త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

America | మంచు తుపానుతో అగ్ర‌దేశం ఉక్కిరిబిక్కిరి.. 5600 విమానాలు ర‌ద్దు

America | అమెరికాలోని ఈశాన్య ప్రాంతాల‌ను చ‌లిగాలులు వ‌ణికిస్తున్నాయి. ఎన్న‌డూ లేనంత ద‌ట్టంగా హిమపాతం కురుస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

S

International | Published On Feb 24, 2026, 8.36 am IST

America | మంచు తుపానుతో అగ్ర‌దేశం ఉక్కిరిబిక్కిరి.. 5600 విమానాలు ర‌ద్దు
Advertisement

చ‌ల్ల‌ని గాలుల‌తో వ‌ణ‌కుతున్న అమెరికా
స్తంభించిన ర‌వాణా వ్య‌వ‌స్థ‌
పాఠ‌శాల‌ల మూసివేత‌

America | త్రినేత్ర‌.న్యూస్ : అమెరికాలోని ఈశాన్య ప్రాంతాల‌ను చ‌లిగాలులు వ‌ణికిస్తున్నాయి. ఎన్న‌డూ లేనంత ద‌ట్టంగా హిమపాతం కురుస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మేరిలాండ్ నుంచి మైనే వ‌ర‌కు చ‌ల్ల‌ని గాలులు వీచ‌డంతో పాటు ద‌ట్ట‌మైన మంచు కురుస్తుండ‌డంతో వేల మంది ప్ర‌జ‌లు త‌మ నివాసాల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. కాలు తీసి బ‌య‌ట పెట్ట‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ర‌వాణా వ్య‌వ‌స్థ కూడా స్తంభించిపోయింది. స్కూల్స్ మూత‌ప‌డ్డాయి. బిజినెస్‌కు ఆటంకం ఏర్ప‌డింది.

ఈశాన్య ప్రాంతంలోని ప‌లు రాష్ట్రాల్లో 60 సెం.మీ. కంటే ఎక్కువ మంచు కురిసి గ‌త రికార్డుల‌ను చెరిపేసింది. ఈ ప‌రిస్థితుల మ‌ధ్య ఐరాస భ‌ద్ర‌తా మండ‌లి కూడా త‌మ స‌మావేశాన్ని వాయిదా వేసుకుంది. భారీ హిమపాతం కార‌ణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు కూడా అంత‌రాయం క‌లిగిన‌ట్లు స్థానిక మీడియా వెల్ల‌డించింది. వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించి.. ముందుస్తు జాగ్ర‌త్త‌గా పాఠ‌శాల‌ల‌ను మూసివేయించారు.

న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్‌లో 48 సెం.మీ. మంచు నమోదైంది. వార్విక్, రోడ్ ఐలాండ్‌లో 91 సెం.మీ.కు మించి మంచు న‌మోదు కాగా.. ఇప్పటివరకు అమెరికాలో ఇదే అగ్రస్థానంలో ఉంది. ఇక భారీగా పేరుకుపోయిన మంచును తొల‌గిచేందుకు అధికార యంత్రాంగం చ‌ర్య‌లు చేప‌ట్టింది.

5600 విమానాలు ర‌ద్దు

ద‌ట్ట‌మైన పొగ‌మంచు కార‌ణంగా 5600 విమానాల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు ఫ్లైట్ అవేర్ వెబ్‌సైట్ ద్వారా తెలిసింది. మ‌రో 2 వేల విమానాలు ఆయా ఎయిర్‌పోర్టుల్లోనే నిలిపివేశారు. న్యూయార్క్, న్యూజెర్సీ, బోస్ట‌న్‌లో 2,500 విమానాలు ఆల‌స్యంగా న‌డుస్తున్నాయి. రోడ్ ఐలాండ్‌లోని టీఎఫ్‌ గ్రీన్ అంతర్జాతీయ విమానాశ్రయం సోమవారం అన్ని విమానాశ్రయ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్‌పోర్టులో 83.3 సెంటీమీటర్లు మంచు కురిసిందని, ఇది 1978లో నెలకొల్పబడిన రికార్డును బద్దలు కొట్టిందని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement