త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | కాంగ్రెస్‌ నేతల‌కు హరీశ్‌రావు లీగల్‌ నోటీసులు.. ఆలయానికి వెళ్తే క్షుద్రపూజలు చేశారని ఆగ్రహం..!

Harish Rao | మాజీ మంత్రి హరీశ్‌రావు తరఫున కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్‌రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. దేవాలయాలకు వెళ్లిన విషయాన్ని వక్రీకరిస్తూ క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేశారంటూ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అవి ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా చేసిన దుష్ప్రచారమని నోటీసుల్లో పేర్కొన్నారు.

P

Telangana | Published On Aug 3, 2026, 10.15 pm IST

Harish Rao | కాంగ్రెస్‌ నేతల‌కు హరీశ్‌రావు లీగల్‌ నోటీసులు.. ఆలయానికి వెళ్తే క్షుద్రపూజలు చేశారని ఆగ్రహం..!
Advertisement

Harish Rao | మాజీ మంత్రి హరీశ్‌రావు తరఫున కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్‌రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. దేవాలయాలకు వెళ్లిన విషయాన్ని వక్రీకరిస్తూ క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేశారంటూ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అవి ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా చేసిన దుష్ప్రచారమని నోటీసుల్లో పేర్కొన్నారు. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో సివిల్, క్రిమినల్ పరువు నష్టం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. హరీశ్‌రావు రాజకీయ జీవితంలో మచ్చలేని పేరు సంపాదించుకున్న నాయకుడని, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణను దెబ్బతీయాలనే కుట్రతోనే కాంగ్రెస్ నేతలు ఈ ఆరోపణలు చేశారని న్యాయవాది నోటీసుల్లో పేర్కొన్నారు. జులై 31న ఉద్దేశపూర్వకంగా ఒక వీడియోను రికార్డు చేసి, దాన్ని వార్తా ఛానెళ్లు, సోషల్ మీడియా వేదికలకు పంపడం ద్వారా ఈ దుష్ప్రచారానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు.

తెలంగాణలో వర్షాలు పడకుండా, కరువు రావాలనే ఉద్దేశంతో హరీశ్‌రావు దేవాలయాలకు వెళ్లి క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేశారంటూ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. పుట్టినరోజులు, మొక్కులు తీర్చుకోవడం వంటి సందర్భాల్లో కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయాలకు వెళ్లడం మన సంస్కృతిలో భాగమని, అలాంటి భక్తి కార్యక్రమాలను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం దేవాలయాల పవిత్రతను దెబ్బతీయడమే కాకుండా భక్తుల మనోభావాలను కూడా తీవ్రంగా గాయపరుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని కూడా నోటీసుల్లో ఆరోపించారు.

ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఏయే వార్తా ఛానెళ్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ వ్యాఖ్యలు చేశారో అదే వేదికల ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే సోషల్ మీడియా, వెబ్‌సైట్లు, ప్రెస్ ఆర్కైవ్స్‌తో పాటు అన్ని డిజిటల్, ప్రింట్ వేదికల నుంచి సంబంధిత వీడియోలు, పోస్టులను తక్షణమే తొలగించాలన్నారు. నిర్ణీత గడువులోగా క్షమాపణ చెప్పకపోయినా, తప్పుడు ప్రచారానికి సంబంధించిన వీడియోలు, పోస్టులు తొలగించకపోయినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు వేస్తామని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు కాంగ్రెస్ నేతలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement