త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyber Crime Cases | నెల రోజులు.. 54 కేసులు.. 66 అరెస్టులు

Cyber Crime Cases | గత మే నెలలో ఎన్‌సీఆర్‌పీ (NCRP) ఫిర్యాదులు అందాయని, వాటిలో 54 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన‌ట్లు హైద‌రాబాద్ క్రైమ్ అండ్ ఎస్ఐటీ ఏసీపీ తెలిపారు. వివిధ కేసుల్లో 66 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు.

S

Hyderabad | Published On Jun 12, 2026, 3.00 pm IST

Cyber Crime Cases | నెల రోజులు.. 54 కేసులు.. 66 అరెస్టులు
Advertisement
  • ఇవీ మే నెల సైబ‌ర్ కేసుల వివ‌రాలు
  • ఎనీటైం అల‌ర్ట్‌గా ఉండాలంటున్న పోలీసులు

Cyber Crime Cases | త్రినేత్ర‌.న్యూస్: గత మే నెలలో ఎన్‌సీఆర్‌పీ (NCRP) ఫిర్యాదులు అందాయని, వాటిలో 54 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన‌ట్లు హైద‌రాబాద్ క్రైమ్ అండ్ ఎస్ఐటీ ఏసీపీ తెలిపారు. నెల రోజుల్లో జ‌రిగిన క్రైమ్ వివ‌రాల‌ను ఆయ‌న శుక్ర‌వారం వెల్ల‌డించారు. వివిధ కేసుల్లో 66 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. సొత్తును స్వాధీనం చేసుకున్న‌ట్లు పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు కారణమవుతున్నపాన్-ఇండియా 'ఘోస్ట్ సిమ్' (Ghost SIM) రాకెట్‌ లక్ష్యంగా ఆపరేషన్ ఆక్టోపస్ -3.O అనే ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన‌ట్లు చెప్పారు. మోసపూరిత కేవైసీ (KYC) సేకరణ, అనధికారిక సిమ్ యాక్టివేషన్ల నుండి సెక్‌స్టార్షన్ (Sextortion), డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, ఆర్థిక మోసాల్లో ఉపయోగించే అక్రమ ఇ-సిమ్ (e-SIM) మార్పిడుల గుట్టును ర‌ట్టు చేశామ‌న్నారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు అండ‌గా నిలుస్తున్న ఓ పెద్ద నెట్‌వర్క్‌ను ఛేదించామ‌న్నారు. హైదరాబాద్ సిటీ లా అండ్ ఆర్డర్ బృందాలతో కలిసి వివిధ రాష్ట్రాల నుండి 66 మంది నిందితులను అరెస్ట్ చేశామ‌న్నారు. వీరిలో 44 మంది ఘోస్ట్ సిమ్ కార్డ్ హోల్డర్లు, 20 మంది పీఓఎస్ (PoS) ఏజెంట్లు, ఇద్ద‌రు ఘోస్ట్ సిమ్ సప్లయర్లు ఉన్నార‌ని తెలిపారు. వీరిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో 48 కేసులు న‌మోదు కాగా అరెస్ట్ చేసిన‌ట్లు పేర్కొన్నారు.

ఇవీ కేసుల వివ‌రాలు..

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 74 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిలో ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ (పెట్టుబడి మోసం)లో 33 మంది, సోషల్ మీడియా కేసుల్లో న‌లుగురు, లోన్ ఫ్రాడ్‌లో ఇద్దరు, ట్రేడింగ్ ఫ్రాడ్‌లో ఏడుగురు, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్‌లో 12 మంది, జాబ్ ఫ్రాడ్‌లో ముగ్గురు, ఓటీపీ ఫ్రాడ్ (OTP Fraud) లో ఐదుగురు, ఏపికే ఫ్రాడ్ (APK Fraud)లో ముగ్గురు, డేటింగ్ ఫ్రాడ్‌లో ఒకరు, డిజిటల్ అరెస్ట్‌లో ఇద్దరు, కస్టమర్ కేర్‌లో ఒకరు, బిజినెస్ మోసంలో ఒకరు ఉన్నారు.

రాష్ట్రాల వారీగా అరెస్ట్ అయినవారి సంఖ్య..

కర్ణాటక నుండి 6, తెలంగాణ నుండి 19, ఆంధ్రప్రదేశ్ నుండి 16, మధ్యప్రదేశ్ నుండి 2, పశ్చిమ బెంగాల్ నుండి 3, ఉత్తరప్రదేశ్ నుండి 7, ఢిల్లీ నుండి 3, తమిళనాడు నుండి 5, గుజరాత్ నుండి 5, మహారాష్ట్ర నుండి 4, ఒడిశా నుండి ఒకరిని అరెస్ట్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. నేరస్థుల నుండి 43 మొబైల్ ఫోన్లు, 32 సిమ్ కార్డులు, 19 ల్యాప్‌టాప్‌లు, 10 సంఖ్యల బ్యాంక్ పాస్‌బుక్‌లు, ఒక చెక్ బుక్‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు సైబ‌ర్ క్రైమ్ పోలీసులు చెప్పారు.

