Biryani Capital | త్రినేత్ర.న్యూస్ : బిర్యానీ అంటేనే అందరికీ గుర్తొచ్చేది హైదరాబాద్ దమ్ బిర్యానీ. భాగ్యనగరంలో ఏ రెస్టారెంట్‌కు వెళ్లి ఆరగించిన ఆ దమ్ బిర్యానీ టెస్టే వేరు. నోరూరిందంటే చాలు.. ఏదో రెస్టారెంట్‌లో వాలిపోయి హైదరాబాద్ దమ్ బిర్యానీని లాగించేయాల్సిందే. ఆహార ప్రియుల నోళ్లల్లో నోరూరించే హైదరాబాద్ దమ్ బిర్యానీ 2025లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సరికొత్త చరిత్రతో బిర్యానీ క్యాపిటల్‌గా హైదరాబాద్ నగర్ ప్రసిద్ధి గాంచింది. గతేడాదిలో 1.08 కోట్ల బిర్యానీ ఆర్డర్లను చేసుకున్నట్లు స్విగ్గీ సంస్థ ప్రకటించింది. మొత్తం స్విగ్గీ ఆర్డర్లలో ఇది 61 శాతమని ఆ సంస్థ పేర్కొంది. 2025లో మొత్తం 1.75 కోట్ల ఆర్డర్లు రాగా, ఇందులో 1.08 కోట్ల బిర్యానీ ఆర్డర్లు, 39.9 లక్షల దోస ఆర్డర్లు, 31 లక్షల ఇడ్లీ ఆర్డర్లు చేసుకున్నట్లు వెల్లడైంది. బూందీ లడ్డూ ఆర్డర్లు 3.3 లక్షలు ఉన్నట్లు పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో చాక్లెట్ కేక్, గులాబ్ జామ్ ఆర్డర్లు ఉన్నాయి. చికెన్ బర్గర్ ఆర్డర్లు 6.8 లక్షలు ఉన్నాయి. చికెన్ ఫ్రై, చికెన్ షవర్మా, వెజిటేరియన్ పిజ్జా, వెజిటేరియన్ పఫ్స్ ఆర్డర్లు కూడా బాగానే ఉన్నాయి. ఇక దేశ వ్యాప్తంగా గతేడాది 1.24 బిలియన్ కిలోమీటర్ల మేర స్విగ్గీ ప్రయాణించింది. బెంగళూరుకు చెందిన ఓ డెలివరీ బాయ్ మొత్తం 11,718 ఆర్డర్లు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచాడు. చెన్నైకి చెందిన ఓ మహిళా కూడా 8,169 ఆర్డర్లను డెలివరీ చేసి ప్రత్యేకత సంపాదించుకుంది.