త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran US Conflict 2026 | ఏ క్షణమైనా మాపై బాంబులు పడొచ్చు

"ఏ క్షణమైనా మాపై బాంబులు పడొచ్చు.. అయినా చర్చలు చేశాం" అంటూ అమెరికాతో జరిగిన సీక్రెట్ మీటింగ్స్‌పై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

J

International | Published On Jul 20, 2026, 1.00 am IST

Iran US Conflict 2026 | ఏ క్షణమైనా మాపై బాంబులు పడొచ్చు
Advertisement
  • బాంబుల దాడి భయంలోనూ అమెరికాతో చర్చలు
  • ఇరాన్ మంత్రి సంచలనం

Iran US Conflict 2026 | త్రినేత్ర.న్యూస్ : అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్‌తో (Steve Witkoff) తాము అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో చర్చలు జరిపామని వెల్లడించారు. "ఏ క్షణంలోనైనా మాపై బాంబులు పడే అవకాశం ఉంది.. అలాంటి భయానక వాతావరణంలో మీరు ఎప్పుడైనా చర్చల్లో కూర్చున్నారా?" అని విట్‌కాఫ్‌ను తాను నేరుగా అడిగినట్లు అరాగ్చీ తెలిపారు. అయితే, ఈ మీటింగ్ ఎక్కడ జరిగిందన్న విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు.

వెనిజులా లాగా ఇరాన్ భయపడదు

గతేడాది జరిగిన అణు చర్చల (nuclear talks) నుంచి అరాగ్చీ, విట్‌కాఫ్‌ల మధ్య అడపాదడపా సంభాషణలు జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరిలో ఇరు దేశాల మధ్య భీకర దాడులు జరిగినప్పటికీ ఈ కమ్యూనికేషన్ కొనసాగింది. అయితే, ఇది అధికారిక చర్చలు (formal negotiation) కాదని ఇరాన్ పదేపదే చెబుతోంది. తాజాగా రష్యన్ న్యూస్ ఛానల్ షేర్ చేసిన 'మెహర్ న్యూస్' ఇంటర్వ్యూలో అరాగ్చీ మాట్లాడుతూ.. అమెరికా ఒత్తిడికి ఇరాన్ లొంగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. జనవరి 3న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్న తరహాలో.. ఒక వ్యక్తిని బంధించి ఇరాన్‌ నాయకత్వాన్ని లొంగదీసుకోవడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. తమ రాజకీయ వ్యవస్థ అంత బలహీనంగా లేదని ధీమా వ్యక్తం చేశారు.

సీక్రెట్ మీటింగ్స్.. ఎక్కడెక్కడంటే?

గతేడాది ప్రారంభమైన ఈ పరోక్ష చర్చలు పలు దేశాల్లో జరిగాయి. ఫిబ్రవరి 6న మస్కట్‌లో తొలి విడత చర్చలు జరగ్గా.. ఆ తర్వాత మస్కట్, రోమ్, జెనీవా, ఇస్లామాబాద్, మాస్కో వేదికగా మీటింగ్స్ జరిగాయి. అధికారిక సమావేశాలే కాకుండా టెక్స్ట్ మెసేజ్‌ల (text messages) ద్వారా కూడా వీరు నిరంతరం టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

విఫలమైన కాల్పుల విరమణ ఒప్పందం

జూన్‌లో అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ (ceasefire) ఒప్పందం ప్రస్తుతం ఆచరణలో లేదు. ఇరాన్ పోర్టులపై అమెరికా నావల్ బ్లాక్‌ను (naval blockade) తిరిగి విధించగా దానికి కౌంటర్‌గా ఇరాన్.. కీలకమైన హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) మూసివేసింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఇరాన్‌పై వరుసగా ఎనిమిది రాత్రుల పాటు అమెరికా దాడులు చేసింది. అలాగే జోర్డాన్‌లోని బేస్‌పై ఇరాన్ చేసిన క్షిపణి దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మరణించగా, మరొకరు గల్లంతయ్యారు. హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవకపోతే దాడులు తీవ్రతరం చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇస్తుండగా.. ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరిస్తోంది.

సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత

మరోవైపు.. అరాగ్చీకి సొంత దేశంలోనే హార్డ్‌లైనర్ల (hardliners) నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి అరాగ్చీ ద్రోహం చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఖమేనీ అంత్యక్రియల్లో (funeral procession) పాల్గొన్న అరాగ్చీని 'ద్రోహి' అని నినదిస్తూ కొందరు ఆందోళనకారులు రాళ్ల దాడి చేయడంతో ఆయన అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది.

కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా (ఖమేనీ కుమారుడు) స్పష్టమైన మద్దతు లేకుండానే జూన్ ఒప్పందంపై సంతకం చేశారని, ఇది ఒక రకమైన 'సాఫ్ట్ కూప్' (soft coup) అని అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ గలీబాఫ్, అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌లపై హార్డ్‌లైనర్లు మండిపడుతున్నారు. అయితే, చర్చలు అంటే రాజీ పడటం కాదని, అది తమ వ్యూహంలో భాగమేనని పార్లమెంట్ స్పీకర్ గలీబాఫ్ సమర్థించుకున్నారు.

Advertisement
Advertisement