త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nvidia | ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై విచారణ.. చైనా గూఢచర్య ఆరోపణల కలకలం..

Nvidia | ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా గుర్తింపు పొందిన ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై స్వతంత్ర విచారణ ప్రారంభమైంది. చైనా గూఢచార సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు, చైనా పౌరురాలు ఆలిస్ హువాంగ్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వార్తలు ఈ వ్యవహారానికి కారణమయ్యాయి. అయితే కంపెనీ రహస్యాలు లేదా అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారం లీక్ అయినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఎన్విడియా బోర్డు వెల్లడించింది.

S

International | Published On Nov 9, 2026, 10.36 am IST

Nvidia | ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై విచారణ.. చైనా గూఢచర్య ఆరోపణల కలకలం..
Advertisement

Nvidia | ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా గుర్తింపు పొందిన ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై స్వతంత్ర విచారణ ప్రారంభమైంది. చైనా గూఢచార సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు, చైనా పౌరురాలు ఆలిస్ హువాంగ్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వార్తలు ఈ వ్యవహారానికి కారణమయ్యాయి. అయితే కంపెనీ రహస్యాలు లేదా అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారం లీక్ అయినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఎన్విడియా బోర్డు వెల్లడించింది.

ఎన్విడియా బోర్డు ఏం చెప్పింది..?

ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ (63) చుట్టూ వివాదం నెలకొంది. చైనా నిఘా కార్యకలాపాలకు ఆయన లక్ష్యంగా మారారనే వార్తల నేపథ్యంలో ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు స్వతంత్ర విచారణకు ఆదేశించింది. ఇటీవల జెన్సన్ హువాంగ్ తన సిబ్బందితో వ్యక్తిగత సంబంధానికి సంబంధించిన విషయాన్ని వెల్లడించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో స్వతంత్ర డైరెక్టర్ల కమిటీ, బయటి న్యాయ నిపుణుల సహకారంతో విచారణ చేపట్టనుంది. అమెరికా జాతీయ భద్రత, ఆర్థిక భద్రత తమకు అత్యంత ముఖ్యమని బోర్డు స్పష్టం చేసింది. ఇప్పటివరకు జాతీయ భద్రతకు లేదా ఎన్విడియా కంపెనీ రహస్యాలకు ఎలాంటి ముప్పు వాటిల్లినట్లు ఆధారాలు లేవని తెలిపింది. విచారణకు జెన్సన్ హువాంగ్ పూర్తిగా సహకరిస్తారని, ఆయన నాయకత్వంపై తమకు నమ్మకం ఉందని వెల్లడించింది.

ఆలిస్ హువాంగ్ ఎవ‌రు..?

ఈ వివాదంలో ఆలిస్ హువాంగ్ పాత్ర కీలకంగా మారింది. చైనా పౌరురాలైన ఆలిస్ హువాంగ్, సింగపూర్‌కు చెందిన డేటా సెంటర్ సంస్థ మెగాస్పీడ్‌లో గతంలో ఉన్నతాధికారిగా పనిచేశారు. ఆమెకు జెన్సన్ హువాంగ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ది టైమ్స్ కథనం ప్రకారం.. చైనా స్టేట్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ ఆమెను సమాచార సేకరణ కోసం నియమించుకున్నట్లు అమెరికా రహస్య నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆలిస్ హువాంగ్‌ను హువాంగ్ లే అని కూడా పిలుస్తారు. గతంలో చైనాలో టెలివిజన్ రిపోర్టర్‌గా పనిచేసిన ఆమె, అనంతరం టెక్నాలజీ రంగంలోకి ప్రవేశించి మెగాస్పీడ్‌లో కీలక పదవికి ఎదిగారు. ఈ సంస్థ ఎన్విడియాకు ఆగ్నేయాసియాలో అతిపెద్ద కస్టమర్లలో ఒకటిగా ఉంది. ఇప్పటివరకు మెగాస్పీడ్ సుమారు 4.8 బిలియన్ డాలర్ల విలువైన ఎన్విడియా పరికరాలను కొనుగోలు చేసినట్లు ది టైమ్స్ వెల్లడించింది. మరోవైపు, అధునాతన ఎన్విడియా చిప్‌లను అక్రమంగా చైనాకు తరలించిన ఆరోపణలపై కూడా ఆలిస్ హువాంగ్ విచారణ ఎదుర్కొంటున్నట్లు ఫోర్బ్స్ పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు ఇంకా నిరూపితం కాలేదు.

అమెరికా ఏమంటోంది..?

అమెరికా రాజకీయ వర్గాల్లోనూ ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ట్రంప్ ప్రభుత్వంలోని విధాన నిర్ణేతలకు గత వసంతకాలంలోనే ఈ రహస్య నివేదిక అందినట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. జెన్సన్ హువాంగ్‌తో తాను మాట్లాడలేదని పేర్కొంటూనే ఆయన పనితీరును ప్రశంసించారు. వచ్చే వారం ఆసియా పర్యటనకు ఆయనను ఆహ్వానించే అంశాన్ని పరిశీలించవచ్చని తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాత్రం ఈ వ్యవహారంపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. మరోవైపు.. ఎన్విడియా గతంలో ఆలిస్ హువాంగ్‌తో జెన్సన్ హువాంగ్‌కు ఉన్న పరిచయాలు సాధారణ కస్టమర్ సంబంధాలేనని స్పష్టం చేసింది. చైనా ప్రభుత్వం ఈ ఆరోపణలను నిరాధార ఊహాగానాలుగా కొట్టిపారేసింది.

ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఉన్న ఎన్విడియా తయారు చేసే చిప్‌లు కృత్రిమ మేధ మోడళ్ల అభివృద్ధికి అవసరమైన డేటా సెంటర్లలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. చైనాకు అత్యాధునిక సెమీకండక్టర్ టెక్నాలజీ అందకుండా అమెరికా విధిస్తున్న ఎగుమతి నియంత్రణల్లోనూ ఈ చిప్‌లకు ప్రాధాన్యం ఉంది. ఆగస్టులో ముగిసిన త్రైమాసికంలో ఎన్విడియా 59.69 బిలియన్ డాలర్ల లాభాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో విచారణ ఫలితాలు కంపెనీ భవిష్యత్తుతో పాటు అమెరికా-చైనా టెక్నాలజీ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement