త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump Iran Deal | ఆ ఒప్పందం ఇక ముగిసినట్లే.. ఎలాంటి డీల్ లేదన్న ట్రంప్.. తగ్గేదే లే అంటున్న ఇరాన్

అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తాత్కాలిక శాంతి ఒప్పందం ముగిసిందని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

J

International | Published On Jul 8, 2026, 4.12 pm IST

Donald Trump Iran Deal | ఆ ఒప్పందం ఇక ముగిసినట్లే.. ఎలాంటి డీల్ లేదన్న ట్రంప్.. తగ్గేదే లే అంటున్న ఇరాన్

సంక్షిప్త సారాంశం

ఇరాన్‌తో ఇటీవల కుదుర్చుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో.. ప్రతిస్పందనగా అమెరికా సుమారు 80కి పైగా ఇరాన్ మిలిటరీ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. అమెరికా దాడులకు బదులుగా కువైట్, బహ్రెయిన్‌లలో ఉన్న యూఎస్ మిలిటరీ బేస్‌లపై ఇరాన్ సైతం క్షిపణులతో విరుచుకుపడింది. టర్కీలో జరిగిన నాటో సమ్మిట్‌లో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ నాయకులను "సిక్ పీపుల్" (Sick people) అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు.

Advertisement

Donald Trump Iran Deal | త్రినేత్ర.న్యూస్ : మిడిల్ ఈస్ట్‌లో (Middle East) మళ్లీ యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. అమెరికా, ఇరాన్ (US-Iran) మధ్య కేవలం కొన్ని వారాల క్రితం కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం దాదాపుగా అటకెక్కింది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు భీకర దాడులు చేసుకుంటున్న తరుణంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire deal) ముగిసిపోయిందని (It's over) ఆయన తేల్చిచెప్పారు.

ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు.. "వారితో మాట్లాడటం టైమ్ వేస్ట్"

టర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో సమ్మిట్ (NATO Summit) నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ నాయకత్వంపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇరాన్‌తో చర్చలు జరపడం "సమయం వృథా" (Waste of time) అని అభివర్ణించారు.

"నా వరకు అయితే ఆ ఒప్పందం ముగిసిపోయింది. నేను వారితో ఇక ఎలాంటి డీల్ చేసుకోవాలనుకోవడం లేదు. వారు చాలా క్రూరమైన, ప్రమాదకరమైన వ్యక్తులు (Sick people). ఒకవేళ వారి దగ్గర అణ్వాయుధాలు ఉంటే కచ్చితంగా వాడేవారు. వారికి అబద్ధాలు చెప్పడం అలవాటు," అని ట్రంప్ మండిపడ్డారు. దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో.. వారు వాణిజ్య నౌకలపై దాడులకు దిగడం దారుణమని ఆయన పేర్కొన్నారు.

US-Iran War Trump Declares Ceasefire Deal Over After Fresh Strikes

ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు

హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వెళ్తున్న మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేసిందని ఆరోపిస్తూ.. అమెరికా భారీ ప్రతీకార దాడులకు దిగింది. మంగళవారం రాత్రి ఇరాన్‌లోని బందర్ అబ్బాస్, సిరిక్, ఖేష్మ్ దీవులతో పాటు సుమారు 80కి పైగా మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేస్తూ బాంబు దాడులు చేసింది. రాడార్ సైట్లు, యాంటీ-షిప్ మిస్సైల్ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది. ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు ఇరాన్ చమురు విక్రయాలకు ఇచ్చిన లైసెన్స్‌ను కూడా వాషింగ్టన్ రద్దు చేసింది.

గల్ఫ్ దేశాలపై దాడులు

అమెరికా దాడులపై ఇరాన్ కూడా దీటుగానే స్పందించింది. కువైట్, బహ్రెయిన్‌ (Bahrain) దేశాల్లో ఉన్న అమెరికా ఆర్మీ, నేవీ (5th Fleet) స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దాడులు చేశారు. హార్ముజ్ జలసంధిలో తమ అనుమతి లేకుండా ఏ నౌకా వెళ్లడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. అమెరికా చర్యలను "దౌర్జన్యం"గా అభివర్ణించిన ఇరాన్ సైన్యం.. తాము ఎవరి బెదిరింపులకు తలొగ్గేది లేదని, భయంకరమైన ప్రతీకారం (Crushing response) తీర్చుకుంటామని హెచ్చరించింది.

ఒకవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతుండగానే.. ఇరు దేశాల మధ్య దాడులు తీవ్రతరం కావడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. తాజా దాడులు, ట్రంప్ ప్రకటనతో గల్ఫ్ రీజియన్‌లో ముడిచమురు ధరలు (Oil prices) అమాంతం 3% మేర పెరిగాయి. మళ్లీ యుద్ధం ముదురుతుండటంతో పరిస్థితి ఎటు దారితీస్తుందోనన్న టెన్షన్ నెలకొంది.

Advertisement
Advertisement