త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US Shooting | అమెరికాలో నలుగురి ప్రాణాలు తీసిన దుండగుడు..

US Gun Fire | అమెరికాలో మరోసారి పాఠశాలలో కాల్పుల కలకలం రేగింది. ఒరెగాన్‌లోని బెండ్‌ నగరంలో సిల్వర్‌ రైల్‌ ఎలిమెంటరీ స్కూల్‌లోకి చొరబడిన ఓ టీనేజర్‌ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయారు.

P

International | Published On Oct 17, 2026, 9.44 pm IST

US Shooting | అమెరికాలో నలుగురి ప్రాణాలు తీసిన దుండగుడు..
Advertisement
  • కూతుళ్ల స్కూల్‌లో కాల్పులు.. తుపాకీతో దూసుకెళ్లిన తండ్రి!
  • ఎదురొడ్డి నిలిచిన తండ్రిపై ట్రంప్ ప్ర‌శంస‌లు

US Shooting | అమెరికాలో మరోసారి పాఠశాలలో కాల్పుల కలకలం రేగింది. ఒరెగాన్‌లోని బెండ్‌ నగరంలో సిల్వర్‌ రైల్‌ ఎలిమెంటరీ స్కూల్‌లోకి చొరబడిన ఓ టీనేజర్‌ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయారు. అయితే, తన ఇద్దరు కూతుళ్లు చదువుతున్న పాఠశాలలో కాల్పులు జరుగుతున్నాయని తెలిసి అక్కడికి చేరుకున్న 36 ఏళ్ల కెలూబ్‌ జియామాంకో.. దుండగుడిని ఎదుర్కొన్నాడు. తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం జియామాంకోను ప్రశంసించారు.

తుపాకీ శబ్దాలు విని.. లోపలికి వెళ్లి!

వృత్తిరీత్యా కార్పెంటర్‌ అయిన జియామాంకో.. తన వాహనంలో చట్టబద్ధంగా .40 క్యాలిబర్‌ పిస్టల్‌ను ఉంచుకున్నాడు. పాఠశాలలో కాల్పులు ప్రారంభమైన సమయంలో లోపలికి వెళ్లిన అతడికి తుపాకీ శబ్దాలు వినిపించాయి. ఓ ఉపాధ్యాయుడు దుండగుడితో పెనుగులాడుతుండటాన్ని గమనించి.. తన తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ విషయాన్ని పోలీస్‌ చీఫ్‌ మైక్‌ క్రాంట్జ్‌ వెల్లడించారు. జియామాంకో తల్లి కెండా ఫ్రీమన్‌ సైతం తన కుమారుడు దుండగుడిని ఎదుర్కొన్నట్లు తెలిపారు.

తండ్రి ధైర్యసాహసాలపై ట్రంప్‌ ప్రశంసలు

ఈ ఘటనపై వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. జియామాంకో చర్యలను ప్రశంసించారు. ‘ఇది అత్యంత విషాదకర ఘటన. అయితే, తుపాకీ ఉండి.. దాన్ని ఎలా ఉపయోగించాలో తెలిసిన ఓ వ్యక్తి అక్కడ ఉండటం అదృష్టం’ అని వ్యాఖ్యానించారు. పోలీసుల రాకకు ముందే సాధారణ పౌరులు దుండగులను ఎదుర్కొనే ఘటనలు అమెరికాలో అరుదుగా కనిపిస్తుంటాయి. తాజా ఘటనతో ప్రమాద సమయంలో పౌరుల జోక్యం ఎంతవరకు ఉపయోగపడుతుందనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

దాడులను అడ్డుకోవడంలో పౌరుల పాత్ర ఎంత?

2000 నుంచి 2025 మధ్య అమెరికాలో జరిగిన 634 దాడులపై నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. తుపాకులు, పదునైన ఆయుధాలు, వాహనాలతో జరిగిన ఈ దాడుల్లో 374 ఘటనలు పోలీసులు చేరుకునేలోపే ముగిశాయి. వీటిలో 29 సందర్భాల్లో ఆయుధాలున్న పౌరులు కాల్పులు జరిపి దుండగులను అడ్డుకున్నారు. మరో 31 ఘటనల్లో దుండగులను కిందపడేయడం, ఆయుధాలను లాక్కోవడం వంటి పద్ధతులతో అదుపులోకి తెచ్చారు. పోలీసుల రాకకు ముందే దాడిని నిలువరించేందుకు తామే చివరి అవకాశమని కొందరు భావిస్తారని అధ్యయన కేంద్రం ప్రతినిధి జేమ్స్‌ కీత్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement