త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy | ఈసీ స్వ‌తంత్ర‌తే ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కు పునాది: మంత్రి ఉత్త‌మ్

Uttam Kumar Reddy | ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కు ఎన్నిక‌ల సంఘం (EC) స్వ‌తంత్ర‌తే పునాది అని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. ఓట‌రు జాబితా స‌వ‌ర‌ణ‌లో వెలుగుచూసిన ఉదంతాల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

G

Telangana | Published On Sep 26, 2026, 11.26 am IST

Uttam Kumar Reddy | ఈసీ స్వ‌తంత్ర‌తే ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కు పునాది: మంత్రి ఉత్త‌మ్
Advertisement

Uttam Kumar Reddy | త్రినేత్ర న్యూస్‌: ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కు ఎన్నిక‌ల సంఘం (EC) స్వ‌తంత్ర‌తే పునాది అని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. ఓట‌రు జాబితా స‌వ‌ర‌ణ‌లో వెలుగుచూసిన ఉదంతాల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రిఫ‌రీపైనే అనుమానం వ‌స్తే ప్ర‌జాస్వామ్యానికే ప్ర‌మాద‌ని చెప్పారు. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ (Election Commission) స్వతంత్రత కోసం కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీ (Rahul Gandhi)ఆధ్వర్యంలో పోరాటం చేస్తామ‌న్నారు. ప్రతి భారతీయుడి ఓటు హక్కును కాపాడే వరకు కాంగ్రెస్ వెనక్కి తగ్గదని స్ప‌ష్టం చేశారు.

ఎన్నికల సంఘం బీజేపీ (BJP) కార్యాలయం కాద‌ని, ఓటరు జాబితా కేంద్ర ప్రభుత్వ ఆస్తి కాద‌ని చెప్పారు. ఓటు అధికార పార్టీ సొత్తు కాద‌ని, అది దేశ ప్రజల రాజ్యాంగ హక్కని తెలిపారు. ఎన్నికల సంఘాన్ని బీజేపీ రాజకీయ పరికరంగా మార్చే ప్రయత్నాన్ని సహించేదిలేద‌న్నారు. ఎల‌క్ష‌న్‌ కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని (CJI) ఎందుకు తొలగించార‌ని ప్ర‌శ్నించారు. ప్రధాని సూచించిన కేంద్ర మంత్రిని కమిటీలో చేర్చడం ద్వారా బీజేపీ మెజారిటీని ఖాయం చేసుకుందని ధ్వ‌జ‌మెత్తారు. గ‌తంలో రాహుల్ గాంధీ లేవనెత్తిన సందేహాలే నేడు దేశ ప్రజల ప్రశ్నలయ్యాయని చెప్పారు. ఎన్నికల కమిషనర్లు సంధు, జోషి లేవనెత్తినట్లు చెబుతున్న 14 అభ్యంతరాలపై సీఈసీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

గోవా ఉదంతానికి బాధ్యులెవరు?

గోవాలో (Goa) 97 మంది అర్హుల పేర్లు తుది జాబితాలో (Voter List) చేరకపోవడంపై ఆందోళన వ్య‌క్తం చేశారు. చట్టబద్ధ అధికారి అర్హత నిర్ధారించినప్ప‌టికీ ఓటు హక్కును సాఫ్ట్‌వేర్ అడ్డుకోవడమేమిటని ప్ర‌శ్నించారు. గోవా ఉదంతానికి బాధ్యులెవరో ఎన్నికల సంఘం దేశ ప్రజలకు వెల్లడించాలన్నారు. ఓటర్ల సంఖ్య 97 మాత్ర‌మే కావచ్చు.. కేవ‌లం ఒక్కరే కావచ్చు.. సంఖ్య చిన్నదని, హక్కు చిన్నది కాదని చెప్పారు. ఒక్క అర్హుడి ఓటు హక్కును అడ్డుకున్నా అది ప్రజాస్వామ్యంపై దాడేన‌ని స్ప‌ష్టం చేశారు. మనిషి కోసం సాంకేతికత ఉండాలి కానీ, సాంకేతికత కోసం ఓటు హక్కును బలి ఇవ్వొద్దని వెల్ల‌డించారు. 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓట‌ర్ల జాబితా నుంచి 13 కోట్లకు పైగా పేర్ల తొలగింపుపై పారదర్శకత అవసరమ‌ని పేర్కొన్నారు.

రైలు పోయాక టికెట్ ఇచ్చిన‌ట్లు..

పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) 22.21 లక్షల మంది పేర్ల పునరుద్ధరణకు అప్పీలు చేయడం చిన్న విషయం కాద‌ని చెప్పారు. ఎన్నికల తర్వాత పేరు సరిచేస్తే ప్రయోజనం ఏమిటని ప్ర‌శ్నించారు. ఓటింగ్‌కు ముందే న్యాయం జరగాల‌న్నారు. రైలు వెళ్లిపోయిన తర్వాత టికెట్ ఇచ్చినట్లు.. ఎన్నికల తర్వాత ఓటు హక్కును పునరుద్ధరించొద్దని వెల్ల‌డించారు. `అన్ని నిర్ణయాలు ఏకగ్రీవం’ అనే ఒక్క మాటతో కమిషనర్ల అభ్యంతరాలు మాయమైపోవని చెప్పారు. వివాదాస్పద నిర్ణయాలను ఎవరు అనుమతించారో ఎన్నికల సంఘం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. గోవా ఘటనతోపాటు ఓటరు జాబితాల సాంకేతిక వ్యవస్థపై నిష్పాక్షిక విచారణ జరపాల‌ని తెలిపారు.

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే..

ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) వెంట‌నే రాజీనామా చేయాల‌న్నారు. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎన్నికల ప్రక్రియను నమ్మాలని ప్రజలను ఆదేశించలేరని స్ప‌ష్టం చేశారు. ప్రజల ఓటు హక్కును దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నీ కాంగ్రెస్ చూస్తూ ఊరుకోద‌ని, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఓటు హక్కు పరిరక్షణకు ఉద్యమిస్తామ‌న్నారు.

Advertisement
Advertisement