త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UNGA | ప‌గ‌లు ప్ర‌పంచ శాంతి, రాత్రి ఉగ్ర‌వాదం.. ఇదీ దాయాది క‌ప‌ట బుద్ధి.. ఐరాసలో పాక్ పీఎం ప్రసంగంపై భారత్ ఘాటు స‌మాధానం

UNGA | ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) స‌మావేశాల్లో జమ్ము కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో పాటు భారత్‌పై ఆరోపణలు చేసిన పాక్ వైఖరిని భార‌త్ (India) తీవ్రంగా ఎండ‌గ‌ట్టింది. ఉగ్రవాదానికి పాకిస్థాన్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఘాటుగా బదులిచ్చింది.

D

International | Published On Sep 26, 2026, 12.32 pm IST

UNGA | ప‌గ‌లు ప్ర‌పంచ శాంతి, రాత్రి ఉగ్ర‌వాదం.. ఇదీ దాయాది క‌ప‌ట బుద్ధి.. ఐరాసలో పాక్ పీఎం ప్రసంగంపై భారత్ ఘాటు స‌మాధానం
Advertisement

UNGA | త్రినేత్ర న్యూస్ : ఐక్య‌రాజ్య‌స‌మితి వేదిక‌గా భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరింది. న్యూయార్క్‌లో జ‌రుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) స‌మావేశాల్లో పాకిస్థాన్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ (Pakistan PM Shehbaz Sharif) చేసిన వ్యాఖ్య‌ల‌పై భార‌త్ తాజాగా తీవ్రంగా స్పందించింది. జమ్ము కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో పాటు భారత్‌పై ఆరోపణలు చేసిన పాక్ వైఖరిని తీవ్రంగా ఎండ‌గ‌ట్టింది. ఉగ్రవాదానికి పాకిస్థాన్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఘాటుగా బదులిచ్చింది.

నిన్న ఐరాస‌లో పాక్ ప్ర‌ధాని ప్ర‌సంగిస్తూ ఆప‌రేష‌న్ సింధూర్‌, జమ్ము క‌శ్మీర్‌, సింధు జ‌లాల అంశాల‌ను ప్ర‌స్తావించారు. గ‌తేడాది భార‌త్‌తో జ‌రిగిన ఉద్రిక్త‌త‌ల స‌మ‌యంలో ట్రంప్ జోక్యం చేసుకోవ‌డంపై ప్ర‌శంస‌లు కురిపించారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే కశ్మీర్ సమస్యకు న్యాయమైన పరిష్కారం కనుగొనాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో పాటు సింధు జలాల ఒప్పందం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. పాకిస్థాన్‌కు కేటాయించిన వాటాను నిలిపివేయడానికి, అడ్డుకోవడానికి, మళ్లీంచడానికి చేసే ఏ ప్రయత్నాన్నైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని హెచ్చ‌రించారు.

పాక్ నైజ‌మే అంత

ఈ నేప‌థ్యంలో దాయాదికి భార‌త్ గ‌ట్టి హెచ్చ‌రిక‌లు పంపింది. ఐరాసలో పాకిస్థాన్ ప్రతినిధులు భారత్‌పై చేసిన ఆరోపణలకు యూఎన్‌లో భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ పెటల్ గహ్లాట్ (Petal Gehlot) "రైట్ ఆఫ్ రిప్లై" (సమాధానం చెప్పే హక్కు) ద్వారా దీటుగా బదులిచ్చారు. షరీఫ్ వ్యాఖ్యలను వింతైనవిగా అభివర్ణించిన ఆమె, ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని విమ‌ర్శించారు.

