త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Advisory | సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Advisory | సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో ఆదివారం నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు. అమరవీరుల స్మారక స్థూపం నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌పై ఉన్న బతుకమ్మ ఘాట్‌ (రోటరీ చిల్డ్రన్స్‌ పార్క్‌) వరకు వేడుకలు నిర్వహించనున్నారు.

P

Hyderabad | Published On Oct 17, 2026, 8.13 pm IST

Traffic Advisory | సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Advertisement
  • రేపు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 గంటల వరకు అమలు
  • ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్‌ పరిసరాల్లో ఆంక్షలు..
  • వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసుల సూచన

Traffic Advisory | సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో ఆదివారం నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు. అమరవీరుల స్మారక స్థూపం నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌పై ఉన్న బతుకమ్మ ఘాట్‌ (రోటరీ చిల్డ్రన్స్‌ పార్క్‌) వరకు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 18న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

ప్రధాన జంక్షన్ల వద్ద మళ్లింపులు

తెలుగు తల్లి జంక్షన్‌, కర్బాలా మైదాన్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు సాధారణ వాహనాలను అనుమతించరు. ఇక్బాల్‌ మినార్‌ నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్‌, కట్టమైసమ్మ, డీబీఆర్‌ మిల్స్‌, ఇందిరా పార్క్‌, గాంధీనగర్‌, ఆర్టీసీ ఎక్స్‌ రోడ్ల వైపు మళ్లిస్తారు. ఖైరతాబాద్‌ వి.వి. విగ్రహం నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వెళ్లే వాహనాలను నెక్లెస్‌ రోటరీ వద్ద ప్రసాద్స్‌ ఐమాక్స్‌, మింట్‌ కాంపౌండ్‌ మార్గంలోకి మళ్లిస్తారు. నల్లగుట్ట జంక్షన్‌ నుంచి బుద్ధభవన్‌ వైపు వాహనాలకు అనుమతి ఉండదు. నల్లగుట్ట ఎక్స్‌ రోడ్స్‌ వద్ద రాణిగంజ్‌, నెక్లెస్‌ రోడ్‌ వైపు మళ్లిస్తారు. లిబర్టీ నుంచి వచ్చే వాహనాలను అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఇక్బాల్‌ మినార్‌ వైపు మళ్లించి, యూటర్న్‌ ద్వారా తెలుగు తల్లి జంక్షన్‌ మీదుగా ఫ్లైఓవర్‌పైకి పంపిస్తారు. సికింద్రాబాద్‌ నుంచి వచ్చే వాహనాలను కర్బాలా మైదాన్‌ వద్ద బైబిల్‌ హౌస్‌, జబ్బార్‌ కాంప్లెక్స్‌, కవాడిగూడ, గాంధీనగర్‌ టీ జంక్షన్‌, గోశాల, ధోబీఘాట్‌, స్విమ్మింగ్‌ పూల్‌, బండమైసమ్మ, ఇందిరా పార్క్‌, కట్టమైసమ్మ మీదుగా మళ్లిస్తారు. ముషీరాబాద్‌, కవాడిగూడ నుంచి చిల్డ్రన్స్‌ పార్క్‌, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వాహనాలను అనుమతించరు. డీబీఆర్‌ మిల్స్‌ వద్ద నుంచి ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపిస్తారు.

ఆర్టీసీ బస్సులు సైతం..

సికింద్రాబాద్‌ నుంచి ఎంజీబీఎస్‌ వైపు వెళ్లే అంతర్‌జిల్లా ఆర్టీసీ బస్సులను స్వీకార్‌-ఉపకార్‌ జంక్షన్‌ వద్ద నుంచి వైడబ్ల్యూసీఏ, సంగీత్‌, మెట్టుగూడ, తార్నాక, నల్లకుంట, ఫీవర్‌ హాస్పిటల్‌ ఎక్స్‌ రోడ్‌, బర్కత్‌పురా, టూరిస్ట్‌ హోటల్‌, నింబోలిఅడ్డా, చాదర్‌ఘాట్‌, రంగమహల్‌ మీదుగా మళ్లిస్తారు. సిటీ బస్సులను కూడా కర్బాలా మైదాన్‌ నుంచి ప్రత్యామ్నాయ మార్గాల్లో నడపనున్నారు. ఖైరతాబాద్ వీవీ విగ్రహం, పాత పీఎస్‌ సైఫాబాద్‌, ఇక్బాల్‌ మినార్‌, తెలుగు తల్లి జంక్షన్‌, నెక్లెస్‌ రోటరీ, లిబర్టీ, రవీంద్రభారతి, అంబేడ్కర్‌ విగ్రహం, ట్యాంక్‌బండ్‌, కవాడిగూడ ఎక్స్‌ రోడ్స్‌, కట్టమైసమ్మ, కర్బాలా మైదాన్‌, రాణిగంజ్‌, నల్లగుట్ట ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ నెలకొనే అవకాశం ఉంది. ఈ మార్గాల్లో ప్రయాణించే వారు ముందుగానే ప్రత్యామ్నాయ దారులను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.

వాహనాల పార్కింగ్‌ ఎక్కడంటే..

వేడుకలకు వచ్చే ప్రజలు స్నో వరల్డ్‌, ఎన్టీఆర్‌ స్టేడియం, అమరవీరుల స్మారక స్థూపం, ఎన్టీఆర్‌ ఘాట్‌ పార్కింగ్‌, ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ పార్కింగ్‌, హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌, లుంబినీ పార్క్‌ ముందు భాగం, బీఆర్‌కే భవన్‌ రోడ్డులో కేటాయించిన స్థలాల్లో వాహనాలను పార్క్‌ చేయాలి. వేడుకలు ముగిసిన వెంటనే ట్రాఫిక్‌ ఆంక్షలను ఎత్తివేసి సాధారణ రాకపోకలను అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. తాజా ట్రాఫిక్‌ సమాచారం కోసం హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల ఫేస్‌బుక్‌ పేజీ @HYDTP, ఎక్స్‌ ఖాతాను ఫాలో కావాల‌ని సూచించారు. అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్‌ 9010203626ను సంప్రదించవచ్చని వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్ డీ జోయల్‌ డేవిస్‌ ప్రకటన విడుదల చేశారు.

Advertisement
Advertisement