Hyderabad | త్రినేత్ర.న్యూస్ : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు.. పదో తరగతి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాలికను లైంగికంగా వేధిస్తూ.. తనతో సన్నిహితంగా ఉండాలని వేధించాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్టలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. జగద్గిరిగుట్టకు చెందిన ఓ బాలిక స్థానికంగా ఉన్న పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. అయితే స్కూల్ ప్రిన్సిపాల్ ఆ బాలికపై కన్నేశాడు. కామంతో రగిలిపోయాడు. ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. తాకరాని చోట తాకుతూ మానసికంగా వేధించాడు. ప్రధానోపాధ్యాయుడి వేధింపులు తాళలేక బాధిత విద్యార్థిని తన తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. ఆగ్రహావేశాలకు లోనైన బాలిక తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. స్కూల్ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రధానోపాధ్యాయుడిపై కేసు నమోదైందని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని జగద్గిరిగుట్ట పీఎస్ ఇన్‌స్పెక్టర్ బీ వెంకటేశం తెలిపారు.