త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apple | ఎన్విడియాను వెనక్కి నెట్టిన యాపిల్‌.. ప్రపంచంలోనే నంబర్ వ‌న్ సంస్థ‌గా మ‌ళ్లీ సెటిల్‌..

Apple | ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఏప్రిల్ 2025 తర్వాత తొలిసారిగా ఎన్విడియా కార్ప్ ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. కేవలం ఏఐ చిప్ తయారీ సంస్థలకే కాకుండా, కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా ఆదాయాన్ని సమర్థవంతంగా ఆర్జించే సామర్థ్యం ఉన్న కంపెనీలపై పెట్టుబడిదారులు ఎక్కువగా దృష్టి పెట్టడంతో ఈ మార్పు చోటుచేసుకుంది.

S

Business | Published On Jul 18, 2026, 10.21 am IST

Apple | ఎన్విడియాను వెనక్కి నెట్టిన యాపిల్‌.. ప్రపంచంలోనే నంబర్ వ‌న్ సంస్థ‌గా మ‌ళ్లీ సెటిల్‌..
Advertisement

Apple | ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఏప్రిల్ 2025 తర్వాత తొలిసారిగా ఎన్విడియా కార్ప్ ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. కేవలం ఏఐ చిప్ తయారీ సంస్థలకే కాకుండా, కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా ఆదాయాన్ని సమర్థవంతంగా ఆర్జించే సామర్థ్యం ఉన్న కంపెనీలపై పెట్టుబడిదారులు ఎక్కువగా దృష్టి పెట్టడంతో ఈ మార్పు చోటుచేసుకుంది. శుక్రవారం అమెరికా మార్కెట్ల సెష‌న్ ముగిసే నాటికి యాపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 4.88 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగా, ఎన్విడియా మార్కెట్ విలువ 4.86 ట్రిలియన్ డాలర్లకు తగ్గింది. అదే రోజు ఎన్విడియా షేరు ధర 3.5 శాతం పడిపోవడంతో యాపిల్ స్వల్ప తేడాతో అగ్రస్థానాన్ని తిరిగి దక్కించుకుంది. జెనరేటివ్ ఏఐ మోడళ్లకు అవసరమైన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ (జీపీయూ)కు భారీ డిమాండ్ కారణంగా జూన్ 2025 నుంచి ఎన్విడియా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా కొనసాగింది. అయితే ఇటీవల సెమీకండక్టర్ షేర్లలో వచ్చిన ఒడిదుడుకులు కంపెనీ మార్కెట్ విలువపై ప్రభావం చూపాయి.

యాపిల్ వెనుక‌బ‌డి ఉందా..

ఇప్పటి వరకు ఏఐ రంగంలో ఇతర బిగ్ టెక్ కంపెనీలతో పోలిస్తే యాపిల్ వెనుకబడి ఉందనే అభిప్రాయం ఉండేది. కానీ భారీ లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ల అభివృద్ధిలో పోటీ పడటానికి బదులుగా, తన బలమైన ఎకోసిస్టమ్ ద్వారా ఏఐ ని వినియోగదారుల సేవల్లో సమర్థవంతంగా ఉపయోగించి ఆదాయం పెంచగలదనే నమ్మకం పెట్టుబడిదారుల్లో పెరిగింది. బీఆర్ఐ వెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్ హెడ్ టోని మెడోస్ మాట్లాడుతూ గతంలో యాపిల్ ఏఐ మోడళ్ల అభివృద్ధికి భారీగా ఖర్చు చేయకపోవడంతో ఆ సంస్థ వెనుకబడిందనే భావన ఉండేదని, ఇప్పుడు ఆ అభిప్రాయం పూర్తిగా మారిందన్నారు. యాపిల్ భారీ క్యాపిటల్ వ్యయాలపై తక్కువగా ఆధారపడుతుందని, సేవలు, ఎకోసిస్టమ్, కొత్త హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌ల ద్వారా ఏఐ ని ఆదాయంగా మార్చుకునే స్థితిలో ఉందని తెలిపారు. ప్రస్తుతం కంపెనీపై పెట్టుబడిదారుల విశ్వాసం భవిష్యత్ లాభాల స్థిరత్వంపై ఆధారపడి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

క‌లిసొచ్చిన ఏఐ అప్‌గ్రేడ్‌..