రీఫండ్ వివరాలు..

మొత్తం 25 కేసుల్లో రూ.10,03,04,239 నష్టపోగా, రూ.68,27,304 మొత్తాన్ని బాధితుల‌కు అంద‌జేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. 10 కేసుల్లో రూ.2,30,23,790 ఇన్వెస్ట్‌మెంట్ మోసం జ‌ర‌గ్గా రూ. 21,15,104 అందించారు. ట్రేడింగ్ మోసంలో 9 కేసులకు సంబంధించి రూ. 5,24,64,512 పోగొట్టుకోగా రూ. 38,05,314 రీఫండ్ చేశారు. ఇంపర్సనేషన్ (అవతార మార్పిడి) 3 కేసుల్లో రూ.2,00,05,694 నష్టానికి రూ.5,86,886 రీఫండ్ అయ్యింది. ఏపికే ఫైల్ (APK file) మోసానికి సంబంధించిన కేసులో రూ.2,40,354 కోల్పోగా రూ.50,000 రీఫండ్ చేశారు. మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ కేసులో రూ.44,48,900 కోల్పోగా రూ.1,50,000 రీఫండ్ చేశారు. ఓటీపీ ఫ్రాడ్ కేసులో రూ.1,20,989 నష్టానికి రూ. 1,20,000 మొత్తాన్ని బాధితులకు రీఫండ్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

జోనల్ సైబర్ సెల్స్ (ZCC) డేటా..

మే నెల‌లో జోనల్ సైబర్ సెల్స్ (ZCC)కు మొత్తం 2531 ఎన్‌సీఆర్‌సీ (NCRP) దరఖాస్తులు రాగా, వాటిలో 349 ఎఫ్‌ఐఆర్‌లు (FIRs) నమోదయ్యాయి. 18 కేసుల్లో 23 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. బాధితులకు రూ. 25,32,902 మొత్తాన్ని తిరిగి అప్ప‌గించారు.

సైబర్ పెట్రోల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (Cyber Patrol Enforcement)..

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో క్రియాశీలంగా పనిచేస్తున్న 251 సోషల్ మీడియా ప్రొఫైల్‌లను గుర్తించారు. ఇవి దేశంలోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని వివిధ రకాల ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ అప్లికేషన్‌లు, నకిలీ పెట్టుబడి వెబ్‌సైట్‌లను ప్రోత్సహించే 304 పెయిడ్ అడ్వర్టైజ్‌మెంట్‌లను (Paid Advertisements) నడుపుతున్నాయి. సులభంగా డబ్బు సంపాదించవచ్చని.. పెట్టుబడులపై భారీ లాభాలు వస్తాయని ఆశజూపి వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షిస్తున్నారు. గుర్తించిన మొత్తం 251 ప్రొఫైల్‌లను సంబంధిత ప్లాట్‌ఫారమ్‌లకు చేర‌వేసి నివారించారు. సైబర్ పెట్రోల్ కార్యక్రమాల్లో భాగంగా దేశంలోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్ గేమింగ్, అక్రమ బెట్టింగ్, నకిలీ పెట్టుబడి వెబ్‌సైట్‌లను ప్రోత్సహిస్తున్న మొత్తం 678 సోషల్ మీడియా ప్రొఫైల్‌లను, 2207 పెయిడ్ ప్రమోషనల్ అడ్వర్టైజ్‌మెంట్‌లను ఇప్పటివరకు గుర్తించి తొలగించారు.

సి-మిత్ర (C-MITRA)

'సి-మిత్ర' చొరవతో బాధితులకు స‌త్వ‌ర స‌హాయ‌క‌ చర్యలను అందించారు. ఫిర్యాదుల ఆధారంగా 252 జీరో ఎఫ్‌ఐఆర్‌లు (Zero FIRs) నమోదయ్యాయి.

