల్సి వస్తోంది. ఈ నిబంధనలను అమెరికాతో పాటు పలు దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఒమన్‌కు ట్రంప్ వార్నింగ్.. జలసంధిలో దాడి

జలసంధిలో నౌకల రాకపోకలపై తీర ప్రాంతం పంచుకుంటున్న ఇరాన్, ఒమన్ (Oman) దేశాలు ప్రస్తుతం కీలక చర్చలు జరుపుతున్నాయి. ఈ చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, నావిగేషన్ మార్గం భౌగోళిక కోఆర్డినేట్స్‌పై అంగీకారం కుదిరిందని ఇరాన్ ప్రకటించింది. అయితే, ఇరాన్‌తో అమెరికా కుదుర్చుకునే ఒప్పందానికి ఒమన్ ఏమాత్రం అడ్డు తగిలినా.. ఆ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఇదిలా ఉండగా, మంగళవారం హర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఒక నౌకపైకి గుర్తుతెలియని ప్రొజెక్టైల్ (unknown projectile) దూసుకురావడంతో అందులోని ఇంజిన్ రూమ్ దెబ్బతిని, ఒక సిబ్బంది గాయపడ్డారు. వారికి ఒమన్ కోస్ట్ గార్డ్ సాయం చేస్తోందని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) 'ఎక్స్' వేదికగా వెల్లడించింది.

అణ్వాయుధాలు ఉండకూడదంతే: కుష్నర్

పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ.. అమెరికా-ఇరాన్ మధ్య సానుకూల చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ అల్లుడు, రాయబారి జారెడ్ కుష్నర్ (Jared Kushner) ఫాక్స్ న్యూస్‌కు తెలిపారు. ట్రంప్ తొందరపడటం లేదని, సరైన నిబంధనలతో కూడిన ఒప్పందం కుదిరే వరకు ఆయన ఓపికగా ఉంటారని కుష్నర్ స్పష్టం చేశారు. ఇరాన్ అధికారులు ఒప్పందం కోరుకుంటున్నారని.. కానీ తాను కోరుకున్న నిబంధనలకు వారు అంగీకరించడం లేదని ట్రంప్ తెలిపారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు (Nuclear weapon) కలిగి ఉండకూడదన్నదే తన ప్రధాన డిమాండ్ అని ట్రంప్ పునరుద్ఘాటించారు.

Advertisement
Advertisement