త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | డిసెంబర్‌ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ కోర్సు

CM Revanth Reddy | ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఔత్సాహికులకు ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులను డిసెంబర్‌ నుంచి అందించనుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణను ‘గ్లోబల్‌ నాలెడ్జ్‌ హబ్‌’గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని చెప్పారు.

P

Telangana | Published On Sep 17, 2026, 9.16 pm IST

CM Revanth Reddy | డిసెంబర్‌ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ కోర్సు
Advertisement
  • ఫ్యూచర్‌ సిటీలో ఎడ్యుకేషన్‌ హబ్‌ ఏర్పాటు చేస్తున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి
  • అత్యుత్తమ బిజినెస్‌ స్కూళ్లు వస్తే అగ్రగామి కార్పొరేట్‌ సంస్థల చూపు తెలంగాణ వైపు

CM Revanth Reddy | ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఔత్సాహికులకు ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులను డిసెంబర్‌ నుంచి అందించనుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణను ‘గ్లోబల్‌ నాలెడ్జ్‌ హబ్‌’గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని చెప్పారు. యూకే బిజినెస్‌ స్కూళ్ల ప్రతినిధుల బృందంతో బుధవారం ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో జరిగిన సమావేశంలో సీఎం ఈ వివరాలు వెల్లడించారు. ఈ భేటీలో యూకే హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ సభ్యుడు కరణ్‌ బిలిమొరియా, బ్రిటిష్‌ కౌన్సిల్‌ డైరెక్టర్‌ జనక పుష్పనాథన్, చార్టర్డ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బిజినెస్‌ స్కూల్స్‌ సీఈవో ఫ్లోరా హామిల్టన్, బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ప్రతినిధులతోపాటు వివిధ యూకే యూనివర్సిటీలకు చెందిన సుమారు 30 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ బిజినెస్‌ స్కూళ్ల డీన్లు, ఉన్నతస్థాయి అధికారులతో సీఎం చర్చించారు. విశ్వవిద్యాలయాలకు అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎంఐటీ, పర్డ్యూ వంటి పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్‌ క్యాంపస్‌లు ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించాయని చెప్పారు.

పరిశోధనలకు ఊతం

విదేశీ విద్యాసంస్థలు తెలంగాణకు రావడం వల్ల స్థానిక విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలతో కలిసి పనిచేసే అవకాశం పెరుగుతుందని సీఎం అన్నారు. రాష్ట్రంలోనే పరిశోధనలు చేపట్టేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. యూకేకు చెందిన అత్యుత్తమ బిజినెస్‌ స్కూళ్లు తెలంగాణలో ఏర్పాటైతే ప్రపంచస్థాయి కార్పొరేట్‌ సంస్థలు రాష్ట్రం వైపు ఆకర్షితులవుతాయని పేర్కొన్నారు. అదే సమయంలో తెలంగాణ విద్యార్థులు, అధ్యాపకులకు అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసే అవకాశం, అంతర్జాతీయ అనుభవం, ప్రపంచస్థాయి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. హార్వర్డ్, ఎంఐటీ, లండన్‌ యూనివర్సిటీ, వర్జీనియా టెక్, నార్త్‌ఈస్టర్న్‌ యూనివర్సిటీ తదితర ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌లు, డ్యూయల్‌ డిగ్రీ కోర్సులు, అధ్యాపకుల శిక్షణ, పరిశోధన తదితర రంగాల్లో భాగస్వామ్యాలను ప్రారంభించవచ్చని చెప్పారు. విద్యార్థుల్లో ఇంగ్లిష్, జర్మన్, జపనీస్‌ వంటి విదేశీ భాషలపై నైపుణ్యాన్ని పెంచేందుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

ఫ్యూచర్‌ సిటీలో ఎడ్యుకేషన్‌ హబ్‌

మారుతున్న మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా యువతకు అత్యాధునిక నైపుణ్య శిక్షణ అందించేందుకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీని దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే తొలి నెట్‌-జీరో గ్రీన్‌ఫీల్డ్‌ స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఫ్యూచర్‌ సిటీలో ఎడ్యుకేషన్‌ హబ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా భావితరాలకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. విద్య, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి రంగాలను అనుసంధానం చేసేలా భవిష్యత్‌ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’కు ఆహ్వానం

డిసెంబర్‌లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026’కు యూకే బిజినెస్‌ స్కూళ్ల ప్రతినిధుల బృందాన్ని సీఎం ఆహ్వానించారు. యూకే విద్యా వ్యవస్థలోని ప్రముఖులందరినీ గ్లోబల్‌ సమ్మిట్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు తెలిపారు. దావోస్‌లో జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం తరహాలో ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌’ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్‌ సిటీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ అగ్రగామి సంస్థలు ముందుకొస్తున్నాయని పేర్కొన్నారు. టీసీఎస్‌ రూ.70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను నిర్మించనుందని సీఎం తెలిపారు. అమెజాన్‌ ఇప్పటికే రూ.లక్ష కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్‌ నిర్మాణాన్ని చేపట్టిందని చెప్పారు.

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు

ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు, ఫార్చ్యూన్‌-500 కంపెనీలు తెలంగాణలో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రేవంత్‌రెడ్డి అన్నారు. నర్సరీ నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు.. ఐటీఐలు, పాలిటెక్నిక్‌ కాలేజీలు, స్కిల్స్‌ యూనివర్సిటీల ద్వారా యువతలో నైపుణ్యాలను పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు, యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ తదితర కార్యక్రమాల ద్వారా రాష్ట్ర విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2034 నాటికి 1 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించారు.

Advertisement
Advertisement