గత నెలలో యాపిల్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సిరి ఏఐ అప్‌గ్రేడ్‌ను విడుదల చేయడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది ఐఫోన్, ఇతర యాపిల్ డివైస్‌ల వినియోగదారుల ఆధారాన్ని ఉపయోగించి రోజువారీ జీవితంలో ఏఐ ఫీచర్లను మరింత విస్తృతంగా అందించడంతోపాటు, అధిక లాభాల మార్జిన్ కలిగిన సర్వీసెస్ వ్యాపారాన్ని కూడా మరింత విస్తరించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. వినియోగదారుల వ్యక్తిగత డేటాతో రాజీ పడకుండా, గోప్యతకు ప్రాధాన్యం ఇస్తూ వ్యక్తిగతీకరించిన ఏఐ ఫీచర్లను అందించే యాపిల్ వ్యూహం కూడా కంపెనీకి ప్రత్యేక గుర్తింపును తీసుకువ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. మరోవైపు సెమీకండక్టర్ రంగంలో ఇటీవల అస్థిరత పెరిగింది. ఫిలడెల్ఫియా సెమీకండక్టర్ ఇండెక్స్ జూలైలో నమోదైన గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 19 శాతం పడిపోయింది. ఏఐ ఆధారిత ర్యాలీ ఎంతకాలం కొనసాగుతుందనే సందేహాలు పెట్టుబడిదారుల్లో పెరగడంతో ఈ రంగంలోని షేర్లపై ఒత్తిడి కనిపిస్తోంది. ఈ ప్రభావం ఎన్విడియాపై కూడా పడటంతో యాపిల్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది.

తేడా స్వ‌ల్ప‌మే..

అయితే అగ్రస్థానం కోల్పోయినప్పటికీ, ఏఐ మౌలిక వసతుల అభివృద్ధిలో ఎన్విడియా కీలక పాత్రను కొనసాగిస్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలు భారీ స్థాయిలో ఏఐ డేటా సెంటర్ల నిర్మాణానికి పెట్టుబడులు పెడుతుండటంతో ఎన్విడియాకు ఇంకా బలమైన అవకాశాలు ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. సెగల్ మార్కో అడ్వైజర్స్ లో ఆల్ఫా రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ బెంజమిన్ హాల్ మాట్లాడుతూ ప్రస్తుతం ర్యాంకింగ్ మారినా ఎన్విడియా దీర్ఘకాలిక అవకాశాల్లో పెద్ద మార్పు లేదని తెలిపారు. భవిష్యత్తులో ఏఐ రంగంలో జరిగే పరిణామాల్లో ఎన్విడియా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. యాపిల్, ఎన్విడియా మార్కెట్ విలువల మధ్య తేడా ప్రస్తుతం చాలా స్వల్పంగానే ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్విడియా షేరు ధర మళ్లీ పుంజుకుంటే అగ్రస్థానం మరోసారి మారే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాగా పెట్టుబడిదారుల దృష్టి ఇప్పుడు మ్యాగ్నిఫిసెంట్ సెవెన్ కంపెనీలకే పరిమితం కాకుండా ఏఐ మౌలిక వసతులకు అవసరమైన మెమరీ చిప్ తయారీ సంస్థలవైపు కూడా మళ్లుతోంది. ముఖ్యంగా మైక్రాన్, ఎస్‌కే హైనిక్స్ వంటి కంపెనీలు పెరుగుతున్న డిమాండ్ కారణంగా పెట్టుబడిదారుల ఆసక్తిని త‌మ వైపు తిప్పుకుంటున్నాయి.

Advertisement
Advertisement