మోడస్ ఒపెరాండి: క్రిప్టో ట్రేడింగ్ (CRYPTO TRADING)

ఫిర్యాదుదారునికి 2025, అక్టోబ‌ర్‌ 23న Shaadi.comలో అంజలి కందుల అనే మహిళ ప్రొఫైల్ పరిచయమైంది. ఆ తర్వాత వారు వాట్సాప్ ద్వారా మాట్లాడుకున్నారు. తాను యూకే (UK)లో అజూర్ డెవొప్స్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నానని చెప్పి న‌మ్మ‌బ‌లికింది. ఆ తర్వాత అతనికి "Bakktcoin" అనే క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ గురించి తెలిపింది. నిపుణుల ట్రేడింగ్ సిగ్నల్స్ ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించింది. ప్రారంభంలో అతనికి చిన్న మొత్తంలో లాభం చూపించారు. ఇది నమ్మి అతను బ్యాంక్ బదిలీలు, యుపీఐ (UPI) లావాదేవీలు, బైనాన్స్ USDT (ERC20) బదిలీల ద్వారా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. ఆ ప్లాట్‌ఫామ్ అతని ఖాతాలో 14,481 USDT బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించింది. దీంతో భారీ లాభాలు వచ్చినట్లు భ్రమ కలిగించింది. బాధితుడు ఆ డ‌బ్బుల‌ను తీసుకోవ‌డానికి న‌వంబ‌ర్ 13న ప్ర‌య‌త్నించాడు. నిందితులు విత్‌డ్రా ప్రాసెస్ చేయడానికి బదులుగా మరింత పెట్టుబడి పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో తాను మ్యాట్రిమోనియల్ క్రిప్టో-ఇన్వెస్ట్‌మెంట్ మోసానికి గురయ్యానని గ్రహించి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. బాధితుడు మొత్తం రూ. 11,20,500 న‌ష్ట‌పోయాడు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 2085/2025, యు/సెక్ 66 C, 66 D ఐటీ యాక్ట్ (IT Act), బీఎన్ఎస్ (BNS)లోని సెక్షన్లు 318(4), 319(2), 336(3), 338, 340(2) కింద కేసు నమోదు చేశారు.
అరెస్ట్ అయిన నిందితుల వివ‌రాలు..
- A5) చుక్కా రాజేష్ వినయ్ కుమార్, కాపుతుంగలాం, BHPV, గాజువాక, ఆంధ్రప్రదేశ్
- A6) రావూరి నాగేశ్వరరావు, రసూల్‌పేట, చందోలు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
- A7) దాసరి షణ్ముఖరావు, అక్కయ్యపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
- A8) ఎస్.రాజశేఖర్ మురళీ నగర్, కళింగ నగర్, మాధవధార, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
- A9) నల్లమల్లి వెంకట నాగ చంద్ర శేఖర్, నిడుబ్రోలు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్

ఇవీ పోలీసుల సూచ‌న‌లు..

ప్రభుత్వ ఉన్నతాధికారుల పేరిట నకిలీ ప్రొఫైల్స్ (Fake Profiles of Senior Government Officials)

  • సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రభుత్వ ఉన్నతాధికారుల పేరిట డబ్బులు లేదా ఇతర సహాయాలు కోరుతూ వచ్చే నకిలీ సందేశాలు లేదా ఫ్రెండ్ రిక్వెస్ట్‌ల పట్ల జాగ్రత్తగా ఉండ‌డం
  • సందేశాలు వచ్చినప్పుడు వాటిని స‌రిచూసుకోవాలి
  • అవతలి వ్యక్తి ఎవ‌రు, వారు పంపిణ మెసేజ్‌ చట్టబద్ధంగా నిర్ధారించుకోకుండా ఎలాంటి డబ్బును బదిలీ చేయవద్దు

సోషల్ మీడియాలో నకిలీ పెట్టుబడి గ్రూపులు (Fake Investment Groups on Social Media)

  • టెలిగ్రామ్, వాట్సాప్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో నకిలీ పెట్టుబడి గ్రూపులు తక్కువ లేదా అసలు రిస్క్ లేకుండా భారీ లాభాలు అందిస్తామంటూ నకిలీ పెట్టుబడి పథకాలను ప్రచారం చేస్తున్నాయి
  • ఎల్లప్పుడూ సెబీ (SEBI) ఆమోదించిన అప్లికేషన్ల ద్వారానే పెట్టుబడులు పెట్టాలి. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు సెబీ-రిజిస్టర్డ్ ఆర్థిక సలహాదారుని సంప్రదించాలి
  • త్వరగా ధనవంతులు కావచ్చు" అనే ఆశ చూపే ధృవీకరించని గ్రూపులను లేదా తెలియని వ్యక్తులను అస్సలు న‌మ్మొద్దు

ప్రమాదకరమైన ఏపీకే (APK) ఫైళ్లు, ఫిషింగ్ లింకులు (Malicious APK Files and Phishing Links)

