త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NALSAR Students vs CJI Surya Kant | కాన్వకేషన్‌కు ‘చీఫ్ గెస్ట్’గా సీజేఐ సూర్యకాంత్ వద్దే వద్దు: నల్సార్ విద్యార్థుల సంచలన నిర్ణయం

ఢిల్లీ నిరసనలపై సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యలతో నల్సార్ వర్సిటీ విద్యార్థులు భగ్గుమన్నారు. కాన్వకేషన్‌కు ఆయనను చీఫ్ గెస్ట్‌గా పిలవొద్దని తేల్చి చెప్పారు.

J

Hyderabad | Published On Aug 9, 2026, 3.37 pm IST

NALSAR Students vs CJI Surya Kant | కాన్వకేషన్‌కు ‘చీఫ్ గెస్ట్’గా సీజేఐ సూర్యకాంత్ వద్దే వద్దు: నల్సార్ విద్యార్థుల సంచలన నిర్ణయం
Advertisement
  • హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ 2026 కాన్వకేషన్‌కు సీజేఐ సూర్యకాంత్‌ను ఆహ్వానించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విద్యార్థులు
  • ఢిల్లీలో జరిగిన నిరసనల సమయంలో పోలీసుల తీరుపై విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలే ఈ వ్యతిరేకతకు ప్రధాన కారణం
  • సీజేఐ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ సుమారు 450 మంది విద్యార్థులు వీసీ, రిజిస్ట్రార్‌కు లేఖ 
  • విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ఇటీవలే ముంబైలోని టిస్ (TISS) సైతం తమ స్నాతకోత్సవాన్ని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే

NALSAR Students vs CJI Surya Kant | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (NALSAR- నల్సార్) యూనివర్సిటీలో తీవ్ర దుమారం రేగుతోంది. తమ 2026 కాన్వకేషన్ (స్నాతకోత్సవం) వేడుకకు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్‌ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించడాన్ని విద్యార్థులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండే తమ వర్సిటీకి, ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీజేఐ రావడం ఏమాత్రం ఇష్టం లేదని తేల్చి చెబుతున్నారు.

వ్యతిరేకతకు కారణం ఏంటి?

జూలై 20, 2026న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల (CJP, NEET ఇష్యూస్) సందర్భంగా నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పాటు ఎలక్ట్రిక్ బాటన్లతో దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సుమోటోగా విచారణ చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

అయితే, పోలీసుల దాడికి సంబంధించిన వీడియో ఆధారాలను చూసేందుకు సీజేఐ నిరాకరించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. "మాకు వీడియోలు చూసే ఆసక్తి లేదు. వాటిని చూసేంత సమయం కూడా లేదు. మా టైమ్, మీ టైమ్ వేస్ట్ చేయకండి" అని సీజేఐ వ్యాఖ్యానించినట్లు విద్యార్థులు తమ లేఖలో ప్రస్తావించారు. యువతను కించపరిచేలా ఆయన మాట్లాడటం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

వీసీకి 450 మంది విద్యార్థుల లేఖ

లా స్టూడెంట్స్‌గా రాజ్యాంగ హక్కులు, న్యాయం పట్ల తమకు స్పష్టమైన అవగాహన ఉందని విద్యార్థులు చెబుతున్నారు. "పోలీసుల దౌర్జన్యంపై కనీసం వీడియోలు చూసేందుకు కూడా సమయం లేదన్న వ్యక్తి చేతుల మీదుగా.. ఎంతో ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉన్న డిగ్రీలు తీసుకోవడం మాకు ఇష్టం లేదు" అని 2026 బ్యాచ్ విద్యార్థులు స్పష్టం చేశారు. ఈ మేరకు సుమారు 450 మందికి పైగా విద్యార్థులు వీసీకి, రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. సీనియర్ల నిర్ణయానికి జూనియర్ బ్యాచ్‌ల విద్యార్థులు కూడా మద్దతు ప్రకటించారు.

NALSAR Students Oppose CJI Surya Kant as Convocation Guest

టిస్ (TISS) బాటలోనే నల్సార్?

ఈ వివాదం కేవలం నల్సార్‌కే పరిమితం కాలేదు. సరిగ్గా రెండు వారాల క్రితం ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) కూడా ఇదే తరహా నిరసనల భయంతో తమ 86వ కాన్వకేషన్‌ను చివరి నిమిషంలో వాయిదా వేసుకుంది. అక్కడ కూడా సీజేఐ సూర్యకాంత్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకావాల్సి ఉంది.

తేలని కాన్వకేషన్ డేట్

సాధారణంగా నల్సార్ కాన్వకేషన్‌కు సీజేఐ చీఫ్ గెస్ట్‌గా రావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ డైలమాలో పడింది. ఇప్పటివరకు కాన్వకేషన్ తేదీని అధికారికంగా ప్రకటించలేదు, విద్యార్థుల లేఖపై కూడా స్పందించలేదు. ఒకవేళ తమ డిమాండ్‌ను పట్టించుకోకపోతే క్యాంపస్‌లో ఆందోళన తీవ్రతరం చేస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. యాజమాన్యం 'వెయిట్ అండ్ వాచ్' ధోరణిని అవలంబిస్తుండటంతో.. నల్సార్ స్నాతకోత్సవం ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదని క్యాంపస్ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement