త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harvard Medical School | మార్చురీ మేనేజ‌ర్ నిర్వాకం.. బ్లాక్‌మార్కెట్‌లో మృత‌దేహాల భాగాల విక్ర‌యం.. 440 కోట్ల ప‌రిహారం..

Harvard Medical School | మార్చురీ మేనేజ‌ర్ చేసిన నిర్వాకానికి బోస్ట‌న్‌లోని ప్ర‌తిష్ఠాత్మ‌క హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీకి చెందిన హార్వ‌ర్డ్ మెడిక‌ల్ స్కూల్ (Harvard Medical School) భారీ మొత్తంలో ప‌రిహారం చెల్లించేందుకు అంగీక‌రించింది.

G

International | Published On Aug 21, 2026, 9.27 am IST

Harvard Medical School | మార్చురీ మేనేజ‌ర్ నిర్వాకం.. బ్లాక్‌మార్కెట్‌లో మృత‌దేహాల భాగాల విక్ర‌యం.. 440 కోట్ల ప‌రిహారం..
Advertisement

Harvard Medical School | త్రినేత్ర‌.న్యూస్‌: మార్చురీ మేనేజ‌ర్ చేసిన నిర్వాకానికి బోస్ట‌న్‌లోని ప్ర‌తిష్ఠాత్మ‌క హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీకి చెందిన హార్వ‌ర్డ్ మెడిక‌ల్ స్కూల్ (Harvard Medical School) భారీ మొత్తంలో ప‌రిహారం చెల్లించేందుకు అంగీక‌రించింది. పరిశోధనలు, వైద్య విద్య కోసం దానం చేసిన మృతదేహాల భాగాలను తమ హార్వ‌ర్డ్ మెడిక‌ల్ స్కూల్ (HMS) మార్చురీ మాజీ మేనేజర్ బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముకున్నాడు. ఈ వ్య‌వ‌హారంపై బాధితుల కుటుంబాలు దాఖలు చేసిన వ్యాజ్యాలను పరిష్కరించేందుకు 53 మిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.440 కోట్లు) పరిహారం చెల్లించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేరకు హార్వర్డ్ మెడికల్ స్కూల్ డీన్లు జార్జ్ క్యూ. డేలీ, బెర్నార్డ్ ఎస్. చాంగ్ వెల్లడించారు.

మార్చురీ మాజీ మేనేజర్ సెడ్రిక్ లాడ్జ్ (Cedric Lodge) చేసిన పనులు అత్యంత హేయమైనవని, వైద్య సమాజం విలువలను హ‌రించేలా ఉన్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కోర్టు ఆమోదంతో ఈ కేసుల పరిష్కారానికి రెండు ప్రత్యేక సెటిల్‌మెంట్ నిధులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

47 కుటుంబాల తరఫున దాఖలైన కేసులు

తమ వారి మృతదేహాల ప‌ట్ల అవమానకర రీతిలో ప్ర‌వ‌ర్తించార‌ని, అమ్ముకున్నారంటూ బాధితుల తరఫున 47 మంది బంధువులు కోర్టును ఆశ్రయించారు. కాగా, మార్చురి మేనేజ‌ర్ ఏయే దాతల శరీర భాగాలను (Body Parts) దొంగిలించాడనేది ఖచ్చితంగా గుర్తించడం సాధ్యం కాదని హార్వర్డ్ పేర్కొంది. 2023లో అతను పట్టుబడిన తర్వాత, ఫెడరల్ దర్యాప్తు సంస్థల సమాచారాన్ని, మృతదేహాల దహన సంస్కారాల రికార్డులను, నిందితుడు క్యాంపస్‌లో ఉన్న సమయాలను సరిపోల్చి చూసి ఎవరెవరు బాధితులుగా ఉండవచ్చనే దానిపై ఒక అంచనాకు వచ్చామ‌ని పేర్కొంది. 2018 జనవరి 1 నుంచి 2023 మార్చి 31 మధ్య కాలంలో హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు తమ వారి శరీరాలను దానం చేసిన కుటుంబాలందరికీ ఈ సెటిల్మెంట్ వర్తిస్తుందని పేర్కొంది.

ఎనిమిదేళ్ల జైలు శిక్ష

మృతదేహాల భాగాలను ఏదో ఆటవస్తువుల్లా దొంగిలించి విక్రయించినందుకు గాను గతేడాది సెడ్రిక్ లాడ్జ్‌కు కోర్టు ఎనిమిదేండ్ల‌ జైలు శిక్ష విధించింది. లాడ్జ్ ఒక ముఠాగా ఏర్పడి శవాల నుంచి మెదడు, చర్మం, చేతులు, ముఖ భాగాలను పెన్సిల్వేనియా, ఇతర ప్రాంతాలలోని కొనుగోలుదారులకు కొరియర్ ద్వారా పంపేవాడని అధికారులు తెలిపారు. ఈ నేరంలో అతనికి సహకరించినందుకు అతని భార్య డెనిస్ లాడ్జ్‌కు ఏడాదికి పైగా జైలు శిక్ష పడింది. మృత‌దేహాల‌ భాగాలను కొనుగోలు చేసిన మరో ఆరుగురు కూడా తమ నేరాన్ని అంగీకరించగా, కోర్టు వారికి శిక్షలు ఖరారు చేసింది.

Advertisement
Advertisement