త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRICS తర్వాత భారత్‌కు ప్రశంసలు ఎందుకు? న్యూఢిల్లీ దౌత్యం వెనుక అసలు లెక్క ఇదే

అంతర్జాతీయంగా ఇప్పుడు ఎక్కడ చూసినా భారత్ దౌత్య వ్యూహామే హాట్ టాపిక్. చైనా, రష్యాలు పక్కన ఉన్నా... భిన్న ధ్రువాల మధ్య భారత్ సాధించిన ఈ కన్సెన్సస్ వెనుక అసలు కథేంటో చూద్దాం.

S

International | Published On Sep 15, 2026, 4.25 pm IST

BRICS తర్వాత భారత్‌కు ప్రశంసలు ఎందుకు? న్యూఢిల్లీ దౌత్యం వెనుక అసలు లెక్క ఇదే

సంక్షిప్త సారాంశం

భిన్న ప్రయోజనాలున్న 11 దేశాలతో 'న్యూఢిల్లీ డిక్లరేషన్'పై ఏకాభిప్రాయం సాధించడం ద్వారా భారత్ తన అసమాన దౌత్య శక్తిని చాటిచెప్పింది. గ్లోబల్ సౌత్ గళాన్ని వినిపిస్తూనే, చైనా నీడలో పడిపోకుండా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకోవడమే భారత్ సాధించిన అసలు విజయమని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది.

Advertisement

                        చైనా–రష్యాల మధ్య భారత్ దౌత్య స్ట్రోక్.. బ్రిక్స్ తర్వాత ప్రశంసలు ఎందుకు?

 

బ్రిక్స్ సదస్సు ముగిసింది. న్యూఢిల్లీ డిక్లరేషన్ కూడా వచ్చేసింది. కానీ భారతీయుల కోణంలో ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న మరొకటి. ఈ సదస్సు నిర్వహణ తర్వాత భారత్ దౌత్యంపై అంతర్జాతీయంగా సానుకూల చర్చ ఎందుకు జరుగుతోంది? దీనికి సమాధానం డిక్లరేషన్‌లోని అంశాల్లోనే కాదు.. దానిపై ఏకాభిప్రాయం సాధించిన తీరులోనూ ఉంది. ప్రస్తుత BRICSలో 11 సభ్యదేశాలున్నాయి. కానీ వాటి విదేశాంగ లెక్కలు ఒకేలా లేవు. రష్యా, ఇరాన్ పశ్చిమ దేశాలతో తీవ్ర ఘర్షణలో ఉన్నాయి. చైనా–అమెరికా మధ్య వ్యూహాత్మక పోటీ కొనసాగుతోంది.

యూఏఈ, సౌదీ అరేబియాలకు అమెరికాతో సన్నిహిత సంబంధాలున్నా.. చైనా, రష్యాలతోనూ సంబంధాలు పెంచుకుంటున్నాయి. భారత్, బ్రెజిల్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలు ఏ ఒక్క శక్తి శిబిరంలోనూ పూర్తిగా చేరకుండా తమ ప్రయోజనాల ఆధారంగా ముందుకెళ్తున్నాయి. అంతేకాదు.. BRICSలోని సభ్యదేశాల మధ్యే విభేదాలున్నాయి. భారత్–చైనా మధ్య సరిహద్దు సమస్య ఉంది. ఇరాన్–యూఏఈ మధ్య భౌగోళిక వివాదాలున్నాయి. ఇరాన్–సౌదీ మధ్య సంబంధాలు మొదటి నుండి ఉప్పు- నిప్పుగా ఉన్నాయి. అమెరికాతో యుద్దం తర్వాత తీవ్ర స్థాయిలో క్షీణించాయి. ఇలాంటి దేశాలన్నింటినీ ఒకే డిక్లరేషన్‌పైకి తీసుకురావడమే భారత్‌కు వచ్చిన ప్రశంసల్లో మొదటి కారణం.

విభేదాల మధ్య ఏకాభిప్రాయం.. అసలు దౌత్య పరీక్ష ఇదే

సమ్మిట్‌కు ముందు పశ్చిమాసియా పరిణామాలపై సభ్యదేశాల మధ్య విభేదాలు కనిపించాయి. గత మంత్రుల స్థాయి సమావేశాల్లోనూ ఉమ్మడి ప్రకటన సాధించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ లీడర్స్ సమ్మిట్‌లో చివరకు New Delhi Declarationపై ఏకాభిప్రాయం వచ్చింది. పశ్చిమాసియా సంక్షోభంపై ‘చర్చలు, సంప్రదింపులు, దౌత్యం’ ద్వారా పరిష్కారాలు వెతకాలనే భాషకు సభ్యదేశాలు అంగీకరించాయి. ఒమన్ రాయబారి ఇస్సా అల్షిబాని కూడా భారత్ ఏకాభిప్రాయాన్ని సాధించే సామర్థ్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. అంటే భారత్ చేసిన పని అందరినీ తన వైపు తిప్పుకోవడం కాదు.. అందరూ అంగీకరించగల మధ్యేమార్గాన్ని సృష్టించడం.

చైనా–రష్యాలతోనే ఉన్నా.. వారి శిబిరంలోకి వెళ్లకుండా!

