త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balen Shah | నేపాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. ప్ర‌ధానిగా బాలెన్ షా..!

Balen Shah | పొరుగు దేశం నేపాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా ఈ హిమాలయ దేశాన్ని ఏలుతూ వచ్చిన సంప్రదాయ పార్టీలను కాదని యువ నాయకత్వానికి ప్రజలు మద్దతు ఇస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

P

International | Published On Mar 7, 2026, 3.51 pm IST

Balen Shah | నేపాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. ప్ర‌ధానిగా బాలెన్ షా..!
Advertisement

Balen Shah | పొరుగు దేశం నేపాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా ఈ హిమాలయ దేశాన్ని ఏలుతూ వచ్చిన సంప్రదాయ పార్టీలను కాదని యువ నాయకత్వానికి ప్రజలు మద్దతు ఇస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. 275 ఎంపీ సీట్లు ఉన్న నేపాల్ ప్రతినిధుల సభకు ఈ నెల 5న ఓటింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఖాట్మాండు మాజీ మేయర్, బాలేంద్ర షా (బాలెన్) నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) అధికారం చేపట్టే దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే 27 స్థానాల్లో విజయం సాధించిన ఆ పార్టీ మరో 97 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతోంది. నేపాల్ కాంగ్రెస్ పార్టీకి ఐదు సీట్లు దక్కగా.. కమ్యూనిస్ట్ పార్టీ ఒకే స్థానంలో గెలిచింది. 36 సంవత్సరాల తర్వాత ఒకే పార్టీకి ఓటర్లు భారీ మెజారిటీ ఇవ్వనున్నట్లు స్పష్టమవుతోంది. ఇదే నిజమైతే బాలెన్ షా నేపాల్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

బాలెన్ షా రాజకీయ ప్రస్థానం..

బాలెన్ షా రాజకీయ ప్రయాణం అంతా సులువుగా ఏమీ సాగలేదు. నేపాల్‌లో ర్యాప్‌గా యువతలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఎంతో మంది సంగీత అభిమానులను అలరించారు. వృత్తిరీత్యా ఆయన ఇంజినీర్‌. 2022లో ఖాఠ్మాండు మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులను ఓడించి మేయర్‌గా గెలిచారు. ఆయన ఆ ఎన్నికల్లో కర్ర గుర్తుపై పోటీ చేయగా 61,767 ఓట్లు వచ్చాయి. నేపాలీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిర్జనా సింగ్ 38,341 ఓట్లు రాగా.. సీపీఎన్–యూఎంఎల్ అభ్యర్థి, మాజీ మేయర్ కేశవ్ స్థాపిత్ 38,117 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

ప్రధాని పదవి రేసులో..

ప్రస్తుత పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే 35 ఏళ్ల బాలెన్ షా నేపాల్‌లో అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా నిలిచే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 2013లో జరిగిన “రా బార్జ్” ర్యాప్ బ్యాటిల్‌తో ఆయనకు తొలిసారిగా గుర్తింపు వచ్చింది. మేయర్‌గా ఎన్నికయ్యే ముందు దాదాపు రెండున్నర సంవత్సరాలు పాటు ప్రజలతో కలిసి మమేకమయ్యారు. హిమాలయన్ వైట్ హౌస్ కాలేజీలో ఇంజినీరింగ్ చదివిన ఆయన.. భారత్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. విద్యా నేపథ్యం, సాంకేతిక అవగాహన ప్రజల్లో ఆయనపై నమ్మకాన్ని పెంచాయి. అవినీతిపై కఠిన వైఖరి, నిరాడంబరమైన వ్యక్తిత్వం ప్రజలను ఆకర్షించాయి. సామాజిక మాధ్యమాలతో ప్రజలతో దగ్గరగా ఉండడంతో యువతలో ఆయనకు మంచి ఆదరణ తీసుకువచ్చింది.

వ్యూహాత్మక రాజకీయ అడుగులు..

బాలెన్ షా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. సెప్టెంబర్‌లో నేపాల్‌లో ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. నిరసనల్లో దాదాపుగా 77 మంది మరణించడంతో అప్పటి ప్రధానమంత్రి కేపీ శర్మ ఒలి రాజీనామా చేశారు. ఆ సమయంలో యువత బాలెన్ షాను తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని కోరింది. అయితే, ఆయన ఆ ఆఫర్‌ను తిరస్కరించి మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీకి మద్దతు ప్రకటించారు. ఆరు నెలల తాత్కాలిక అధికారాన్ని కంటే పూర్తి ఐదేళ్ల పదవిని లక్ష్యంగా పెట్టుకున్నారు. బాలెన్ షా ఈ ఏడాది జనవరి 18న అధికారికంగా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీలో చేరారు. ఆ తర్వాత రోజు నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రాజకీయ దురంధరుడైన కేపీ శర్మ ఒలి కంచుకోటగా భావించే ఝాపా-5 నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. బాలెన్ షాకు దక్కుతున్న ప్రజాదరణ ఒలి దశాబ్దాల ఆధిపత్యానికి ముగింపుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్..

బాలెన్ షా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఫేస్‌బుక్‌లో ఆయనకు 35 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. సంప్రదాయ ప్రెస్ కాన్ఫరెన్స్‌ల కంటే సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలతో నేరుగా మాట్లాడటానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అయితే, కొన్నిసార్లు ఆయన చేసిన కఠిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీశాయి. అమెరికా, భారత్, చైనా తదితర దేశాలపై మాత్రమే కాకుండా సొంత పార్టీపై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా అభిమానులు ఆయనను రాజకీయంగా ప్రత్యామ్నాయంగా చూస్తుండడం గమనార్హం.

వ్యక్తిగత జీవితం...

బాలెన్ షా 1990లో జన్మించారు. ఆయన తండ్రి రామ్ నారాయణ్ షా ఆయుర్వేద వైద్యుడు. క్రియాశీల రాజకీయాల్లో అధికారికంగా అడుగుపెట్టే ముందు ఆయన మరణించారు. ప్రస్తుతం రాజకీయ కార్యకలాపాలతో పాటు బాలెన్ షా ఖాట్మాండు యూనివర్సిటీలో పీహెచ్‌డీ కూడా చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే నేపాల్ రాజకీయాల్లో కొత్త దశ ప్రారంభమవుతున్నట్లు కనిపిస్తోంది. పాత నాయకుల పట్టు క్రమంగా తగ్గుతుండగా.. యువ నాయకత్వానికి ప్రజలు మద్దతు ఇస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Read Also :

Iran Apologizes To Gulf Countries | ఇకపై దాడులు చేయం.. క్ష‌మించండి.. గ‌ల్ఫ్ దేశాల‌కు ఇరాన్ క్ష‌మాప‌ణ‌లు

Sundar Pichai | భారీగా పెరిగిన గూగుల్ సీఈవో పిచాయ్ వేత‌నం.. ఎంతంటే..?

Advertisement
Advertisement