  • నేరగాళ్లు బ్యాంకులు లేదా అధికారిక సంస్థల వలె నటిస్తూ ఎస్ఎమ్ఎస్ (SMS), వాట్సాప్ ద్వారా ప్రమాదకరమైన ఏపీకే (APK) ఫైళ్లను లేదా లింకులను పంపుతున్నారు.
  • బ్యాంకులు ఎప్పుడూ ఎస్ఎమ్ఎస్ లేదా వాట్సాప్ ద్వారా ఏపికే ఫైళ్లను లేదా లింకులను పంపవని గుర్తుంచుకోవాలి
  • అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయొద్దు. తెలియని ఫైళ్లను డౌన్‌లోడ్ చేయొద్దు. ఎందుకంటే అవి మీ వ్యక్తిగత, ఆర్థిక డేటాను చోరీ చేసే అవ‌కాశం ఉంది
  • మీ మొబైల్ పరికరాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. విశ్వసనీయమైన యాంటీవైరస్ రక్షణను ఉపయోగించాలి

వాట్సాప్ డీపీ మోసాలు (WhatsApp DP Frauds)

  • మోసగాళ్లు మీ డిస్‌ప్లే పిక్చర్ (DP)ను కాపీ చేసి, మీలాగే నటిస్తూ లేదా మీ చిత్రాలను మార్ఫింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తూ నకిలీ ప్రొఫైల్‌ను సృష్టించవచ్చు
  • ఎల్లప్పుడూ మీ డీపీని లాక్ చేసుకోండి, వాట్సాప్ సెట్టింగ్స్‌లో 'టూ-స్టెప్ వెరిఫికేషన్' (Two-step verification)ను ఎనేబుల్ చేసుకోండి.

హనీ ట్రాప్/సోషల్ మీడియా ప్రొఫైల్/మ్యాట్రిమోనియల్ మోసం (Honey Trap/Social Media Profile/Matrimonial Fraud)

  • సైబర్ నేరగాళ్లు అమాయకులను ఉచ్చులోకి లాగడానికి పురుషులు లేదా మహిళల పేరిట నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌లను ఎక్కువగా సృష్టిస్తున్నారు. వారు స్నేహపూర్వక సంభాషణలను ప్రారంభించి, నమ్మకాన్ని క‌లిగిస్తారు. సన్నిహిత కంటెంట్‌ను పంచుకునేలా ప్రేరేపిస్తారు. వీడియో కాల్స్ చేసి, వాటిని రహస్యంగా రికార్డ్ చేసి, ఆ తర్వాత డబ్బు ఇవ్వకపోతే ఆ కంటెంట్‌ను సర్క్యులేట్ చేస్తామని బెదిరిస్తారు. ఈ రకమైన నేరాన్ని 'సెక్స్‌టార్షన్' (Sextortion) అంటారు.
  • సోషల్ మీడియా ప్రొఫైల్‌లను ఎల్లప్పుడూ క్షుణ్ణంగా పరిశీలించండి. అనుమానం వస్తే వెంటనే సదరు వ్యక్తితో మాట్లాడటం నిలిపివేయాలి. కేవలం గుర్తింపు పొందిన, విశ్వసనీయమైన మ్యాట్రిమోనియల్ సైట్‌లను మాత్రమే ఉపయోగించండి.

డిజిటల్ అరెస్ట్, అవతార మార్పిడి స్కామ్‌లు (“Digital Arrest” and Impersonation Scams)

  • సీబీఐ (CBI), ఆర్‌బీఐ (RBI), ఈడీ (ED), కస్టమ్స్, న్యాయవ్యవస్థ, సైబర్ క్రైమ్ పోలీస్, నార్కోటిక్స్ బ్యూరో, ఫెడెక్స్ (FedEx), బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL), ట్రాయ్ (TRAI) లేదా లాంటి సంస్థల నుండి మాట్లాడుతున్నామని క్లెయిమ్ చేస్తూ బెదిరింపు వీడియో కాల్స్ లేదా సందేశాలు వస్తే భయాందోళనకు గురికావద్దు
  • ఏ ప్రభుత్వ సంస్థ లేదా చట్టాన్ని అమలు చేసే అధికారి కూడా ఫోన్ లేదా స్కైప్ (Skype) కాల్స్ ద్వారా డబ్బు డిమాండ్ చేయరు
  • మన వ్యవస్థలో "డిజిటల్ అరెస్ట్" లేదా ఆన్‌లైన్ విచారణ అనేది ఎక్కడా లేదు

తక్షణ ఫిర్యాదుతో డ‌బ్బు సేఫ్‌ (Immediate Reporting Can Save Your Money)

  • ఒకవేళ ఇటువంటి ఏదైనా సైబర్ మోసానికి గురైతే, తక్షణమే ఫిర్యాదు చేయ‌డం ద్వారా మీ నష్టపోయిన మొత్తంలో కొంత భాగాన్ని లేదా మొత్తాన్ని ఆప‌డానికి (Freeze), రికవరీ చేయడానికి వీల‌వుతుంది.

హెల్ప్‌లైన్ నంబర్: 1930
ఆన్‌లైన్ ఫిర్యాదుల కోసం వెబ్‌సైట్‌: www.cybercrime.gov.in

Advertisement
Advertisement