భారత్‌కు ప్రశంసలు రావడానికి రెండో కారణం ఈ బ్యాలెన్సింగ్. BRICSలో రష్యా, చైనాలతో కలిసి పనిచేస్తూనే భారత్ అమెరికా, యూరప్‌తో వ్యూహాత్మక సంబంధాలు కొనసాగిస్తోంది. క్వాడ్‌ (భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా కూటమి)లోనూ భాగస్వామిగా ఉంది. అంటే BRICSలో ఉండటం రష్యా–చైనా ప్రతి వైఖరినీ సమర్థించడం కాదు; పశ్చిమ దేశాలతో సంబంధాలున్నంత మాత్రాన BRICS ప్రయోజనాలను వదులుకోవడమూ కాదు. BRICSను పూర్తిగా ‘యాంటీ-వెస్ట్’ రాజకీయ కూటమిగా నిర్వచించే ధోరణికి దూరంగా ఉంటూనే, ఏకపక్ష టారిఫ్‌లు, ఆంక్షలపై సభ్యదేశాల అభ్యంతరాలకు డిక్లరేషన్‌లో చోటు దక్కింది. అంటే రష్యా–చైనాలతో కలిసి నడుస్తూనే, పశ్చిమ దేశాలతో సంబంధాలను కొనసాగిస్తూ.. ఏ శిబిరం వైపూ పూర్తిగా మొగ్గకుండా భారత ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడమే ‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’ (Strategic Autonomy).

‘యాంటీ-వెస్ట్’ కంటే ‘గ్లోబల్ సౌత్’.. భారత్ పెట్టిన కొత్త ఫ్రేమ్

మూడో ఆసక్తికర అంశం ఇదే. BRICSను ‘West versus Rest’ పోరాటంగా చూపించడం కంటే.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రపంచ నిర్ణయాల్లో ఎక్కువ పాత్ర కావాలనే అంశాన్ని భారత్ ముందుకు తెచ్చింది. ప్రధాని మోదీ కూడా Global South కేవలం ‘Rule-Taker’గా కాకుండా ‘Rule-Shaper’గా మారాలని చెప్పారు. ప్రపంచ పాలనా వ్యవస్థల్లో సంస్కరణలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాతినిధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. మరో ఆసక్తికర పరిణామం.. భారత్, బ్రెజిల్‌లు ఐక్యరాజ్యసమితిలో, భద్రతా మండలి సహా, మరింత పెద్ద పాత్ర పోషించాలన్న ఆకాంక్షలకు చైనా, రష్యా మద్దతును పునరుద్ఘాటించడం. అయితే దీన్ని UNSC శాశ్వత సభ్యత్వానికి నేరుగా మద్దతుగా భావించకూడదు.

పహల్గామ్‌పై ఉమ్మడి భాష.. భారత్‌కు స్పష్టమైన ఫలితం

నాలుగో అంశం ఉగ్రవాదం. New Delhi Declaration 2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, 26 మంది మరణించిన విషయాన్ని నమోదు చేసింది. ఉగ్రవాదుల సరిహద్దు కదలికలు, ఉగ్రవాదానికి నిధులు, సురక్షిత స్థావరాలపై చర్యలతో పాటు ‘జీరో టాలరెన్స్’ అవసరమని పేర్కొంది. ఉగ్రవాద వ్యతిరేక పోరులో ‘ద్వంద్వ ప్రమాణాలు’ ఉండకూడదనీ స్పష్టం చేసింది. చైనా సహా సభ్యదేశాలన్నీ అంగీకరించిన పత్రంలో భారత్‌కు అత్యంత సున్నితమైన భద్రతా అంశాలకు ఈ స్థాయిలో చోటు రావడం న్యూఢిల్లీకి ముఖ్యమైన దౌత్య ఫలితం.

ప్రశంసలు సరే.. అసలు పరీక్ష ఇకముందే!

అందుకే బ్రిక్స్ సదస్సు తర్వాత భారత్ దౌత్యంపై వస్తున్న సానుకూల విశ్లేషణల వెనుక ఒకే కారణం లేదు. భిన్న ప్రయోజనాలున్న దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం.. చైనా–రష్యాలతో కలిసి పనిచేస్తూనే స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగించడం.. అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకను బలంగా వినిపించడం.. ఉగ్రవాదంపై భారత్ ఆందోళనలకు ఉమ్మడి ప్రకటనలో చోటు కల్పించడం—ఈ నాలుగు అంశాల కలయికే న్యూఢిల్లీ దౌత్యానికి బలంగా నిలిచింది.

అయితే బ్రిక్స్ విస్తరిస్తున్న కొద్దీ తన భారీ ఆర్థిక శక్తితో కూటమిలో ప్రభావాన్ని పెంచుకునే అవకాశం చైనాకు కూడా ఉంది. అందుకే భారత్‌కు అసలు పరీక్ష ఇకముందే ఉంది. చైనాతో కలిసి పనిచేస్తూనే ఆ దేశం నీడలోకి వెళ్లకుండా.. రష్యాతో సంబంధాలు కొనసాగిస్తూనే పశ్చిమ దేశాలతో భాగస్వామ్యాన్ని దెబ్బతీయకుండా.. అభివృద్ధి చెందుతున్న దేశాల తరఫున బలమైన గొంతుకగా తన స్వతంత్ర స్థానాన్ని నిలబెట్టుకోవాలి. అందరినీ తనవైపు తిప్పుకోవడం భారత్ సాధించిన విజయం కాదు. పరస్పరం భిన్నమైన దేశాల మధ్య తన ప్రయోజనాలకు అవసరమైన స్వతంత్ర దౌత్య స్థానాన్ని కాపాడుకోవడమే అసలు విజయం. భారత్‌కు వస్తున్న ప్రశంసల వెనుక ప్రధాన కారణం కూడా అదే.

Advertisement
Advertisement