త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pakistan Troops in Saudi Arabia | ఇరాన్‌తో వార్.. సౌదీ అరేబియాకు 8,000 మంది పాక్ సైనికులు, ఫైటర్ జెట్స్

అమెరికా-ఇరాన్ యుద్ధం వేళ పాకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రక్షణ ఒప్పందంలో భాగంగా సౌదీ అరేబియాకు 8 వేల మంది సైనికులు, ఫైటర్ జెట్లను పంపించింది.

J

International | Published On May 18, 2026, 8.12 pm IST

Pakistan Troops in Saudi Arabia | ఇరాన్‌తో వార్.. సౌదీ అరేబియాకు 8,000 మంది పాక్ సైనికులు, ఫైటర్ జెట్స్
Advertisement

Pakistan Troops in Saudi Arabia | త్రినేత్ర.న్యూస్ : అమెరికా-ఇరాన్ యుద్ధం (US-Iran war) తీవ్రమవుతున్న వేళ పాకిస్థాన్ (Pakistan) కీలక అడుగు వేసింది. పరస్పర రక్షణ ఒప్పందంలో భాగంగా సౌదీ అరేబియాకు (Saudi Arabia) ఏకంగా 8,000 మంది సైనికులు, ఓ ఫైటర్ జెట్స్ స్క్వాడ్రన్‌తో పాటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను పంపినట్లు పాక్ మిలిటరీ వర్గాలు సోమవారం రాయిటర్స్ (Reuters) వార్తా సంస్థకు వెల్లడించాయి.

అమెరికా-ఇరాన్ మధ్య ప్రధాన మధ్యవర్తిగా (Mediator) వ్యవహరిస్తున్న పాకిస్థాన్, సరిగ్గా ఇదే సమయంలో రియాద్‌తో మిలిటరీ బంధాన్ని పెంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. భవిష్యత్తులో సౌదీ అరేబియాపై ఎవరైనా దాడి చేస్తే, ఆ దేశానికి అండగా నిలిచేందుకే ఈ భారీ మిలిటరీ ఫోర్స్‌ను (Military force) మోహరించినట్లు పాక్ భద్రతా అధికారులు, ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. గతేడాది కుదిరిన ఈ 'డిఫెన్స్ అగ్రిమెంట్' పూర్తి నిబంధనలను మాత్రం ఇరు దేశాలు గోప్యంగా ఉంచాయి.

ఫైటర్ జెట్స్, డ్రోన్లు.. ఫైనాన్స్ మాత్రం సౌదీదే

చైనా సహకారంతో పాక్ తయారు చేసిన సుమారు 16 JF-17 ఫైటర్ జెట్లను (Fighter jets) ఏప్రిల్ ప్రారంభంలోనే సౌదీకి పంపినట్లు సమాచారం. వీటితో పాటు రెండు డ్రోన్ల స్క్వాడ్రన్లను కూడా పంపించింది. ప్రస్తుతం 8,000 మంది ట్రూప్స్‌ను పంపిన పాక్, అవసరమైతే మరింత మందిని పంపేందుకు సిద్ధంగా ఉంది. చైనాకు చెందిన HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను (Air defence system) కూడా సౌదీకి అందించింది. అయితే, ఈ ఆయుధాలను పాక్ సిబ్బందే ఆపరేట్ చేస్తారని, వీటన్నింటికీ అయ్యే ఖర్చును (Finance) సౌదీ అరేబియా భరిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వీరు ప్రధానంగా ట్రైనింగ్, అడ్వైజరీ రోల్స్‌కే పరిమితం కానున్నారు.

భవిష్యత్తులో 80,000 మంది మోహరింపు?

ఈ ఒప్పందం ప్రకారం.. సౌదీ బోర్డర్ల భద్రత కోసం భవిష్యత్తులో ఏకంగా 80,000 మంది పాక్ సైనికులను (Pakistani troops) మోహరించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, పాక్ యుద్ధనౌకలను (Warships) కూడా పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే పాకిస్థాన్ కేవలం సలహాలు ఇవ్వడానికే కాకుండా, ప్రాక్టికల్‌గా సౌదీ తరఫున యుద్ధభూమిలో దిగేందుకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది.

ఇరాన్, సౌదీ మధ్య నలిగిపోతున్న పాక్

అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కోసం (Ceasefire) పాక్ గత ఆరు వారాలుగా తీవ్రంగా శ్రమిస్తోంది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు కూడా ఆతిథ్యం ఇచ్చింది. కానీ, ఒకవైపు మధ్యవర్తిగా ఉంటూనే, మరోవైపు ఇరాన్ ప్రధాన శత్రువైన సౌదీ అరేబియాకు మిలిటరీ సపోర్ట్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గతంలో సౌదీ అరేబియా కీలక ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసినప్పుడే.. పాక్ తమ జెట్లను సౌదీకి పంపినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఏది ఏమైనా, పాక్ తీసుకుంటున్న ఈ ద్వంద్వ వైఖరి గల్ఫ్ ప్రాంతంలో టెన్షన్‌ను మరింత పెంచుతుందో, తగ్గిస్తుందో చూడాలి.

Advertisement
Advertisement