త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Flight Shutdown | ఎయిర్‌ ట్రాఫిక్‌ సిస్టమ్‌ క్రాష్.. అమెరికాలో నిలిచిన విమానాలు

Flight Shutdown | అమెరికాలో విమానయాన సేవలు (Flight Shutdown) నిలిచిపోయాయి. ఎయిర్ కంట్రోల్ సెంట‌ర్ల‌లో (ATC) క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌లో సాంకేతిక‌ స‌మ‌స్య (Communications Failure) త‌లెత్త‌డంతో విమాన సేవ‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్ర‌క‌టించింది.

G

International | Published On Nov 14, 2026, 7.50 am IST

Flight Shutdown | ఎయిర్‌ ట్రాఫిక్‌ సిస్టమ్‌ క్రాష్.. అమెరికాలో నిలిచిన విమానాలు
Advertisement

Flight Shutdown | త్రినేత్ర న్యూస్‌: అమెరికాలో విమానయాన సేవలు (Flight Shutdown) నిలిచిపోయాయి. ఎయిర్ కంట్రోల్ సెంట‌ర్ల‌లో (ATC) క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌లో సాంకేతిక‌ స‌మ‌స్య (Communications Failure) త‌లెత్త‌డంతో విమాన సేవ‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్ర‌క‌టించింది. భద్రతా కారణాల దృష్ట్యా అన్ని విమానాల బ‌య‌లుదేర‌డాన్ని (గ్రౌండ్ స్టాప్) విధించింది. అప్పటికే గాల్లో ఉన్న విమానాలకు మాత్రం ల్యాండింగ్‌కు అనుమతించ‌గా, మిగిలిన విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది (Nationwide Ground Stop). దీంతో దేశ‌వ్యాప్తంగా విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. నాలుగేండ్ల క్రితం అంటే 2023 జ‌న‌వ‌రిలో ఎఫ్ఏఏ ప్ర‌ధాన కంప్యూట‌ర్ వ్య‌వ‌స్థ‌లో సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో దేశ‌వ్యాప్తంగా అన్ని విమాన సేవ‌లు నిలిచిపోయాయి. అదేవిధంగా 2001, సెప్టెంబ‌ర్ 11 నాటి ఉగ్ర‌దాడుల నేప‌థ్యంలో అమెరికాలో పూర్తిస్థాయిలో విమానాల రాక‌పోక‌ల‌ను నిలిపివేశారు.

నిలిచిన 11 వేల విమానాలు

శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 3.54 గంట‌ల‌కు దేశ‌వ్యాప్తంగా గ్రౌండ్ స్టాప్ విధిస్తున్న‌ట్లు ఆదేశించింది. అయితే అప్ప‌టికే గాల్లో ఉన్న విమానాల‌ను దిగేందుకు అనుమ‌తించింది. ఆ స‌మ‌యంలో 4,042 విమానాలు అమెరికాలోని వివిధ విమానాశ్ర‌యాల్లో దిగేందుకు సిద్ధంగా ఉన్నాయ‌ని ఫ్లైట్‌రాడార్24 (Flightradar24) వెల్ల‌డించింది. సుమారు 11 వేల విమానాలు ఆల‌స్యమ‌వ‌డం లేదా ర‌ద్ద‌య్యాయ‌ని ఫ్లైట్ ట్రాకింగ్ సేవ‌లు అందించే ఫ్లైట్అవేర్ (FlightAware) పేర్కొంది. ఇందులో 1000 విమానాలు ర‌ద్ద‌వ‌గా, మ‌రో 10 వేల విమానాలు ఆల‌స్యంగా న‌డుస్తున్నాయ‌ని చెప్పింది.

కమ్యూనికేషన్ సమస్య..

కాగా, దేశవ్యాప్తంగా ఉన్న 22 ప్రాంతీయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ సమస్య (Communication Glitch) తలెత్తింద‌ని అమెరికా ర‌వాణా శాఖ కార్య‌ద‌ర్శి సీన్ డ‌ఫీ తెలిపారు. ఈ కేంద్రాలు వివిధ విమానాశ్రయాల మధ్య ప్రయాణించే విమానాలకు దిశానిర్దేశం చేస్తుంటాయ‌ని, సమస్యకు కారణాలను గుర్తించేందుకు ఎఫ్‌ఏఏ సాంకేతిక నిపుణులు దర్యాప్తు చేస్తున్నారన్నారు.

సైబర్ అటాక్ కాదు..

ఇది సైబర్ దాడి (Cyber Attack)కి సంబంధించింది కాదని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని హోంల్యాండ్ సెక్యూరిటీ (అంతర్గత భద్రత) చీఫ్ మార్క్‌వేన్ ముల్లిన్ చెప్పారు. ఈ ఘటనపై అధికారులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారని వెల్ల‌డించారు. `ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ఇది మాపై జరిగిన కుట్రపూరిత దాడి అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ప్రస్తుతానికి ఇది కేవలం టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో తలెత్తిన అంతరాయం మాత్రమే. ఇది మరో 9/11 దాడి లాంటిది కాదు. ఈ విషయాన్ని నేను ఎంత చెప్పినా తక్కువే` అని ముల్లిన్ స్ప‌ష్టం చేశారు. మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అంతరాయానికి దీనికి సంబంధం లేదన్నారు.

Advertisement
Advertisement