9/11 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్ గడ్డపైనే తలదాచుకున్న విషయాన్ని ఆమె ఈ సందర్భంగా సభకు గుర్తుచేశారు. పాకిస్థాన్ పగటిపూట ప్రపంచ శాంతి, భద్రత గురించి మాట్లాడుతూ, రాత్రివేళల్లో మాత్రం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని దుయ్యబట్టారు. పాక్ నైజ‌మే అంత అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఉగ్రవాద చర్యలను భారత్ ఎంతమాత్రం సహించబోదని ఈ సంద‌ర్భంగా స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఇలాగే ప్రోత్సహిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.

మూడో దేశ‌జోక్యం లేదు..

అదేస‌మ‌యంలో గ‌తేడాది మే7న భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్‌ను ఈ సంద‌ర్భంగా ఆమె ప్ర‌స్తావించారు. ఇరు దేశాల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల విష‌యంలో ట్రంప్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించారంటూ పాక్ ప్ర‌ధాని చేసిన వాద‌న‌ల‌ను తోసిపుచ్చారు. ఈ వ్య‌వ‌హారంలో మూడో దేశ జోక్యం లేద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

కశ్మీర్, పీవోకేపై భారత్ స్టాండ్

క‌శ్మీర్ విష‌యంలో పాక్ ప్ర‌ధాని చేసిన వ్యాఖ్య‌ల‌పై కూడా పెటల్ గహ్లాట్ తీవ్రంగా స్పందించారు. జ‌మ్ము క‌శ్మీర్ ఎప్ప‌టికీ భార‌త్‌లో అంత‌ర్భాగ‌మేన‌ని తేల్చి చెప్పారు. కశ్మీర్ గురించి మాట్లాడాలనుకుంటే పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై మాట్లాడాల‌ని చుర‌క‌లంటించారు. రావ‌ల్‌కోట్‌లో పాక్ ప్ర‌భుత్వం సాగిస్తున్న అన్యాయ‌మైన హ‌త్యలు, మాన‌వ హ‌క్కుల ఉలంఘ‌న‌ల గురించి స‌మాధానం చెప్పాల‌న్నారు. ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కుల గురించి పాక్ ప్ర‌సంగాలు చేయ‌డం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు.

అక్క‌డ చ‌క్రం తిప్పేది సైన్య‌మే

పాకిస్థాన్ అనేది సైన్యం కోసం, సైన్యం ద్వారా, సైన్యం చేత నడిచే పాలన అని ఎద్దేవా చేశారు. అక్క‌డి ప్ర‌భుత్వాల‌ను తోలుబొమ్మ‌లుగా అభివ‌ర్ణించారు. పాకిస్థాన్‌లో ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు మారినప్పటికీ.. అసలైన అధికారం, చక్రం తిప్పేది మాత్రం అక్క‌డి సైన్య‌మేన‌ని విమ‌ర్శించారు.

సింధూ జలాల ఒప్పందం

అదేవిధంగా ఉగ్ర‌వాదానికి మ‌ద్ద‌తు ఇస్తున్నంత కాలం సింధూ జ‌లాల ఒప్పందాన్ని నిలిపివేస్తామ‌ని భార‌త్ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసిన విష‌యాన్నిగహ్లాట్ గుర్తు చేశారు. పాక్ త‌న ద్వంద్వ ప్ర‌మాణాల‌ను వీడి వాస్త‌వాల‌ను గుర్తించాల‌ని సూచించారు. లేదంటే అంత‌ర్జాతీయ స‌మాజం ముందు ఆదేశ డొల్ల‌త‌నం బ‌య‌ట‌ప‌డ‌తూనే ఉంటుందంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Also Read..

బెంగ‌ళూరుకు వ‌చ్చే ఎమ్మెల్యేల‌కు రెండు పెళ్లిళ్లు.. డీకే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఎన్నిక‌ల సంఘం స్వ‌తంత్ర‌తే ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కు పునాది: మంత్రి ఉత్త‌మ్

నెలకు రూ.25 వేల ఎస్‌ఐపీ.. 10 ఏళ్లలో ఎంత సంపద? స్టెప్‌అప్‌తో భారీ తేడా..

Advertisement
Advertisement